Manyam District: కాఫీ తోటలో దీన్ని అంతర పంటగా వేశాడు.. ఇంకేముందే డబ్బులే డబ్బులు..
మన్యం జిల్లాలో కాఫీ సాగుతో పాటు మిరియాల అంతర పంట గిరిజన రైతుల ఆదాయాన్ని పెంచుతోంది. శతాబి గ్రామ రైతు లచ్చయ్య తన కాఫీ తోటలో మిరియాలను సాగుచేస్తూ ఏటా రూ.40-50 వేల నికర లాభం ఆర్జిస్తున్నాడు. కాఫీ చెట్ల నీడన పెరిగే మిరియాలకు మంచి డిమాండ్ ఉండటంతో, తక్కువ ఖర్చుతో అధిక లాభాలు వస్తున్నాయి. ఇది గిరిజన రైతుల ఆర్థిక స్థితికి కొత్త మార్గం.

రాష్ట్రంలో కాఫీ పంటలకు అరకు ప్రసిద్ధి. అంతే ధీటుగా ఇప్పుడు మన్యం జిల్లా కూడా కాఫీ సాగు విస్తీర్ణంను పెంచుకుంటుంది. మన్యం జిల్లా పాచిపెంట మండలంలోని అనంతగిరి సరిహద్దు ప్రాంతాల్లో ఈ సాగు వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా కాఫీ తోటల సాగు పెరుగుతున్న నేపథ్యంలో అంతేస్థాయిలో అంతర పంటగా మిరియాల సాగు కూడా అక్కడి రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుంది. శతాబి గ్రామానికి చెందిన సార లచ్చయ్య అనే రైతు కాఫీ తోటలో అంతర పంటగా మిరియాల సాగు చేస్తూ సిరులు పండిస్తున్నాడు.
లచ్చయ్య గతంలో బంధువుల ఇంటికి వెళ్లిన సందర్భంగా అక్కడ నుంచి వస్తూ వస్తూ వందకు పైగా మిరియాల తీగలను తీసుకొచ్చి తనకున్న నాలుగు ఎకరాల కాఫీ తోటలో నీడనిచ్చే సిల్వర్ చెట్ల మొదళ్ల వద్ద వాటిని నాటారు. సహజ పరిస్థితుల కారణంగా కొన్ని తీగలు ఎండిపోగా, ప్రస్తుతం 40 నుంచి 50 వరకు ఆరోగ్యంగా ఎదిగాయి. గత మూడేళ్లుగా ఈ మొక్కల నుంచి స్థిరమైన దిగుబడి లభిస్తోంది. ఒక్కో మిరియాల మొక్క ద్వారా సుమారు కిలోన్నర వరకు గింజలు వస్తుండగా, గత ఏడాది మొత్తం 60 కిలోల వరకు ఉత్పత్తి సాధించారు.
శతాభికి లోతేరు వారపు సంత సమీపంలో ఉండటంతో మార్కెట్ సమస్య కూడా లేకుండా కిలోకు రూ.1000 వరకు ధర లభిస్తుండగా, గిరిజన రైతులకు మాత్రం రూ.800 చొప్పున విక్రయిస్తున్నారు. అన్ని ఖర్చులు పోనూ లచ్చయ్యకు ఏటా రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు నికర లాభం వస్తోంది. సముద్ర మట్టానికి సుమారు 930 మీటర్ల ఎత్తులో ఉన్న శతాబి గ్రామం మిరియాల సాగుకు అనుకూలంగా మారిందని రైతులు చెబుతున్నారు.
నవంబర్‌లో పూత ప్రారంభమై, జనవరి నాటికి పంట చేతికందుతుందని లచ్చయ్య చెప్తున్నాడు. ఇలాంటి రైతులకు ఐటీడీఏ సహకారం లభిస్తే మార్కెటింగ్ మరింత మెరుగవుతుందని స్థానిక రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే అటవీ ప్రాంతంలో పండుతున్న పంటలకు నాణ్యత ఆధారంగా జీసీసీ అధికారులు. ఈ విధమైన అంతర పంటల సాగు గిరిజన ప్రాంతాల్లో ఆదాయ వనరులు పెంచేందుకు దోహదపడుతుందని, అధికారులు కూడా రైతులకు ఇలాంటి పంటల పై అవగాహన కల్పించి వారిని ప్రోత్సహిస్తే మరింత ఆదాయం పొంది రైతుల ఇంట సిరులు పండుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
