Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం వెదర్ రిపోర్ట్ ఇలా.. ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన
దిత్వా తుఫాన్ ప్రభావంతో చెన్నైలో వర్షాలు దంచి కొడుతున్నాయి. చెన్నై మహా నగరం నీట మునిగింది. నాన్‌స్టాప్‌గా పడుతున్న భారీ వర్షాలతో చెన్నై అతలా కుతలమవుతోంది. సబ్‌వేలు మూసివేశారు. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అలాగే తెలుగు రాష్ట్రాలపై కూడా దిత్వా ప్రభావం ఉంది..

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందన్నారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. అటు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాచలంలో అత్యధికంగా 22 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 9.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చెన్నై అలా..
దిత్వా తుఫాన్ ప్రభావంతో చెన్నైలో వానలు దంచికొడుతున్నాయి. నాన్‌స్టాప్‌గా పడుతున్న భారీ వర్షాలతో చెన్నై అతలా కుతలమవుతోంది. నగరంలో పలుచోట్ల సబ్‌వేలను మూసివేశారు. ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చెన్నై మహా నగరంలో అత్యంత ప్రధానమైన రహదారి మౌంట్ రోడ్. నిత్యం లక్షలాదిమంది ఈ రోడ్డు ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు. వర్షం ధాటికి మౌంట్ రోడ్ పైకి భారీగా వరద నీరు చేరింది. ఇక ఆసియాలోనే అతి పెద్ద వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ మార్కెట్ కోయంబేడు మార్కెట్‌ను మూసివేశారు. చెన్నైకి కిరీటం లాంటి మెరీనా బీచ్ కళ తప్పి వెలవెలబోతోంది. సముద్రంలో అలల ఉధృతి ఎక్కువవడంతో బీచ్‌ను మూసివేశారు.
