Andhra Pradesh: టీడీపీలో ఇంటర్నల్ వార్.. అధిష్టానానికి తలనొప్పిగా మారిన ఆ నియోజకవర్గాలు..
దేవినేనితో వసంత కృష్ణ ప్రసాద్ భేటీ ఎప్పుడు? మడకశిరలో సునీల్ కుమార్‌తో తిప్పేస్వామి చేయి కలుపుతారా? కడపలో అసమ్మతి తమ్ముళ్లు తమ్ముళ్లు తగ్గుతారా? టీడీపీలో కొన్ని నియోజకవర్గాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. తలో దారి పట్టిన నేతలు ఎన్నికల నాటికి ఒక్కటవుతారా?.. అనేది చర్చనీయాంశంగా మారింది.

వసంతకృష్ణ ప్రసాద్, దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు.. ముగ్గురు నేతల మెడలో పసుపు కండువా ఉన్నా ముగ్గురు నేతల తీరు మైలవరం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అంతుపట్టడం లేదు. ఇక్కడ టీడీపీ బీఫామ్ అందుకునేది ఎవరు? ఒకరికి టికెట్ లభిస్తే మిగతా ఇద్దరు సహకరిస్తారా అన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది. టికెట్ తనకే అని ఆశలు పెట్టుకున్న వసంత కృష్ణప్రసాద్ బొమ్మసాని సుబ్బారావుతో భేటీ అయ్యారు. త్వరలో దేవినేనితోనూ భేటీ అవుతానని చెప్తున్నారు.
అయితే బొమ్మసాని మాత్రం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్‌ను టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని అంటున్నారు. ఆయన పెనమలూరుకు వెళ్లడం మంచిదని మా ఇద్దరి మధ్య భేటీలో సూచించానని అంటున్నారు.
ఇక మడకశిర ఉడుకుతోంది. సునీల్ కుమార్‌కు టికెట్ ఇవ్వడంపై తిప్పస్వామి వర్గం ఏకంగా ఆత్మహత్యల వరకు వెళ్లింది. టికెట్ సునీల్ కుమార్‌కు ఇవ్వడంతో తిప్పేస్వామి అనుచరులు మండిపడుతున్నారు. ఇవాళ పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకొని అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. తిప్పేస్వామికి అన్యాయం చేశారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడో కార్యకర్త. ఈ క్రమంలో ఎప్పుడూ పార్టీ జెండా పట్టుకోని సునీల్ కుమార్‌కు టికెట్ ఇలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు తిప్పేస్వామి.
అయితే సునీల్ కుమార్ వర్షన్ మాత్రం మరోలా ఉంది. సర్వేల ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారంటున్న సునీల్ కుమార్.. తిప్పేస్వామితోనూ తాను మాట్లాడుతామని అంటున్నారు
మరోవైపు కడపలో టీడీపీ అసమ్మతి నేతలు సమావేశం కావడం చర్చకు దారితీసింది. మాధవీరెడ్డికి టిక్కెట్ ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాజీ ఇన్‌ఛార్జ్ అమీర్ బాబు ఆధ్వర్యంలో నేతలు భేటీ అయ్యారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి కాకుండా.. ఇతరులకు టికెట్ ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తోంది అమీర్ బాబు వర్గం. అధిష్ఠానం పునరాలోచించాలని సూచిస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




