Cyclone Gulab Live: కొనసాగుతున్న గులాబ్ బీభత్సం.. రేపు సెలవు ప్రకటించిన తెలంగాణ సర్కార్
Gulab Cyclone Live Updates: గులాబ్ తుఫాను తీరం దాటింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఆదివారం రాత్రి తుఫాను తీరం దాటింది. మరో ఐదు గంటల్లో ..
Gulab Cyclone Live Updates: గులాబ్ తుఫాన్ తీరంలో కల్లోలం సృష్టిస్తోంది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తీరాన్ని తాకిన గులాబ్. 11 గంటలకు పూర్తిగా తీరాన్ని దాటింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిషాలోని గోపాల్‌పూర్ మధ్య తుఫాను కేంద్రం తీరాన్ని దాటినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. కొద్ది సేపటి క్రితమే తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. గులాబ్ తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా పడింది. మూడు జిల్లాల్లోను వర్ష తీవ్రత పెరిగింది. శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య గులాబ్ ప్రభావం భారీగా ఉంది. పలుచోట్ల చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. శ్రీకాకుళం నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది.
యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతోందన్నారు కలెక్టర్ శ్రీకేష్ లాఠకార్. ఇక విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అత్యధికంగా 58 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో పలుచోట్ల నిలిచిపోయిన విద్యుత్‌ను తిరిగి పునరుద్ధరించే పనిలో ఉన్నారు అధికారులు. ఉత్తరాంధ్‌ర ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇక విశాఖలోనూ గులాబ్ ఎఫెక్ట్ భారీగానే ఉంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. కాన్వెంట్ జంక్షన్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి కింద నడుము లోతులో నీరు చేరింది.
పలు రైళ్లు రద్దు కావడంతో ఎటు వెళ్ళాలో తెలియక రైల్వే స్టేషన్ దగ్గరే పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. సీఎస్ ఆదిత్యానథ్ దాస్ విశాఖలో ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షించారు. తుఫాను తీవ్రత పూర్తిగా తగ్గే వరకు కేటాయించిన విధులలో అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు ఆదేశించారు. ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. తుఫాన్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
LIVE NEWS & UPDATES
-
తెలంగాణ వ్యాప్తంగా రేపు సెలవు ప్రకటించిన సర్కార్
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తన్న భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు (మంగళవారం) సెలవు దినంగా ప్రకటించింది. భారీగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది, వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. వాహనాల రాకపోకలు నిలచిపోయాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-
వర్ష బీభత్సంపై తెలంగాణ గవర్నర్ సమీక్ష
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తన్న భారీ వర్షాలపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌తో గవర్నర్ తమిళిసై ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. తక్షణ చర్యగా తీసుకుంటున్న వివరాలను సీఎస్ గవర్నర్‌కు వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని గవర్నర్ తమిళిసై పిలుపునిచ్చారు.
-
-
అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతాలు ఇవే..
-
ఇవాళ ఏపీలో నమోదైన వర్షపాతం వివరాలు….
-
ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోళ్ల మూతలు తెరవద్దుః వాటర్ వర్క్స్ ఎండీ
కుండపోత వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. జలమండలి ఎండీ దానకిషోర్. హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోళ్ల మూతలు తెరవద్దని ప్రజలకు కోరారు. తరచూ సెవరేజీ ఓవర్‌ఫ్లో అయ్యే ప్రాంతాలను గుర్తించి మ్యాన్‌హోళ్లు ఉప్పొంగకుండా ముందస్తు నిర్వహణ చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. ఇందుకు కోసం రంగంలోకి ఈఆర్‌టీ బృందాలను దించుతున్నామన్నారు. అత్యవసర సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించడానికి 16 ఎయిర్‌టెక్ మిషన్లు అందుబాటులో ఉంచామన్నారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో మ్యాన్‌హోళ్ల దగ్గర హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసం అయినా, తెరిచి ఉంచినట్లు తెలిస్తే జలమండలి కస్టమర్ కేర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.
జలమండలి కస్టమేర్ కేర్ నెంబర్ః 155313
-
-
GHMC వాటర్ లాగింగ్ పాయింట్లపై డిప్యూటీ మేయర్ ఆరా
గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కి వైరల్ ఫీవర్ తో ఒకవైపు బాధ పడుతూనే తార్నాక, నల్లకుంట తో పాటు నగర పర్యటన చేశారు. నల్లకుంట కార్పొరేటర్ అమృతతో కలిసి నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి వద్ద ఉన్న హుస్సేన్ సాగర్ నాలాను సందర్శించారు. GHMC వాటర్ లాగింగ్ పాయింట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-
తుఫాన్ లోనూ డోలీ కష్టాలు
విజయనగరం జిల్లాలోనూ హృదయవిదార ఘటన చోటుచేసుకుంది. తుఫాన్ లోనూ డోలీ కష్టాలు తప్పడం లేదు. పాచిపెంట మండలం కేరంగిలో బంగారమ్మకు పురిటినొప్పులు రావడంతో.. ఐదు కిలోమీటర్లు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. మార్గమధ్యలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న రెండు వాగులను దాటి బాలింతను డోలిలో తరలించారు. ఏ మాత్రం అదుపుతప్పినా.. అందరూ వాగులో గల్లంతవ్వాల్సిందే.. అయినప్పటికీ రిస్క్ చేసి మరీ బాలింతను తరలించారు.
-
ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు వాయిదా
గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలతో లోతట్లు ప్రాంతాలు నీట మునిగాయి. మరోవైపు రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28, 29 తేదీల్లో (రేపు, ఎల్లుండి) రాష్ట్రంలో జరుగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.
-
విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లు
భారీ వర్షాల కారణంగా విద్యుత్ అధికారులు అప్రమత్తమయ్యారు. వర్షాల దృష్ట్యా విద్యుత్ వినియోగదారులు భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. విద్యుత్‌కి సంబంధించి ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా 1912 నంబర్‌కు డయల్ చేయాలని కోరారు. స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌తో పాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ నంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు.. 7382072104, 7382072106, 7382071574.
-
హైకోర్టులో విర్చువల్‌గా కేసుల విచారణ
తెలంగాణ హైకోర్టులో కేసుల విచారణలు రేపటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. గులాబ్ తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని బెంచ్‌లు ఆన్‌లైన్‌లోనే విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. పాక్షికంగా ప్రత్యక్ష విచారణ విధానం రద్దు చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. హైకోర్టులో విర్చువల్‌గా కేసులు నడుస్తాయని ప్రకటించారు.
-
గాజువాకలో 14 ఏళ్ల బాలుడు గల్లంతు
విశాఖ జిల్లాలో వాగులు, వంకలు డేంజరస్‌గా మారాయి. ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే.. గాజువాక దగ్గర స్టీల్ ప్లాంట్ సుందరయ్య కాలనీ బ్రిడ్జి కింద వాగులో 14 ఏళ్ల బాలుడు గల్లంతయ్యాడు. ఆ వాగులో చేపలు పట్టేందుకు ముగ్గురు పిల్లలు కలిసి వెళ్లారు. వారిలో ప్రమాదవశాత్తు ఒకడు కాలు జారి వాగులో పడ్డాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అతన్ని కాపాడేందుకు అక్కడున్న స్థానికులు ప్రయత్నించారు.
-
తుఫానుతో తూర్పు తీరం అల్లకల్లోలం
గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఏపీ , తెలంగాణ లోనే కాదు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయి. తూర్పు తీరం లోని చాలా రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఒడిశాలో గత రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తు్న్నాయి. ప్రసిద్దమైన చిల్కా సరస్సుకు వరదపోటెత్తింది. సమీపం లోని ఆలయాలు నీట మునిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు తమిళనాడుతో సహా పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తమిళనాడులోని తీరప్రాంతంలో చాలాచోట్ల సముద్రం అల్లకల్లోలంగా మారింది. జాలర్లు చేపల వేటకు వెళ్లవద్దని అలర్ట్ జారీ చేశారు.
-
నీటిలో చిక్కుకున్న కుటుంబం
విజయనగరం జిల్లా కొత్తవలస ఎస్సీ కాలనీలో వరద నీరు చేరింది. ఓ కుటుంబం నీటిలో చిక్కుంది. ఈ విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో అతికష్టంగా బాధితులను వరద నీటి నుంచి బయటకు తీసుకొచ్చారు.
-
చెరువులను తలపిస్తున్న రోడ్లు
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మహానగరంలో అన్ని ప్రాంతాల్లో కుండపోత వాన కురుస్తోంది. దీంతో రోడ్లపై లైట్లు వేసుకుని వాహనదారులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. జంటనగరాల పరిధిలోని రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.. దీంతో హైదరాబాద్ నగరవాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
-
విశాఖ ఎయిర్‌పోర్టుకు వరద ముప్పు…
ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు విశాఖపట్నం మారిపోయింది. గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి విశాఖపట్నం లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో రోడ్లు, కాలనీలు జలమయమయ్యాయి. అటు విశాఖ విమానాశ్రయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వరద నీటితో ప్రయాణికులు తీవ్ర అగచాట్లు ఎదురుకుంటున్నారు. ఎగువన ఉన్న మేఘాద్రి రిజర్వాయర్ నుండి భారీగా క్రిందకు చేరుతుండటంతో వరదనీరు వచ్చి చేరుతోంది. గంట గంటకు నీరు ఉద్రిక్తం అవడంతో, ఏ సమయంలో రన్ వే పైకి వరద నీరు వెళ్తుందోనన్న భయాందోళనలో ఉన్నారు ఎయిర్‌పోర్ట్ సిబ్బంది.
-
సువర్ణ ముఖి నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరి
విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. మక్కువ మండలం వెంకట బైరిపురం వద్ద గొర్రెల కాపరి సువర్ణ ముఖి నది మధ్యలో చిక్కుకుపోయారు. గొర్రెల కాపరి దుక్క సింహాచలంతో పాటు 130 గొర్రెలు నీటి ప్రవాహంలో చిక్కుపోయారు. మరోవైపు గంట గంటకి పెరుగుతున్న వరద ఉదృతితో భయాందోళనలకు గురవుతున్నాడు. రక్షించ మని ఆర్తనాదాలు చేస్తున్నాడు గొర్రెల కాపరి. స్థానికులు ఇచ్చిన పమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.
-
వరదీ నీటిలో కొట్టుకుపోయిన లారీ
గులాబ్ నేపథ్యంలో చంపావతి, సువర్ణముఖి నదులు పొంగిపొర్లుతున్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలం ఎస్ ఎస్ ఆర్ పేట వద్ద భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. కాగా, అటుగా వచ్చిన లారీ వరదనీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. చెన్నై నుండి పాలకొండకు లోడ్‌తో వెళ్తున్న లారీ ఒక్కసారిగా వచ్చిన వరద ధాటికి నీటిలో కొట్టుకుపోయింది. దీంతో లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు.
-
తుపాను సహాయక చర్యల్లో పాల్గొనండిః చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు.. తుపాను సహాయక చర్యల్లో పాల్గొనాల్సిందిగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఆదేశించారు. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. భారీ వర్షాల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టి నష్టాన్ని నివారించాలన్నారు. తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేలాది మంది నిరాశ్రయులు అయ్యారు, తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పార్టీ శ్రేణులు తమ వంతు సాయం అందజేయాలన్నారు. ప్రజలకు అవసరమైన నిత్యావసర సరకులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించడంలో సహాయం అందించాలని చంద్రబాబు కోరారు.
-
నేలకూలిన భారీ వృక్షం.. నిలిచిన అంబులెన్స్
కుండపోత వర్షాలతో విశాఖ ఏజెన్సీ ప్రాంతం వణికిపోతుంది. అనంతగిరి ఘాట్ రోడ్డు ప్రాంతంలో భారీ వృక్షం నేలకూలింది. దీంతో పాడేరు నియోజకవర్గానికి చెందిన రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి, దీంతో అత్యవసర చికిత్స కోసం వెళ్తున్న బాధితుల అంబులెన్స్‌తో పాటు పలు వాహనాలు నిలిచిపోయాయి. హుటాహుటీన చేరుకున్న అధికారులు విరిగిపడ్డ చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.
-
కూలిన హైస్కూల్ ప్రహరీ గోడ..
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో భారీ వర్షానికి పాఠశాల ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. జి.సిగడాం మండలం గెడ్డకంచారంలో ఈదురు గాలుల ధాటికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహారీగోడ కూలిపోయింది. దీంతో గోడను అనుకుని ఉన్న 7 టూవీలర్ బైక్‌లు, 10 సైకిళ్లు దెబ్బతిన్నాయి.
-
అత్యవసరమైతే తప్పా బయటికి రావద్దుః మేయర్
తుఫాన్ నేపథ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ మహానగర మేయర్ విజయలక్ష్మీ ఆదేశించారు. కంట్రోల్ రూం అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఇందుకోసం 175 జీహెచ్ఎంసీ బృందాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు నీటిని తొలగించేందుకు 200లకు పైగా వాటర్ పంపులు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రెండు రోజుల పాటు భారీ హెచ్చరికలతో బల్దియా సిబ్బంది సెలవులను రద్దు చేసిన విషయం తెలిసిందే. అత్యవసరం అయితే తప్పా అనవసర కారణాలతో ప్రజలు బయటికి రావద్దని మేయర్ విజయలక్ష్మీ సూచించారు.
-
విశాఖ జిల్లాలో రైల్ ట్రాక్‌పై విరిగిపడ్డ కొండచరియలు
విశాఖ జిల్లాలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షలతో జనజీవనం స్తంభించింది. కేకే రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమై రాళ్లను, మట్టిని తొలగించిన తర్వాత రైళ్లను పునరుద్ధరించారు.
-
నీట మునిగిన గుర్ల మండలం ఎస్ఎస్ఆర్‌పేట
విజయనగరం జిల్లాలో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. గులాబ్ నేపథ్యంలో చంపావతి, సువర్ణముఖి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గుర్ల మండలం ఎస్ ఎస్ ఆర్ పేట నీట మునిగిపోయింది, గ్రామంలోని ఇళ్లలోకి వరదనీరు చేరుకుంటుంది. గ్రాస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన రెవిన్యూ యంత్రాంగం గ్రామస్తులను ఖాళీ చేయిస్తున్నారు.
-
మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
ఉత్తరాంధ్రకు కునుకు లేకుండా చేస్తోంది గులాబ్ తుఫాన్. కళింగపట్నానికి ఉత్తరంగా పాతిక కిలోమీటర్ల దూరంలో తీరం దాటింది. రాత్రి ఎనిదిన్నర గంటల సమయంలో తీరం దాటినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగుతుంది. దాని ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా పడింది. మూడు జిల్లాల్లోను వర్ష తీవ్రత పెరిగింది. ఈదురు గాలులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఈ రాత్రికి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి. రేపు ఛత్తీస్‌గఢ్, విదర్భ, బెంగాల్‌లోను వర్షాలు కురుస్తాయని IMD స్పష్టంచేసింది.
-
పౌరులకు పోలీసు శాఖ హెచ్చరిక
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు తెలంగాణ పోలీసుశాఖ పౌరులకు కీలక హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమయితే తప్ప బయటకి రావొద్దని సూచించింది. లోతట్టు ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. నీటి ప్రవాహాలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చిరించింది. ఎవరైనా ఆపదలో ఉంటే డయల్ 100ను సంప్రదించాలని పేర్కొంది.రాబోవు కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.
#TelanganaRains#Dial100 pic.twitter.com/T3NigETAzu
— Telangana State Police (@TelanganaCOPs) September 27, 2021
-
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష.. ఢిల్లీ నుంచి.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ విషయమై ఢిల్లీ నుంచి సీఎస్ సోమేశ్ కుమార్‌తో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపిన సీఎం, ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే హైదరాబాద్, కొత్తగూడెం, వరంగల్‌కు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు పంపిస్తామనన్నారు. జిల్లా కలెక్టర్లు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
-
వాయుగుండంగా మారిన తుఫాన్.. హైదరాబాదీలు జాగ్రత్తా..
గులాబ్ తుఫాన్ వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపిన అధికారులు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు.
-
గులాబ్ తుఫాన్‌పై సీఎం జగన్ సమీక్ష..
ఏపీనీ అతలాకుతలం చేస్తోన్న గులాబ్ తుఫాన్‌పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడారు. తుఫాన్ అనంతర పరిస్థితులను ముఖ్యమంత్రి వివరించారు. తుఫాన్ కారణంగా మరణించిన వారి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇవ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలను వెంటనే ఆదుకోవాలని తెలిపారు. ఇళ్లలోకి నీరు వచ్చిన కుటుంబాలకు రూ. 1000 ఇవ్వాలని ఆదేశించారు. ఇక వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేయలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
-
లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త..
హైదరాబాద్‌లో ఉదయం 8 గంటల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతోంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే హై అలర్ట్ ప్రకటించిన జీహెచ్‌ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులను మేయర్ అలర్ట్ చేశారు. ఇక నగరంలోని ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్ నగర్‌తో పాటు అన్ని నగర శివారుల్లో వర్షం దంచి కొడుతోంది.
-
విజయవాడలో దంచి కొడుతోన్న వర్షం..
గులాబ్ తుఫాన్ కారణంగా విజయవాడలో ఆదివారం అర్థరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షం కారణంగా నగరంలోని ప్రధాన రహదారులతో సహా కాలనీలన్నీ జలమయమయ్యాయి. లోతట్లు ప్రాంతలన్నీ నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
-
హైదరాబాద్‌లో రానున్న 4-5 గంటల్లో అత్యంత భారీ వర్షం..
గులాబ్ తుఫాన్ ప్రభావం ఏపీతో పాటు తెలంగాణలోనూ కనిపిస్తోంది. ఇప్పటికే ఉదయం నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండగా… రానున్న 4-5 గంటల్లో హైదరాబాద్‌లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంతో పాటు ఖమ్మం, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, నిర్మల్ నిజామాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
-
బీభత్సం సృష్టిస్తోన్న గులాబ్.. ఏపీలో పరిస్థితి ఎలా ఉందంటే..
గులాబ్ తుఫాన్ దాటికి ఏపీకి వణికిపోతోంది. విజయనగరం-రాజాం రహదారిలో చెట్లు నేలకూలాయి. చంపావతి నది ఉధృతిలో గ్రామాల్లోకి వరద నీరు చేరింది. భారీ వర్షాల కారణంగా విశాఖ గణేష్ నగర్లో కొడ చరియలు విరిగిపడ్డాయి. గాజువాక, పెదంగట్యాడలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
-
తెలంగాణలో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..
గులాబ్ తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. వీటితో పాటు మరో 17 జిల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
-
విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి.. కరెంట్ సమస్యలపై ఈ నెంబర్లకు ఫోన్ చేయండి.
తెలంగాణలో రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో.. విద్యుత్ ఖాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలనీ టీఎస్ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాల్ రావు ఆదేశించారు. ప్రజలు విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించిన ఆయన.. కరెంట్ సంబంధిత సమస్యలపై కంట్రోల్ రూమ్ నెంబర్ 18004250028, టోల్‌ఫ్రీ నెంబర్ 1912కు సంప్రదించాలని సూచించారు.
-
భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా..
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఈరోజు జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన బీటెక్, ఎంటెక్, బీఫార్మసీ పరీక్షలను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న దానిపై అధికారులు త్వరలోనే ప్రకటన చేయనున్నారు.
-
తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం.
గులాబ్ తుఫాన్ కారణంగా హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
-
భారీ వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా..
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ఈరోజు జేఎన్‌టీయూ పరిధిలో జరగాల్సిన బీటెక్, ఎంటెక్ పరీక్షలను రద్దు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్న దానిపై అధికారులు త్వరలోనే ప్రకటన చేయనున్నారు.
-
విజయనగరం జిల్లాలో భారీగా వర్షాలు.. రాత్రి 10కి మొదలైన వర్షం.
గులాబ్ తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. ఆదివారం రాత్రి 10 గంటలకు మొదలైన వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అత్యధికంగా గజపతినగరంలో 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. పూసపాటి రేగలో 19 సెం.మీ, నెల్లిమర్లలో 14 సెం.మీ, కొత్త పలసలో 11 సెం.మీ, సాలూరులో 10 సెం.మీ వర్షం కురిసింది.
-
తుఫాన్ ప్రభావంతో ఖమ్మంలో భారీ వర్షం.. లోతట్లు ప్రాంతాలు జలమయం.
గులాబ్ తుఫాను ఆదివారం తీరం దాటడంతో ఖమ్మం జిల్లాలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గులాబ్ తుఫాను రాష్ట్రంలో సోమవారం కుంభవృష్టి, మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
-
హైదరాబాదీలు.. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు.
గులాబ్ తుఫాన్ కారణంగా హైదరాబాద్‌కు మూడు రోజులపాటు జీహెచ్‌ఎంసీ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మూడురోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరవాసులు తప్పనిసరి అయితే తప్ప బయటకు రావొద్దని అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా వారంరోజుల పాటు ఉద్యోగులకు సెలవుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముంపు ప్రాంతాల నుంచి బాధితుల్ని తరలించేందుకు శిరిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఎల్.శర్మన్ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌లో అందుబాటులో ఇద్దరు అధికారులను ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం హైదరాబాద్ కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నెంబర్ 040- 2320 2813ను సంప్రదించాలని అధికారులు సూచించారు.
-
హైదరాబాద్‌లో హై అలర్ట్.. బుధవారం వరకు అతిభారీ వర్షాలు.
గులాబ్ తుఫాన్ ప్రభావం హైదరాబాద్‌పై కూడా పడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత వాతావరణ శాఖ సోమవారం నుంచి బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. దీంతో జీహెచ్‌ఎంసీ, ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విభాగాలు హై అలర్ట్ ప్రకటించాయి. ముంపు ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షించాలని జీహెచ్‌ఎంసీ విభాగాధిపతులు, జోనల్ కమిషనర్లకు ఈవీడీఎం డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వరద ముంపు పొంచి ఉన్న ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని.. అవసరమైతే పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలని సూచించారు.
-
పశ్చిమ గోదావరిపై భారీగా తుఫాన్ ప్రభావం..
గులాబ్ తుఫాన్ ప్రభావం ప.గో జిల్లాపై భారీగా పడింది. ఈ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడినా భారీ వర్షం కురుస్తోంది. నర్సాపురం, భీమవరం, ఏలూరు, తణుకు, ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
-
మత్స్యకారులకు అలర్ట్.. మంగళవారం వేటకు వెళ్లకూడదు.
గులాబ్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ఈ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. రాష్ట్రంలోని చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఉత్తరాంధ్రలో అక్కడక్క భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర వెంబడి గంటకు 40- 60 కిమీ వేగంతో ఈదురగాలులు వీచే అవకాశాలున్నాయి. ఈ కారణంగా సముద్రం అలజడిగా మారనుంది. ఈ నేపథ్యంలో మత్య్సకారులు మంగళవారం వెళ్లకూడదని, ప్రజలను ఇంటి నుంచి బయటకు రావొద్దని విపత్తుల శాఖ కమిషనర్ కె. కన్న బాబు తెలిపారు.
-
అంధకారంలో విజయనగరం.. జిల్లాపై భారీగా ఎఫెక్ట్.
గులాబ్ తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా జిల్లాలోని చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జిల్లాలో చాలా ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి. ఈదురు గాలుల కారణంగా పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. రంగంలోకి దిగిన అధికారులు చెట్లను తొలగించే పనిలో పడ్డారు. జిల్లాలోని నెల్లిమర్లలో అత్యధికంగా 120 మి.మి వర్షపాతం నమోదైంది.
-
శ్రీకాకుళంలపై గులాబ్ ఎఫెక్ట్..
గులాబ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఈదురు గాలులు, యడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్లు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు తీర ప్రాంతంలోని పలు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో వంశధార, నాగావళి నదుల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంతంల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గంటకు 80 నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి.
-
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు
గులాబ్ తుఫాను ప్రభావంతో ఏపీ ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేల కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యుద్ధప్రాతిపదికన అధికారులు పునరుద్దరణ పనులు చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
-
ఈ నెల 28న మరో అల్పపీడనం
గులాబ్ తుఫాను వణికిస్తోంది. ఈశాన్య, తూర్పు మధ్య బంగాళాఖాతంలో సోమవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో 28వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీరం దాటే సూచనలున్నాయని తెలిపింది.
-
విద్యుత్ అంతరాయంపై ఫిర్యాదులకు టోల్ ఫ్రీ నెంబర్
గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా విద్యుత్ అంతరాయంపై టోల్ ఫ్రీ నెంబర్ 191కి ఫిర్యాదు చేయాలని ఏపీఈపీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్‌రావు సూచించారు. విద్యుత్ పునరుద్దరణ చర్యలు చేపట్టేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉంచనున్నట్లు వెల్లడించారు.
-
1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు
గులాబ్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో 30 ప్రదేశాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు కలెక్టర్ శ్రీకేష్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
-
శ్రీకాకుళంలో పూర్తిగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
గులాబ్ తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మండలాల మధ్య తీరం దాటిన తుఫాను.. ఆ తర్వాత పరిస్థితులను కలెక్టర్ కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పరిశీలిస్తున్నారు. తుఫాను ప్రభావంతో నష్టం వివరాలు అధికారులతో అడిగి తెలుసుకున్నారు.
-
తీరం వెంబడి బలమైన గాలులు
శ్రీకాకుళం జిల్లా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. విశాఖపట్నం- విజయనగరం- శ్రీకాకుళం వైపు వచ్చే వాహనాలను కూడా నిలిపివేశారు. అక్కునపల్లి బీచ్‌లో ఓ పడవ బోల్తా పడింది.
-
తీరం దాటిన గులాబ్ తుఫాను
గులాబ్ తుఫాను తీరం దాటింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య ఆదివారం అర్ధరాత్రి తుఫాను తీరం దాటింది. మరో ఐదు గంటల్లో ఈ తుఫాను తీవ్ర అల్పపీడనంగా మారి బలహీన పడనున్నట్లు అధికారులు తెలిపారు.
-
గులాబ్ తీరం దాటిన తర్వాత పరిస్థితులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆరా..
గులాబ్ తీరం దాటిన తర్వాత పరిస్థితులపై శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ పరిశీలిస్తున్నారు. సంతబొమ్మాలి, వజ్రపుకొత్తూరు మధ్య గులాబ్ తీరం దాటింది. తీరం దాటిన తర్వాత ఎక్కువ నష్టం ఏమీ లేదని అన్నారు.
-
కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటిన గులాబ్ తుపాను
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోని కళింగపట్నం-గోపాలపూర్ మధ్య గులాబ్ తుపాను తీరం దాటింది. జిల్లా కలెక్టర్లను విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు.
-
కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్
గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ ఫోన్‌లో మాట్లాడారు. తుఫానుపై తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
-
గులాబ్ తుఫానుపై విశాఖలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సమీక్ష
గులాబ్ తుఫాను నేపథ్యంలో విశాఖకు చేరుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్.. చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుఫాను తీవ్రత పూర్తిగా తగ్గే వరకు కేటాయించిన విధులలో అప్రమత్తంగా ఉండాలని ఉద్యోగులకు ఆదేశించారు.
-
విశాఖకు చేరుకున్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గులాబ్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్యానాథ్ విశాఖకు చేరుకున్నారు. తుఫాను ప్రభావం, తీసుకుంటున్న చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
-
తుఫాను ఎఫెక్ట్‌తో విజయనగరంలో హెల్ప్‌లైన్ నెంబర్లు
విజయనగరం రెవిన్యూ డివిజనల్ కార్యాలయంలో 08922-276888. పార్వతీపురం సబ్ కలెక్టర్ పార్వతీపురం- 08963-22236. అన్ని మండల తహశీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు. తీరప్రాంత మండలాలైన భోగాపురంలో 8074400947. పూసపాటిరేగలో 7036763036. మత్స్య శాఖ ఆధ్వర్యంలో విజయనగరంలోని ఆ శాఖ కార్యాలయంలో 08922-273812 ఫోన్ నెంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
-
13 మండలాల్లో పునరావాస కేంద్రాలు
తుఫాను కారణంగా శ్రీకాకుళం జిల్లాలోని 13 మండలాల్లో 61 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ తెలిపారు. ఇప్పటి వరకు 1,358 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు. మరోవైపు తుఫాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.
-
తుఫాన్.. తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభం
గులాబ్ తుపాను తీరాన్ని తాకే ప్రక్రియ ప్రారంభమైంది.. మరో రెండు గంటల్లో తుఫాన్ తీరాన్ని తాకడం పూర్తవుతుందని తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైనట్లు ప్రకటించింది.
-
పలు జిల్లాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం..
గులాబ్ తుపాను ప్రభావంతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు తీవ్రంగా వీస్తున్నాయి. కాగా.. తుఫాన్ వల్ల కలిగే విద్యుత్తు అంతరాయాలపై టోల్ ఫ్రీ నంబర్ 1912కి ఫిర్యాదు చేయాలని ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె. సంతోషరావు సూచించారు.
-
వజ్రపుకొత్తూరులో విషాదం..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేటలో విషాదం చోటుచేసుకుంది. తుపానులో చిక్కుకుని ఇద్దరు మత్స్యకారులు వంక నాయకమ్మ, బుంగ మోహనరావు మృతి చెందారు. మరో వ్యక్తి పిట్ట హేమారావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా.. మొత్తం ఆరుగురు గల్లంతు కాగా.. ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరారు.
-
అంధకారంలో శ్రీకాకుళం జిల్లా..
గులాబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మొత్తం అంధకారంలో మునిగిపోయింది. భారీ గాలులు, వర్షం నేపథ్యంలో అధికారులు ముందస్తుగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. శ్రీకాకుళం జిల్లా మొత్తం దాదాపు నిర్మానుష్యంగా మారింది. కాగా.. అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జనం ఇళ్లకు పరిమితమయ్యారు.
-
తీర ప్రాంతాల్లో గులాబ్ ఎఫెక్ట్..
గులాబ్ తుపాన్ ఉత్తరాంధ్రా – దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకింది. తీరం దాటడానికి మూడు గంటల సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో తీరప్రాంతాల్లో ఈదురుగాలులుతో కూడిన భారీవర్షం కురుస్తోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
-
ఒడ్డుకు చేరిన ముగ్గురు మత్స్యకారులు..
సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల్లో ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. శ్రీకాకుళం జిల్లా మంచినీళ్ళ పేటకు చెందిన 6 గురు మత్స్యకారులలో ముగ్గురు మత్స్యకారులు ఒడ్డుకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఒడ్డుకు చేరిన వారిలో వంకా చిరంజీవులు, కొండా భీమారావు, తెలకల పాపారావు ఉన్నారు. వారంతా అక్కుపల్లి బీచ్ కు చేరుకున్నారు. స్వల్ప గాయాలతో ఉన్న వారికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
-
దంచికొడుతున్న వర్షం..
విజయనగరం జిల్లాలో గులాబ్ తుఫాన్ కారణంగా పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లాలో సగటున 20.2 మిమీ వర్ష పాతం నమోదైంది. పార్వతీపురంలో అత్యధికంగా 33.4 మీ.మీ, పాచిపెంటలో అత్యల్పంగా 5 మీ.మీ నమోదు. తుఫాన్ తీరం దాటే సమయంలో 80 కి.మీ. వేగంతో భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసిన జిల్లా అధికారులు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా ఇళ్ల విడిచి బయటకు రావొద్దని, సురక్షిత ప్రాంతాల్లో నివసించాలని సూచించిన కలెక్టర్ సూర్యకుమారి.
-
విజయనగరం జిల్లాలో ప్రారంభమైన గులాబ్ ఎఫెక్ట్..
విజయనగరంలో గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ ప్రారంభమైంది. జిల్లాలో ఈదురుగాలులుతో కూడిన భారీవర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దీంతోపాటు కలెక్టరేట్‌లో తుఫాన్‌పై ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్ కన్నబాబు రివ్యూ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యుత్ ఆటంకం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
-
మూడు గంటల పాటు భారీ వర్షాలు..
గులాబ్ తుపాన్ ఉత్తరాంధ్రా – దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకింది. తీరం దాటడానికి మరో మూడు గంటల సమయం పడుతుందని విపత్తుల శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో మూడు గంటలపాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
-
ఉత్తరాంధ్రా – దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకిన గులాబ్ తుఫాన్
గులాబ్ తుపాన్ ఉత్తరాంధ్రా – దక్షిణ ఒడిశా మధ్య తీరాన్ని తాకింది. కళింగపట్నంకు ఉత్తరాన 25 కిమీ దూరంలో గులాబ్ తుఫాన్ తీరాన్ని తాకినట్లు ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది. పూర్తిగా తీరం దాటడానికి మూడు గంటల సమయం పడుతుందని వెల్లడించింది. కళింగపట్నం -గోపాలపూర్ మధ్య తుఫాన్ తీరం దాటుతుందని వెల్లడించింది. తుఫాన్ తీరాన్ని దాటే క్రమంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని పేర్కొంది. ఈ సమయంలో ప్రజలు సురక్షితంగా ఇంట్లోనే ఉండాలతీ ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు.
-
ఉత్తరాంద్రలో భారీ వర్షాలు..
గులాబ్ తుఫాన్ ప్రభావంతో.. ఉత్తరాంద్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
-
పలు రాష్ట్రాల్లో అలెర్ట్..
గులాబ్ తుఫాన్ తీరం దాటనున్న నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
-
మూడు గంటల్లో తీరం దాటనున్న గులాబ్ తుఫాన్..
మరో మూడు గంటల్లో గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. కళింగపట్నానికి 25 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
-
నలుగురు మత్స్యకారులు గల్లంతు..
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట గ్రామానికి చెందిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఒకరు క్షేమంగా ఒడ్డుకు చేరినట్లు సమాచారం. ఒడిషాలో బోటు కొనుక్కుని తిరిగి వస్తుండగా బారువ సమీపంలో అలల తాకిడికి బోటు తిరగబడి నలుగురు గల్లంతయ్యారని పేర్కొంటున్నారు.
-
పలాస- టెక్కిలి మధ్య తీరం దాటే అవకాశం
గులాబ్ తుఫాన్ ఈ రోజు అర్ధరాత్రి తీరం దాటే ప్రాంతాలను విపత్తు శాఖ వెల్లడించింది. పలాస- టెక్కిలి నియోజకవర్గాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఆయా ప్రాంతాల్లో రక్షిత చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపింది. అయితే.. ప్రజలెవ్వరు బయటకు రావొద్దని ప్రభుత్వం సూచనలు చేసింది.
-
ఉప్పాడ తీరంలో అల్లకల్లోలం..
ఒడిశా, ఉత్తరాంధ్ర పై గులాబ్ సైక్లోన్ ప్రభావంతో తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరం వెంబడి మత్స్యకారులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ రోజు రాత్రికి కళింగపట్నం, గోపాల్ పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉండటంతో ఉప్పాడ తీరంలో అలలు, గాలుల వేగం స్వల్పంగా పెరిగింది. -
ఒడ్డుకు చేరిన మత్స్యకారులు..
తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరంలో బోట్ల ఒడ్డుకు చేరాయి. విశాఖ జిల్లా నక్కపల్లి నుంచి సముద్రంలో బొట్ల పై వేటకు బయల్దేరిన మత్యకారులు. అయితే.. తుఫాన్ హెచ్చరికలతో బొట్లతో సముద్రం ఒడ్డుకు చేరారు. సముద్రం అల్లకల్లోలంగా మారిందని దీంతో కాట్రేనికొన మండలం చిర్రయానం వద్ద వడ్డుకు చేరినట్లు మత్యకారులు తెలిపారు.
-
అర్థరాత్రి తీరం దాటే అవకాశం..
బంగాళాఖాతంలో గులాబ్ తుపాన్.. గోపాలపూర్ కు 95కిమీ, కళింగపట్నానికి 85 కిమీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు పేర్కొన్నారు. ఈ రోజు అర్ధరాత్రి కళింగపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరించారు.
-
మరికొన్ని రైళ్లు రద్దు..
గులాబ్ తుపాను దృష్ట్యా ఇప్పటికే పలు రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వెల్లడించింది.. రద్దు చేసిన రైళ్ల వివరాలు.. 26-09-2021 – భువనేశ్వర్ – తిరుపతి 27-09-2021 – తిరుపతి – భువనేశ్వర్ 26-09-2021 – పూరి – చెన్నై సెంట్రల్ 27-09-2021 – చెన్నై సెంట్రల్ – పూరి 26-09-2021 – హెచ్ఎస్ నాందేడ్ – సంబల్ పూర్ 26-09-2021 – రాయగడ – గుంటూరు
-
తెలంగాణలో భారీ వర్షాలు
Telangana weather: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతేకాదు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిన్న ఏర్పడిన వాయుగుండం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా మారింది. ఈ తుఫాను ఉత్తర ఆంధ్రా- దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతాల్లో విశాఖపట్నం, గోపాల్ పూర్, కళింగ పట్నం దగ్గర తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
-
అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. మంత్రి సిదీరి అప్పలరాజు
గులాబ్ తుఫాన్ టెక్కలి, పలాస నియోజకవర్గాల మద్య తీరం దాటే అవకాశం వుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు మంత్రి సిదీరి అప్పలరాజు తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగే అవకాశం వుందని.. తదనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించారు. జిల్లాలో ఎనిమిది ఎన్డీఆర్ఎఫ్, ఎనిమిది ఎస్టీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అధికారులు అంతా క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు.
-
మూడు జిల్లాల్లో రెడ్ అలెర్ట్..
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా భారీ వార్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అలెర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది.
-
కేంద్రం నుంచి సాయం అందిస్తాం.. ప్రధాని మోదీ..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడాను. గులాబ్ తుఫాను నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాను. కేంద్రం నుంచి సాధ్యమైనంతమేరకు అన్ని సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు ట్విట్టర్‌లో ప్రధాని మోదీ తెలిపారు. అందరి శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నానంటూ మోదీ తెలిపారు.
గులాబ్ తుఫాన్ పరిస్థితి గురించి @ysjagan గారితో మాట్లాడాను .కేంద్రం నుంచి సహాయాన్ని తక్షణం అందేటట్లు చూస్తామని హామీ ఇచ్చాను. అందరు క్షేమంగా వుండాలని ప్రార్ధిస్తున్నాను .
— Narendra Modi (@narendramodi) September 26, 2021
-
సీఎం జగన్ కు.. ప్రధాని మోదీ ఫోన్
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుఫాన్ తీరంవైపు కదులుతూ ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో మాట్లాడారు. ఈ సందర్భంగా తుఫాన్ నష్టం.. ప్రస్తుత పరిస్థితులు, తీసుకుంటున్న చర్యల గురించి ప్రధాని మోదీ.. సీఎం జగన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్విట్టర్ వేదిక వెల్లడించారు.
-
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో డీప్యూటీ సీఎం పర్యటన
గులాబ్ తుపాను నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లాలోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. తుఫాన్ ముప్పు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాకి మండలం సముద్ర తీర ప్రాంతాలు గుల్లవానిపేట, గుప్పిడిపేట, రాజారాంపురం ప్రాంతాల్లో పర్యటించి.. ధర్మాన అధికారులకు పలు సూచనలు చేశారు.
-
అధికారుల సెలవులు రద్దు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘గులాబ్’ తుపాను తీరంవైపు బలంగా కదులుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ అధికారులకు సెలవులను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించరు.
-
గులాబ్ తుఫాను నేపథ్యంలో వాతావరణ శాఖ లేటెస్ట్ వెదర్ బులిటిన్
ఆంధ్రా- ఒడిశాను గులాబ్ తుఫాను వణికిస్తోంది. అర్థరాత్రి తీరం దాటనుండటంతో.. ఇప్పటికే పలుచోట్ల గాలులు, సముద్రంలో అలజడి మొదలైంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. IMD విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గులాబ్ తుఫాను ఒడిషా, ఆంధ్రాపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లుగా పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో బలమైన ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.. పూర్తి వివరాలు ఈ వీడియోలో..
-
6 గంటలుగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోన్న తుఫాన్
> గులాబ్ సైక్లోన్ అప్డేట్
> 6 గంటలుగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోన్న తుఫాన్
> ఈ రోజు అర్థ రాత్రి గోపాల్ పూర్, కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశం
> తీరం దాటే క్రమంలో గంటకు 75 నుంచి 85 కిలోమీటర్లు అప్పుడప్పుడు 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం
-
తుఫానుపై ఏపీ విపత్తుల శాఖ అప్డేట్
> బంగాళాఖాతంలో కొనసాగుతున్న ‘గులాబ్’ తుపాన్
> గోపాలపూర్ కు 140 కిమీ, కళింగపట్నానికి 190 కిమీ దూరంలో కేంద్రీకృతం
> ఆదివారం అర్ధరాత్రి కళింగపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం
> ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు
> ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 – 95 కీమీ వేగంతో బలమైన ఈదురు గాలులు
> ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – కె. కన్నబాబు. కమిషనర్ విపత్తుల శాఖ
-
ఇంకా దొరకని మణికొండలో గల్లంతైన రజినీకాంత్ జాడ.. డీఆర్ఎఫ్‌తో కాకపోవడంతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్
> జీహెచ్ఎంసీ కి చెందిన డిఆర్ఎఫ్ బృందాలు నాళాలు అవి కలిసే కాలువ లో వెతికిన దొరకని జాడ
> డీఆర్ఎఫ్‌తో కాకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ ను రంగంలోకి దింపిన అధికారులు
> నాల ఫ్లో మ్యాప్, నాల డిసైన్ లను పరిశీలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ లను సిబ్బంది
> వ్యక్తి నాలాలో పడ్డప్పుడు నీటి ప్రవాహం తీవ్రత ఆధారంగా అంచనా వేస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ అధికారులు
> ప్రవాహం ఎక్కువ ఉంటే…ప్రధాన కాలువలోకి కొట్టుకుపోయే అవకాశం ఉందని.. లేకుంటే పైప్ లైన్ మధ్యలోనే ఇరుక్కొనే అవకాశం లేకపోలేదని అభిప్రాయానికి వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
> పైప్ లైన్ లోకి వీలైనంత దూరం కెమెరాలు పంపే ప్రయత్నంలో ఎన్డీఆర్ఎఫ్
-
రాగల 24 గంటలలో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
రాగల 24 గంటలలో ఈశాన్య, ఇంకా పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ ఆవర్తన ప్రభావంతో ఈశాన్య బంగళాఖాతం పరిసర ప్రాంతాలలో తదుపరి 24 గంటలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ తీరం దగ్గరకి సుమారుగా 29 తేదీకి చేరుకునే అవకాశం ఉంది.
-
తీరం దాటే సమయంలో గంటకు 95 కిలో మీటర్ల వేగంతో గాలులు
నిన్న ఏర్పడిన తుఫాను గులాబ్ (గుల్ఆబ్) ఈ రోజు ఉదయం 08:30 నిమిషాలకు వాయువ్య & పరిసర పశ్చిమ మధ్య బంగాలాఖాతంలో గోపాల్ పూర్ కి 180 కి మి తూర్పు – ఆగ్నేయ దిశలో , కళింగపట్నం కి తుర్పు – ఈశాన్య దిశలో 240 కిమీ దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాను పశ్చిమ దిశగా కదులుతూ ఉత్తర ఆంధ్రా – దక్షిణ ఒడిస్సా తీర ప్రాంతంలో కళింగపట్నం , గోపాల్ పూర్ మధ్యలో తుపానుగానే రేపు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గాలి వేగం సుమారు గంటకు 75 నుండి 85 కిమీ వేగంతో అత్యధికంగా 95 కి.మీ వేగంతో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన అవర్లీ బులిటెన్ లో పేర్కొంది.
-
తెలంగాణకు తాజా వాతావరణ సూచన:
తెలంగాణకు తాజా వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయ్..
> ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అనేక ప్రదేశాలలో ఎల్లుండి చాలా ప్రదేశములలో వచ్చే అవకాశములు వున్నవి.
> ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు, రేపు భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు.. ఎల్లుండి భారీ వర్షాలు తెలంగాణా రాష్ట్రంలో ఒకటి రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
> ఈ రోజు, రేపు, ఉరుములు, మెరుపులు.. ఈదురు గాలులు (గాలి వేగం గంటకు)30 నుండి 40 కి.మీ వేగంతో కూడిన వర్షాలు చాలా జిల్లాలలో వచ్చే అవకాశములు ఉన్నవని వాతావరణ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది.
-
మచిలీపట్నం మంగినపూడి బీచ్‌లో యువకుడు గల్లంతు
కృష్ణాజిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో యువకుడు గల్లంతయ్యాడు. ఈ రోజు ఆదివారం కావడంతో వివిధ ప్రదేశాల నుండి పర్యాటకులతో బీచ్ కిటకిటలాడుతున్న సమయంలో ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది. విజయవాడ నుండి వచ్చిన ఐదుగురు యువకులు సముద్రం లోకి వెళ్లి స్నానాలు చేస్తుండగా, పరిసే హినిత్ (22) అనే యువకుడు సముద్ర అలల్లో చిక్కుకుని కనిపించకుండా పోయాడు.
-
ప. గో. జిల్లా నరసాపురం తీర ప్రాంతంలో అల్లకల్లోలంగా సముద్రం
గులాబ్ తుఫాను ప్రభావం ఉభయగోదావరి జిల్లాలపై కూడా పడనుంది. ఇప్పటికే నరసాపురం తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్ర వేటకు వెళ్లవద్దన్న అధికారుల హెచ్చరికల నేపధ్యంలో మత్స్యకారులు తమ పడవలను ఒడ్డుకు చేర్చుకున్నారు. జిల్లాలో తుఫాను వల్ల సంభవించే మార్పులను ఎదుర్కొనేందుకు జిల్లాలో SDRF, NDRF బృందాలు సిద్ధంగా ఉన్నాయి.
-
తీరం దాటే సమయంలో.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటే..!
గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోంది. కళింగపట్నం దగ్గర సాయంత్రం ఇది తీరం దాటే అవకాశముండటంతో మూడు జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. తీరం దాటే సమయంలో.. తీరం దాటిన తర్వత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 70 కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో జిల్లాలోని తీర ప్రాంతాల్లో మత్స్యకారులు సముద్రవేటను రద్దు చేసుకున్నారు.
-
రేపు ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు..
గులాబ్ తుఫాను ప్రభావం వల్ల రేపు కోస్తాంధ్రలోని ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో గులాబ్ తుఫాను ప్రభావం కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
-
నాలుగురోజుల పాటు తుఫాను ప్రభావం
IMD విడుదల చేసిన తాజా బులిటెన్ ప్రకారం గులాబ్ తుఫాను ఒడిషా, ఆంధ్రాపై నాలుగు రోజుల పాటు ప్రభావం చూపనున్నట్లుగా పేర్కొంది. ముఖ్యంగా ఇవాళ ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖలో బలమైన ఈదురు గాలులతో కూడిన అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.
-
శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రమాదకరంగా తుఫాను.!
ఆంధ్రా- ఒడిశాను గులాబ్ తుఫాను వణికిస్తోంది. సాయంత్రం తీరం దాటనుండటంతో.. ఇప్పటికే పలుచోట్ల గాలులు, సముద్రంలో అలజడి మొదలైంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో దీని ప్రభావం అత్యంత ప్రమాదకరంగా ఉండే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగంతో పాటు విపత్తు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి.
-
మణికొండలో గల్లంతైన వ్యక్తి కుటుంబానికి మంత్రి పరామర్శ
మణికొండ గోల్డెన్ టెంపుల్ దగ్గర డ్రైనేజీ కోసం తీసిన గుంతలో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపిశెట్టి రజినీకాంత్ కుటుంబాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. మణికొండ ఘటన దురదృష్టకరమని మంత్రి అన్నారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఘటన స్థలాన్ని ఆమె సందర్శించి గాలింపు చర్యలను సమీక్షించారు.
వర్షాకాలంలో ఎక్కడైనా పనులు చేస్తుంటే అక్కడ బారికేట్లు పెట్టాలని అధికారులను సూచిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనతో అధికారులను అప్రమత్తత చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం.. వీలైనంత త్వరగా వ్యక్తిని గాలించి పట్టుకుంటామని మంత్రి తెలిపారు.
-
వరద ప్రవాహంలోనే ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం
ఇంకా భారీ వరద ప్రవాహంలోనే మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం ఉంది. సింగూర్ డ్యాము నుండి వస్తున్న నీటితో ఆలయం ముందు భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఆలయం వైపు ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. రాజగోపురంలోని అమ్మవారికి పూజలు చేస్తున్నారు అర్చకులు.
-
తేడా వస్తే వంద బోట్లు, వలలు సముద్రంపాలు.. దిక్కుతోచని స్థితిలో జాలర్లు
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ పొగురు వద్ద ఇస్కలపాలెం, రామయ్య పట్నం, గొల్లగండి, బారువ కొత్తూరు, నడుమూరు, డొంకలూరు, ఎకూవురు, బట్టి గళ్ళూరు, గ్రామాలకు చెందిన సుమారు 100 బోట్లను లంగారు వేసి బారువ పొగురు వద్ద ఉంచుకున్నారు మత్స్యకారులు. మహేంద్ర తనయా నుండి భారీ వర్షపు నీరు బారువ పొగురుకు చేరితే సుమారు 100 బోట్లు సముద్రంలోకి కొట్టుకుపోతాయని జాలర్లు ఆవేదనలో ఉన్నారు. ప్రమాదం జరిగితే కోట్లు రూపాయల వలలు, బోట్లు కల్పోయే ప్రమాదం ఉందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
-
ప్రకాశం జిల్లా ఒంగోలులో భారీ వర్షం.. జనం అవస్థలు
ఒంగోలులో భారీ వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. కర్నూల్ రోడ్డు, గాంధీ రోడ్డు, కోట్ల బజార్, ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో మురుగునీరు రోడ్లపైకి వచ్చి చేరింది. భారీ వర్షానికి మురుగునీరు వెళ్లే అవకాశం లేకపోవడంతో కూరగాయల అంగళ్ళు, రోడ్డు పక్కన మార్జిన్ లో ఉన్న షాపులు నీట మునిగాయి. దీంతో వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో కాలువలు, ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురి కావడంతో భారీ వర్షం పడిన సమయంలో మురుగునీరు పోయే అవకాశం లేక వరద నీరు రోడ్లపై నిలిచిపోతుంది.
-
గులాబ్ ఈ సాయంత్రానికి తీరం దాటే అవకాశం
గులాబ్ తుఫాను ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు తూర్పు-ఆగ్నేయ దిశగా 470 కిలోమీటర్లు, ఏపీలోని కళింగ పట్నానికి 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా తీరం వైపు కదులుతోంది. ఈ క్రమంలో తుఫాను ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి ఈ గులాబ్ తుఫాన్ తీరాన్ని దాటుతుందని చెబుతున్నారు.
-
2018లో సంభవించిన తిత్లీ తుఫాన్ తరహాలో విరుచుకుపడే ప్రమాదం.!
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం.. తుఫాన్‌లా మారి.. ఏపీతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, తెలంగాణ పైనా తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. 2018లో సంభవించిన తిత్లీ తుఫాన్ తరహాలో విరుచుకుపడే ప్రమాదం ఉందంటూ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీని తీవ్రత తిత్లి తుఫాన్‌ను పోలి ఉంటుందని అంచనా వేస్తోన్నారు. అదే స్థాయిలో అసాధారణ ఆస్తి, పంట నష్టాన్ని మిగిల్చడానికీ అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.
-
ఏపీ, తెలంగాణ సహా సరిహద్దు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు
గులాబ్ తుఫాను ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతోపాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
-
స్పెషల్ రిపోర్ట్: తెలంగాణకి ఈరోజు, రేపు అరేంజ్ అలెర్ట్ జారీ
> తెలంగాణ కి ఈరోజు, రేపు అరేంజ్ అలెర్ట్ జారీ
> హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
ప్రభావిత జిల్లాల్లో గంటకి 30 నుంచి 40 కి.మీ వేగంతో కూడిన గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు
-
మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం 3 కిలోమీటర్ల దూరంలోని నెక్నాంపూర్ చెరువులో మరో బృందం గాలింపు
> మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం 12 గంటలుగా కొనసాగుతున్న గాలింపు
> రంగంలోకి మరో రెండు డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు
> తూములు వెళ్లి నాళా కలిసే ప్రాంతంలో గాలిస్తున్న బృందాలు
> మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద గాలిస్తున్న మరో బృందం
> నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.
-
తుఫాన్ ముప్పుపై ఎప్పటికప్పుడు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష
రాష్ట్రంలో తుఫాను పరిస్థితులపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సీఎం కార్యాలయ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.
-
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి: కమిషనర్, విపత్తుల శాఖ
తుఫాను నేపథ్యంలో ఏపీ విపత్తుల శాఖ సూచనలు: > తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాన్ > గోపాలపూర్‌కు 270 కిమీ, కళింగపట్నానికి 330 కిమీ దూరంలో కేంద్రీకృతం > ఈ రోజు అర్ధరాత్రి కళింగపట్నం – గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం > ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు > మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం > మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 75 – 95 కిమీ వేగంతో బలమైన ఈదురగాలులు > సముద్రం అలజడిగా ఉంటుంది > మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదు > ప్రజలు అప్రమత్తంగా ఉండాలి > రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి – కె.కన్నబాబు. కమిషనర్ విపత్తుల శాఖ.
-
మణికొండలో గల్లంతైన వ్యక్తి కోసం 10 గంటలుగా కొనసాగుతున్న గాలింపు
> రెండు డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు
> తూములు వెళ్లి నాలా కలిసే ప్రాంతంలో గాలిస్తున్న బృందాలు
> మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద గాలిస్తున్న మరో బృందం
> నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు.
-
గులాబ్ సైక్లోన్ : ఉత్తరాంధ్రలో సమాచార వ్యవస్థపై ప్రత్యేక దృష్టి
> ఉత్తరాంధ్రలో సమాచార వ్యవస్థపై ప్రత్యేక దృష్టి
> అత్యవసర సమాచార వినియోగానికి 16 శాటిలైట్ ఫోన్లు, వీశాట్, డీఎంఆర్ సమాచార పరికరాలను సిద్ధం చేసిన విపత్తు నివారణా శాఖ
> తాగునీటి సరఫరా, పెట్రోల్, గ్యాస్ కొరత లేకుండా ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ
> ఆహారధాన్యాలు, పాలు, రొట్టెలు, బిస్కెట్లు అందుబాటులో ఉండేలా చర్యలు
> గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశం
-
బ్రేకింగ్: ఏజెన్సీలో పొంగిపొర్లుతున్న వాగులు, గెడ్డలు.. 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.. బ్రిడ్జిలపైకి నీరు
గులాబ్ ఎఫెక్ట్ : ఒరిస్సాలో కురుస్తున్న వర్షాల కారణంగా విజయనగరం ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, గెడ్డలు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వస్తున్న వరదనీరుతో పాచిపెంట మండలం వేటగాని వలస వద్ద బ్రిడ్జిపై భారీగా నీరు ప్రవహిస్తోంది. ఫలితంగా సుమారు ఇరవై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
-
విశాఖ జిల్లాలో తుఫాను కంట్రోల్ రూంల ఏర్పాటు.. ఈ ఫోన్ నెంబర్ల ద్వారా సాయం పొందొచ్చు
> గులాబ్ తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన విశాఖ జిల్లా అధికార యంత్రాంగం
> జిల్లాలోని అధికారుల సెలవులు రద్దు చేసిన కలెక్టర్… తక్షణం విధులకు హాజరు కావాలంటూ ఆదేశం
> నియోజకవర్గ, మండల స్థాయిలలో ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేసిన కలెక్టర్ మల్లిఖార్జున
> ఎన్డీఆర్ఎఫ్, SDRF బృందాల సన్నద్ధం
> సన్నద్ధమైన తూర్పు నావికాదళం, కోస్ట్ గార్డ్, ఎన్డిఆర్ఎఫ్, SDRF బృందాలు
> జిల్లాలో కంట్రోల్ రూంల ఏర్పాటు
> కలెక్టరేట్ నెంబర్లు 0891-2590102, 2750089, 2750090, 2560820
పాడేరు సబ్ కలెక్టర్ ఆఫీస్ 9492159232
విశాఖపట్నం ఆర్ డి ఓ ఆఫీస్ 8332802101
అనకాపల్లి ఆర్టీవో ఆఫీస్ 08924 – 223316, 8143631525
నర్సీపట్నం ఆర్డీవో ఆఫీస్ 7075356563
జీవీఎంసీ – 7093092449
ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ 9440812492, 7382299975
-
విజయనగరం జిల్లాలో ఎగసిపడుతోన్న సాగర అలలు.. ఇరవై అడుగులు ముందుకు సముద్రం
గులాబ్ తుఫాన్ నేపథ్యంలో విజయనగరం జిల్లా తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు, సముద్రపు అలలు ఎగసి పడుతున్నాయి. పూసపాటిరేగ మండలం చింతపల్లి వద్ద ఇరవై అడుగులు ముందుకు వచ్చింది సముద్రం. జిల్లాలో పలుచోట్ల స్వల్ప వర్షపు జల్లులు కురుస్తున్నాయి.
-
గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆహార ధాన్యాల లభ్యత సిద్ధంగా ఉంచాలి : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్
గులాబ్ తుఫాను మీద శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ సమీక్ష నిర్వహించారు. అందులో జిల్లా యంత్రాంగానికి ఇచ్చిన సూచనలు, ఆదేశాలిలా ఉన్నాయి:
> ఎక్కువ వర్షాలు కురిస్తే వరదలకు తావు లేకుండా జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టాలి.
> విద్యుత్తు సరఫరా, జనరేటర్లు, విద్యుత్తు పునరుద్దరణకు ఇ పిడిసిఎల్ సిద్దంగా ఉండాలి.
> తుఫాన్ సమయంలో పనిచేసే బృందాలు, సిబ్బంది వివరాలు కంట్రోల్ రూంలో పెట్టాలి.
> విపత్తుల నిర్వహణ తక్షణం చేపట్టుటకు పరికరాలను వికేంద్రీకరణ చేయాలి.
> జిల్లాలో 9 రాష్ట్ర విపత్తుల బృందాలు సిద్దంగా ఉన్నాయి.
> 50 విద్యుత్ రంపాలు విపత్తుల నిర్వహణ శాఖ వద్ద ఉన్నాయి.
> కమ్యూనికేషన్ ఎట్టి పరిస్థితుల్లోనూ కట్ కారాదు. తద్వారా సహాయక చర్యలకు ఇబ్బందులు ఏర్పడతాయి.
> గ్యాస్, పెట్రోల్, డీజిల్, ఆహార ధాన్యల లభ్యత సిద్దంగా ఉంచాలి.
> ఆక్సిజన్ లభ్యత పరిశీలించాలి. ఆసుపత్రుల్లో కొవిద్ నిబంధనలు పాటించాలి.
> అర్డబ్ల్యుఎస్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల నిర్వహణ, ఇతర శాఖలు సిద్దంగా ఉండాలి.
> అందరూ అప్రమత్తంగా ఉండాలి, అందుబాటులో ఉండాలి.
-
గులాబ్ సైక్లోన్ కారణంగా విజయనగరం ఒరిస్సా మీదగా వెళ్లే పలు రైళ్లు రద్దు
గులాబ్ తుపాను కారణంగా విశాఖపట్నం, విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు చేశారు. కొన్ని రైళ్ల వేళలు కుదింపు, దారి మళ్లింపు చేస్తున్నారు. ఆయా ట్రైన్ల రద్దు వివరాలు ఇలా ఉన్నాయి.
-
ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు
గులాబ్ తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో అతిభారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
-
సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారనున్న గులాబ్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రానికి గులాబ్ తుఫానుగా మారనుంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో అటు ఒడిశా- ఇటు ఆంధ్రా తీరప్రాంతాలకు తుఫాను ముప్పు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉందని తెలిపింది. ఇవాళ సాయంత్రం 4నుంచి 5గంటల సమయంలో విజయనగరం కళింగపట్నం ఈశాన్య దిశకు 440కి.మీ దూరంలో లేదా ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు అగ్నేయ దిశలో 370 కి.మీటర్ల దూరంలో తుఫాను తీరం దాటే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది.
-
వాహనాలపై ప్రయాణాలు చేయొద్దు, ఎత్తైన ప్రదేశాలు.. చెట్ల కింద ఉండొద్దు..
గులాబ్ తుఫాను ఉత్తరాంధ్ర ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. గంట గంటకు తుఫాను తీవ్రత జిల్లాలపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉండటంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. తీరప్రాంతాల ప్రజలను ఇప్పటికే అలర్ట్ చేసిన అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
Published On - Sep 26,2021 9:12 AM