Balineni Srinivasa Reddy: పవన్‌ను కలిసి బయటకు వచ్చాక బాలినేని ఆసక్తికర కామెంట్స్
మాజీ మంత్రి బాలినేని త్వరలోనే జనసేనలో చేరబోతున్నారు. ఒంగోలులోనే జాయినింగ్ కార్యక్రమం ఉండబోతోంది. తనతో పాటు మరికొంత మంది కూడా పార్టీ కండువా కప్పుకోబోతున్నారని బాలినేని ప్రకటించారు. ఇంతకీ ఎవరా నేతలు? జిల్లాలో వైసీపీకి జరగబోయే నష్టమెంత?
ఎన్నాళ్ల నుంచో అసంతృప్తిగా ఉన్న బాలినేని.. జనసేన గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జనసేన అధినేత పవన్‌తో ఇప్పటికే బాలినేని భేటీ అయ్యారు. అతి త్వరలోనే జనసేన కండువా కప్పుకోబోతున్నట్టు బాలినేని ప్రకటించారు. ఎలాంటి కండీషన్లు లేకుండా జనసేనలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు బాలినేని.
తను చేరడమే కాకుండా.. తనతో పాటు కలిసి వచ్చే నేతలను కూడా తీసుకుని వస్తానంటున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనతో పాటు జాయిన్ అవుతారని బాలినేని ప్రకటించారు. జనసేనకు లాభం చేక్చూర్చే నేతలను.. పార్టీలోకి తీసుకొచ్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానంటున్నారు బాలినేని.
వైఎస్ మీద అభిమానంతో ఇన్నాళ్లూ జగన్ వెంట నడిచా.. కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ తనను పట్టించుకోలేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో జరిగేది చెప్పినా జగన్‌కు నచ్చలేదు. అధిష్ఠానం తీరు నచ్చక.. ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కోటరీ వల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఏ పదవులూ ఆశించకుండానే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు బాలినేని శ్రీనివాసరెడ్డి.
మరోవైపు బాలినేని పార్టీలోకి వస్తుండటంతో ప్రకాశం జిల్లా జనసేనలో ఉత్సాహం వచ్చింది. బాలినేని ఎంట్రీతో తమ పార్టీ మరింత బలపడుతుందని జనసేన కేడర్ అభిప్రాయపడుతోంది. బాలినేని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒంగోలులో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన కార్యకర్తలు. అయితే ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో బాలినేనికి ఎప్పటి నుంచో రాజకీయ వైరం కొనసాగుతోంది. మరి బాలినేని జనసేనలో చేరితే.. కూటమి నేతలు ఎలా ముందుకెళ్తారో చూడాలి మరి.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి