శ్రీవారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు.. మహాద్వారంలో కనిపించే గడ్డపార కథ ఏంటో తెలుసా?

తిరుమలలో పూసిన ప్రతి పువ్వూ స్వామి పాదాల చెంతకు చేరాలనుకుంటుంది. శ్రీవారి తోమాల సేవలో మురవాలనుకుంటుంది. స్వామి గుండెలపై ఒదిగిపోవాలనుకుంటుంది. ఇలాగే స్వామి సేవలో తరించి..

శ్రీవారి గడ్డంపై పచ్చ కర్పూరం ఎందుకు అద్దుతారు.. మహాద్వారంలో కనిపించే గడ్డపార కథ ఏంటో తెలుసా?
Lord Venkateswara Swamy
Venkata Chari

|

Oct 04, 2022 | 12:05 AM

శ్రీవారి సొగసైన ముఖంపై.. గెడ్డం మీద పచ్చ కర్పూరాన్ని ఎందుకు అద్దుతారు? అక్కడ ఎవరు కొట్టారు? తిరుమల ఆలయంలో మహాద్వారానికి కుడివైపున కనిపించే గుణపం కథ ఏమిటి? తిరుమలలో స్త్రీలు పువ్వులు ఎందుకు పెట్టుకోరు? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే సమాధానం..అనంతాళ్వారులు!! శరణుజొచ్చిన భక్తులపై ఆ వేంకటాచలపతి ఎంతటి దయా వర్షం కురిపిస్తారో చెప్పే కథే.. అనంతాచార్యుల చరితం! నిష్కల్మషమైన భక్తికి తార్కాణం!! తిరుమలలో పూసిన ప్రతి పువ్వూ స్వామి పాదాల చెంతకు చేరాలనుకుంటుంది. శ్రీవారి తోమాల సేవలో మురవాలనుకుంటుంది. స్వామి గుండెలపై ఒదిగిపోవాలనుకుంటుంది. ఇలాగే స్వామి సేవలో తరించి ఆయన పాదాల మీద రాలిన గొప్ప భాగవతోత్తముడు అనంతాళ్వారులు.

అనంతాళ్వారుల గురించి తెలుసుకోవడం అంటే.. భక్తులపై శ్రీనివాసుని అనంతమైన ప్రేమ, వాత్సాల్యాల గురించి తెలుసుకోవడమే! శ్రీరంగంలో భగవత్‌ రామానుజుల శిష్యులే అనంతాచార్యులు. ఒకనాడు రామానుజులు అనుగ్రహ భాషణం చేస్తూ.. తిరుమలలో అలంకార ప్రియుడైన శ్రీనివాసుడికి పుష్ప కైంకర్యాలు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, దట్టమైన అడవులు, క్రూరమృగాలు, విష సర్పాలు సంచరించే శేషాచల కొండల్లో ఎవరు ఉండగలరు? అక్కడ చెరువు తవ్వి, బృందావనం తయారు చేసి.. పుష్ప సేవ ఎవరు చేస్తారు?

రామానుజుల ఆదేశాలతో పుష్పకైంకర్యం..

గురువు రామానుజులు మనసులోని బాధను అర్థం చేసుకున్న అనంతాచార్యులు.. తాను వెళ్లి వేంకటాచలపతికి పుష్ప కైంకర్యాలు సమర్పిస్తానన్నారు. గురువుకిచ్చిన మాట ప్రకారం.. గర్భవతి అయిన భార్యను తీసుకుని తిరుమలకు చేరారు అనంతాళ్వారులు. రావడంతోనే పూలతోట పనులు ప్రారంభించారు.

దేవదేవుడే బాలుడిగా..

అనంతాచార్యలు వేదానికి..స్వేదానికి శ్రీవారు కదిలిపోయాడు. కరిగిపోయాడు. భార్యతో కలిసి చెరువు తవ్వుతున్న బక్కపల్చని అనంతాచార్యుల దగ్గరకు సాక్షాత్తూ శ్రీనివాసుడే ఓ బాలుడి రూపంలో వచ్చాడు. నీకు నేను సాయం చేస్తానన్నాడు. కానీ ,పసిబాలుడుతో పని చేయించుకోవడం ఏమిటి? అని అనంతాచార్యులవారు వద్దని వారించారు. బాలుడు ఎంత బతిమాలినా వద్దన్నారు.

కానీ అనంతాచార్యులకు తెలియకుండా.. ఆయన భార్యకు చెరువు తవ్వడంలో సాయం చేస్తూ ఉంటాడు ఆ బాలుడు. ఆ దృశ్యం చూసిన అనంతాచార్యులకు కోపం కట్టలు తెంచుకుంటుంది. సాయం వద్దని చెప్పినా ఎందుకు చేస్తున్నావంటూ బాలుడిని తరుముతారు. పట్టరాని కోపంతో బాలుడిపై గుణపం విసురుతారు. ఆ తర్వాత జరిగిన లీలను.. ‘అనంతాచార్య దివ్య పురుష వైభవం’ అనే గ్రంథం అద్భుతంగా ఆవిష్కరించింది.

స్వామి గడ్డానికి పచ్చ కర్పూరం అందుకే..

మర్నాడు పుష్ప కైంకర్యం కోసం ఆనంద నిలయానికి వెళ్లిన అనంతాళ్వార్‌.. స్వామి గడ్డం నుంచి రక్తం రావడాన్ని గమనించి.. బాలుడి రూపంలో వచ్చినది శ్రీవారే అని గ్రహించి తల్లడిల్లిపోతారు. వెంటనే వేంకటనాథుని గడ్డానికి పచ్చ కర్పూరాన్ని అద్దుతారు. ఇప్పటికీ ఈ ఆచారం తిరుమలలో కొనసాగుతోందని చెబుతారు.

అలా తిరుమల ఆలయంలో నిత్యం పుష్ప కైంకర్యం చేసిన పరమ భక్తుడే అనంతాళ్వార్‌. తిరుమలలో స్వామివారికి నిత్యం పూలు సమర్పించి సేవ చేసుకునే భాగ్యం పొందిన తొలి భక్తుడు అనంతాళ్వార్‌. గురు రామానుజుల ఆదేశాలతో శ్రీవారికి పుష్ప కైంకర్య విధానాన్ని అమలుచేసింది అనంతాచార్యులే.

అనంతాళ్వార్‌ తోట..

శ్రీవారి సేవ కోసం పూలసాగుకు అనంతాళ్వారులు ఏర్పాటు చేసిన పూలవనాన్ని అనంతాళ్వార్‌ తోటగా పిలుస్తారు. మల్లెలు, మందారాలు, చామంతులు, సంపెంగలు, కలువలు, కనకాంబరాలు, గులాబీ, నందివర్థనం, బిల్వ, తులసీ దళాలతో ఈ నందనవనం అలరారుతూ ఉంటుంది. ఇప్పటికీ అనంతాచార్యుల వంశీయులు స్వామికి నిత్యం పుష్ప కైంకర్యాలను సమర్పిస్తున్నారు.

అందుకే తిరుమలో స్త్రీలు పూలు ధరించరు..

నిస్వార్థ ప్రేమకు నిదర్శనం అనంతాళ్వారుల చరితం. భక్తుడు ఒక్క అడుగు వేస్తే.. అతని కోసం భగవంతుడు పది అడుగులు వేస్తాడన్న మాటకు తార్కాణం అనంతాళ్వారుల జీవితం. తిరుమలలో పూసిన ప్రతి పువ్వూ శ్రీవారి కైంకర్యాలకే వినియోగించాలని శాసనం చేశారు అనంతాళ్వారులు. అందుకే తిరుమలలో స్త్రీలు పూలు ధరించరని చెబుతారు.

బ్రహ్మోత్సవాలు ముగిసిన మర్నాడు..

80 ఏళ్లకుపైగా స్వామి పుష్ప కైంకర్యానికి అంకితమైన అనంతాళ్వారులు తిరుమలలోనే పరమపదించారు. ఆయన పార్థివ దేహాన్ని ఉంచినచోట పొగడమాను వెలిసింది. దానికి వస్త్రాన్ని సమర్పించి పూజలు చేస్తారు అర్చకులు. అనంతాచార్యులు పరమపదించిన- ఆడి కర్కాటమాస పూర్వ ఫల్గుణ నక్షత్ర తిరువాడిప్పురంనాడు- బృందావనానికి మలయప్ప స్వామి వేంచేస్తారు. అలాగే ఏటా బ్రహ్మోత్సవాలు ముగిసిన మర్నాడు సాయంత్రం కూడా మలయప్పస్వామి అప్రదక్షిణంగా అనంతాళ్వార్‌ బృందావనానికి వెళ్లి సేద తీరుతారంట.

ఇప్పటికీ ఆ గడ్డపార..

ఇవి కూడా చదవండి

తిరుమల ఆలయంలో పడికావలి మీదుగా ఆలయ ప్రవేశం చేసేటప్పుడు.. కుడివైపున గోడకు తగిలించివున్న గడ్డపారను చూడగానే అనంతాళ్వారులు గుర్తుకువస్తారు. అలాగే సొగసైన స్వామి ముఖంపై చుబుకానికి అద్దిన పచ్చ కర్పూరాన్ని చూసినా అనంతాళ్వారుల అమాయకమైన భక్తి మదిలో మెదులుతుంది. శరణాగతి తత్వానికి ప్రతీకగా నిలిచింది అనంతాళ్వారుల జీవితం.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu