Andhra Pradesh: నిలువెత్తు నిర్లక్ష్యం.. బొడ్డుపేగుకు బదులు.. శిశువు చిటికన వేలునే కోశారు..
ప్రభుత్వాసుపత్రులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదు. డాక్టర్లు మొదలుకుని ఆసుపత్రుల్లో పని చేస్తున్న నర్సులు, స్వీపర్ల..
ప్రభుత్వాసుపత్రులు నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనాలుగా మారుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను వైద్య సిబ్బంది పట్టించుకోవడం లేదు. డాక్టర్లు మొదలుకుని ఆసుపత్రుల్లో పని చేస్తున్న నర్సులు, స్వీపర్ల వరకు అందరిలో నిలువెల్లా నిర్లక్ష్యం చేరి పోయింది. పేషంట్లను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. ఇబ్రహీంపట్నం, నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో జరిగిన ఘటనలను మరవకముందే ఆంధ్రప్రదేశ్ లో మరొక ఘటన జరిగింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో ఈ ఘటన జరిగింది. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డుకు చెందిన స్వరూప.. సెప్టెంబర్ 30 న స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చేరింది. వైద్యుల పర్యవేక్షణలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే డెలివరీ సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది.
బిడ్డ బొడ్డుపేగును కోయబోయి చిటికెన వేలును కోసేశారు. వెంటనే తప్పు తెలుసుకున్న సిబ్బంది చిటికెన వేలుకు కట్టు కట్టి తల్లీ బిడ్డను గుంటూరుకు రిఫర్ చేశారు. కాగా అక్కడ అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్వరూప బంధువులు ప్రభుత్వాసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. దీనికి బాధ్యురాలిని విధుల నుంచి తొలగించినట్లు వైద్య విధాన పరిషత్ డీసీ రంగారావు వెల్లడించారు.
కాగా.. నల్గొండ జిల్లా ఆసుపత్రికి ప్రసవం కోసం అఖిల అనే గర్భిణి చేరింది. సెప్టెంబర్ 9 న ఆసుపత్రిలో చేరిన అఖిలకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు వచ్చాయి. పురిటి నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తున్న అఖిలను సైలెంట్‌గా ఉండాలంటూ నీచంగా మాట్లాడారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించారు. ప్రసవం చేయడానికి కూడా నిండు గర్భిణిగా ఉన్న అఖిల పొట్టపై కాళ్లతో నొక్కుతో కాన్పు చేశారు నర్సులు. ఓవైపు పురిటి నొప్పులు మరోవైపు నర్సులు కాళ్లతో పొట్టపై తన్నడంతో బిడ్డను ప్రసవించిన వెంటనే అఖిల ప్రాణాలు విడిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి