Andhra Pradesh: కిశోర బాలికలకు ఉచితంగా బ్రాండెడ్ శానిటరీ న్యాప్‌కిన్లు.. నెలకు పది చొప్పున @120
బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతోంది.

Free sanitary napkins for ap girls: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ లక్ష్యంగా ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా బ్రాండెడ్ శానిటరీ న్యాప్‌కిన్లు సరఫరా చేయబోతోన్న సంగతి తెలిసిందూ. ఒక్కక్క బాలికకు నెలకు పది చొప్పున ఏడాదికి మొత్తం120 న్యాప్ కిన్లు ఇవ్వనున్నారు. చిట్టితల్లులకి రుతుక్రమం ఇబ్బందుల వల్లే చిట్టితల్లుల చదువులు ఆగిపోతున్నాయని భావించిన ఏపీ సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మొత్తంగా భారత దేశంలో దాదాపు 23 శాతం మంది చిట్టితల్లుల చదువులు ఆగిపోవడానికి రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే ప్రధాన కారణమని యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లయ్ అండ్ శానిటేషన్ కొలబరేటీవ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టమైంది. దీంతో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మందికి పైగా ఉన్న చిట్టితల్లులకు బ్రాండెడ్ శానిటరీ న్యాప్‌కిన్స్ ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్‌కిన్స్ అందిస్తున్నామని సీఎం జగనన్న ఇప్పటికే స్పష్టం చేశారు.
ఇప్పటికే ‘నాడు–నేడు పథకం ద్వారా స్కూళ్లలో మరుగుదొడ్లు మెరుగుపర్చడం జరుగుతోంది. స్వేచ్ఛ పేరుతో జగన్ ప్రభుత్వం తీసుకువస్తున్న కార్యక్రమం కూడా బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతలో భాగమే. దేవుడి సృష్టిలో భాగమైన రుతుక్రమానికి సంబంధించిన అంశాలను పిల్లలు ఎదుర్కొనే సమస్యలను, వాటి పరిష్కారాల గురించి మాట్లాడుకోవడం ఒక తప్పు అనే పరిస్థితి మారాలని జగన్ సర్కారు చెబుతోంది. ఈ పరిస్థితి పోయి.. ఇటువంటి విషయాల్లో ఆ చిట్టితల్లులకు తగినంత అవగాహన కల్పించాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఒక బాలిక ఎదుగుతున్నప్పుడు శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మహిళా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, గ్రామ సచివాలయంలోని ఏఎన్‌ఎంలు అందరూ కూడా అవగాహన కార్యక్రమం చేపట్టి పిల్లలను చైతన్యం చేయాలని నిర్ణయించారు. నెలకు ఒకసారి 7 నుంచి 12 తరగతి చదువుతున్న పిల్లలకు ఓరియంటేషన్ ప్రోగ్రాం చేపట్టాలని కూడా ఆలోచనలో ఉన్నారు. నెలకు ఒకసారి జరిగే అవగాహన కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్‌గా నియమిస్తున్న మహిళా అధ్యాపకురాలే కాకుండా.. ఏఎన్‌ఎం, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీస్ కూడా భాగం చేయబోతున్నారు.