YSRCP: వైసీపీకి తలనొప్పిగా మారిన మంత్రి.. పార్టీ మారబోతున్నారా..
ఏపీ రాజకీయాలు రోజు రోజుకు కొత్త రూపం దాల్చుతోంది. నిన్న మొన్నటి వరకూ కేసులు, కోర్టు తీర్పులపై రాజకీయాలు నడిచాయి. గడిచిన పక్షం రోజుల నుంచి అభ్యర్థుల ప్రకటనలు, బహిరంగ సభలతో ఏపీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
కర్నూలు, జనవరి 23: ఏపీ రాజకీయాలు రోజు రోజుకు కొత్త రూపం దాల్చుతోంది. నిన్న మొన్నటి వరకూ కేసులు, కోర్టు తీర్పులపై రాజకీయాలు నడిచాయి. గడిచిన పక్షం రోజుల నుంచి అభ్యర్థుల ప్రకటనలు, బహిరంగ సభలతో ఏపీ రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సీఎం జగన్.. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. అయినప్పటికీ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు మంత్రి జయరాం సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు ఆలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన. మూడోసారి ముచ్చటగా అసెంబ్లీ పోరులో నిలవాలని నిర్ణయించుకున్నారు. మంత్రి జయరాం వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన నేత. కర్నూలు పార్లమెంటు పరిధిలో అధిక శాతం ఈ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉండటంతో వారిని ఆకర్షించడంలో భాగంగా ఎంపీగా పోటీ చేయాలని అధిష్టానం ప్రకటించింది. అయితే ఎంపీగా వెళ్లేందుకు మంత్రి జయరాం ఇష్టపడటం లేదు. అవకాశం వస్తే టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు సమాచారం.
తెలుగుదేశంలో ఆలూరు లేదా మంత్రాలయం ఈ రెండు కాకపోతే అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సోదరులు తనకు అసెంబ్లీ టికెట్ రాకుండా చేశారని అనుచరుల వద్ద ఆరోపిస్తున్నారట మంత్రి జయరాం. ఆలూరు టికెట్ తనకు ఇవ్వకపోగా తనను విభేదిస్తున్న జడ్పిటిసి సభ్యుడు విరూపాక్షికి ప్రకటించడం పట్ల మనస్థాపానికి గురైనట్లు స్థానిక వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలనాగిరెడ్డి సోదరులు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రాలయం లేదా గుంతకల్లు నుంచి పోటీ చేయాలని జయరాం పట్టుబడుతున్నారు. ఇందుకోసం కర్ణాటకలో డిప్యూటీ సీఎం శివకుమార్ ద్వారా కూడా మంత్రి జయరాం రాయబారం పంపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. జయరాం కొడుకు, కర్ణాటకలో మంత్రిగా ఉన్న తన సోదరుడు నాగేంద్రతో ఉపముఖ్య మంత్రి డీకే శివకుమార్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. ఇలా అన్ని మార్గాలను అన్వేషించినప్పటికీ ఎక్కడ అసెంబ్లీకి టికెట్ రాకపోతే వైసీపీ నుంచి కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకే జయరాం సుముఖత చూపనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..