AP News: దండిగా చేపలు పడతాయని వల వేశారు.. చిక్కింది చూసి కళ్లు తేలేసారు..
ఎప్పటిలానే ఆ రోజు కూడా మత్స్యకారులు చేపలు పట్టేందుకు వల వేశారు. నీటిలో వల వేయగా.. బోలెడన్ని చేపలు పడతాయని.. చూశారు. కాసేపటికి దాన్ని పైకి లాగి చూడగా.. దెబ్బకు బిత్తరపోయారు. ఇంతకీ అదేంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ లుక్కేయండి.

ఎప్పటిలాగే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. ఈరోజు దండిగా చేపలు దొరకాలి…మా ఇంటిల్లపాది ఆకలి తీరాలి అని గంగమ్మకు మొక్కుకుని చేపల వేట ప్రారంభించారు. అలా వేట ప్రారంభించిన ఎంత సేపటికీ చేపలు పడలేదు. మత్స్యకారులు ఈ రోజు చేపలు దొరికేలా లేవని నిరాశపడుతూనే చేపలకోసం వల వేస్తూనే ఉన్నారు. ఈక్రమంలో కొద్దిసేపటికి వల చాలా బరువెక్కింది. మత్స్యకారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వలలో భారీగానే చేపలు చిక్కి ఉంటాయని ఆశతో వలను పైకి లాగారు. వలలో చిక్కింది చూసిన వారి గుండె గుబేల్‌మంది. వలలో భారీ కొండచిలువ చిక్కింది.
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో వేగూరు కాలువలో గిరిజన మత్స్యకారుల చేపల వలకు భారీ కొండచిలువ చిక్కడంతో ఒకింత ఉలిక్కిపడ్డారు మత్స్యకారులు. దాదాపు 15అడుగుల పొడవున్న భారీ కొండచిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. చేసేది లేక ఆ కొండచిలువను పైకి లాగారు. ఒడ్డుకు తీసుకొచ్చి, వలలోనే ఉంచి, అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువను తీసుకెళ్లి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచి పెట్టారు.
