Vijayawada Durga Temple: ఇకపై వాట్సప్ ద్వారా విజయవాడ దుర్గమ్మ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలంటే..?
ఏపీ దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ దర్శనం టికెట్లను వాట్సప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రూమ్స్, అర్జిత సేవా టికెట్లను కూడా ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు డిజిటల్ సేవలను అందుబాాటులోకి తెచ్చారు.

విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు రోజూ వేలాదిమంది వస్తూ ఉంటారు. ప్రస్తుతం పండుగ సెలవులు కావడంతో రద్దీ మరింత పెరిగింది. స్కూల్స్, ఆఫీసులకు వరుస సెలవులు రావడంతో ఆధ్మాత్మిక ప్రదేశాలు సందర్శించేందుకు చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బెజవాడ దుర్గమ్మ ఆలయానికి ప్రాముఖ్యత ఉండటంతో పండుగ సెలవుల్లో చాలామంది దర్శనం చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ భక్తులకు అసౌర్యం కలగకుండా దేవాదాయశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ సేవలను కొత్తగా ప్రారంభించింది. దీని ద్వారా సులువుగా మొబైల్ నుంచే ఆలయ సేవలు పొందవచ్చు.
వాట్సప్ ద్వారా టికెట్ బుకింగ్
ఇక నుంచి దుర్గమ్మ ఆలయంలో దర్శనానికి ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోచ్చు. దర్శన టికెట్లు మాత్రమే కాకుండా రూమ్స్ బుకింగ్, ప్రసాదం, వివిధ సేవా పూజల టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రజలకు డిజిటల్ సేవలను అందించేందుకు వాట్సప్ గవర్నెన్స్ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మన మిత్ర వాట్సప్ సేవల పేరుతో దీనిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా వాట్సప్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ టికెట్లతో పాటు ఆలయాల, పర్యాటక ప్రదేశాల టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ద్వారా దుర్గమ్మ దర్శనానికి టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. దీంతో ప్రజలు క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా ఆన్ లైన్‌లోనే పేమెంట్ చేయవచ్చు.
ఎలా అంటే..?
-9552300009 నెంబర్‌ను మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి
–వాట్సప్ ఓపెన్ చేసి ఆ నెంబర్‌కు హాయ్ అని మెస్సేజ్ పెట్టండి
–సర్వీసుల కేటగిరీలో దర్శనం టికెట్లను ఎంచుకోండి
–దుర్గగుడిని ఎంచుకుని టికెట్లు బుక్ చేసుకోండి
–దర్శనం టికెట్లు, రూమ్స్, అర్జిత సేవలను ఎంచుకోండి
–యూపీఐ, మొబైల్, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
ఈ వెబ్‌సైట్ ద్వారా
-www.aptemples.ap.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయండి
–హోమ్ పేజీలో విజయవాడ ఎంచుకోండి
–కొత్త ట్యాబ్‌లో కనకదుర్గమ్మ ఆలయం వెబ్‌సైట్ తెరుచుకుంటుంది.
–అక్కడ దర్శనం, వసతి గదులు టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
–టికెట్లు బుక్ చేసుకోవాలంటే మీ మొబైల్ ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
