Biometric Wages: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై సర్కార్ క్లారిటీ.. మే 1 నుంచి బయోమెట్రిక్ చెల్లింపులు
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు చెల్లించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
Biometric Wages Payment System: ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల వేతనాల చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు బయోమెట్రిక్ ఆధారంగా వేతనాలు చెల్లించనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. మే 1 నుంచి ఈ కొత్తి విధానం అమలులోకి రానున్నట్లు వెల్లడించారు. వాస్తవానికి ఏప్రిల్ నుంచి దీనిని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే.. దానిని ట్రయల్‌గా భావించాలని.. మే నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌కు సూచించారు.
ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్వోలను గ్రామ సచివాలయాల డీడీవోలుగా నియమించినట్లు భరత్ గుప్తా తెలిపారు. అయితే బయోమెట్రిక్ పూర్తిస్థాయిలో అమల్లోకి రాకపోవడం, పలు చోట్ల సాంకేతిక సమస్యలు రావడంతో ఏప్రిల్ నెలను ట్రయల్ రన్‌గా భావించాలని పేర్కొన్నారు. ఏప్రిల్ నెల జీతం మే 1న ఎప్పటి లాగానే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు చెల్లించాలని ఆదేశించారు.