ఆ జిల్లాకు ఎస్పీగా వెళ్లాలంటే జంకుతున్న ఐపీఎస్ అధికారులు.. ఇంతకీ ఏ జిల్లా..?
ఆ జిల్లాకు ఎస్పీగా వెళ్లాలంటే.. అమ్మో ఆ జిల్లాకా అంటున్నారట ఐపీఎస్ అధికారులు. ఒకప్పుడు హేమాహేమీలైన ఐపీఎస్‌లు ఆ జిల్లాలో ఎస్పీలుగా పని చేశారు. కానీ ప్రస్తుతం ఆ జిల్లాకు ఎస్పీగా వెళ్లాలంటే ఎందుకో వెనకడుగు వేస్తున్నారట.
ఆ జిల్లాకు ఎస్పీగా వెళ్లాలంటే.. అమ్మో ఆ జిల్లాకా అంటున్నారట ఐపీఎస్ అధికారులు. ఒకప్పుడు హేమాహేమీలైన ఐపీఎస్‌లు ఆ జిల్లాలో ఎస్పీలుగా పని చేశారు. కానీ ప్రస్తుతం ఆ జిల్లాకు ఎస్పీగా వెళ్లాలంటే ఎందుకో వెనకడుగు వేస్తున్నారట. ఇది మేం చెబుతున్నది కాదు. కారణాలు ఏమైతేనేం గడిచిన ఎనిమిది నెలల్లో ఆ జిల్లాకు ఐదుగురు ఎస్పీలు మారారు. అంటే ప్రతి రెండు నెలలకు ఒక ఎస్పీ మారారు. ఇంతకీ ఆ జిల్లా ఏంటి అనుకుంటున్నారా?
ఒకప్పుడు ఫ్యాక్షన్ వేళ్ళేనుకుపోయిన అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్‌ను కూకటివేళ్ళతో పెకలించిన ఐపీఎస్‌లు. ఇప్పుడు అనంతపురం జిల్లాకు రావాలంటే.. ఎందుకులే అనుకుంటున్నారట. ఒకవేళ ఉన్నతాధికారులు అనంతపురం జిల్లాకు బదిలీ చేసినా.. ఏవో కారణాలు చెబుతూ రెండు, మూడు నెలలకే మాకు అనంతపురం వద్దు.. ఇక్కడి నుంచి బదిలీ చేయండి.. అంటూ పోలీస్ బాస్‌కు మొరపెట్టుకుంటున్నారట.
అనంతపురం జిల్లా మొత్తంలో ఒక్క తాడిపత్రి నియోజకవర్గమే ప్రస్తుతం అత్యంత సమస్యాత్మకంగా మారింది. జిల్లాకు వచ్చే ఎస్పీలకు తాడిపత్రి ఓ తలనొప్పిగా మారిందట. ఐపీఎస్‌లకు తలనొప్పిగా మారిన తాడిపత్రి విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఏం చేయబోతున్నారు…
అంజనా సిన్హా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, స్టీఫెన్ రవీంద్ర, ప్రస్తుత ఏపీ డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు ఇలాంటి ఐపీఎస్‌లు ఎందరో అనంతపురం జిల్లాలో ఎస్పీగా పని చేశారు. గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాను అదేవిధంగా ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలను కను సైగతో తమ ఆధీనంలోకి తెచ్చుకున్న ఐపీఎస్ లు.. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా.. శ్రీసత్యసాయి జిల్లాగా విడిపోయింది. దీంతో అనంతపురం జిల్లా ప్రస్తుతం ఎనిమిది నియోజకవర్గాలకే పరిమితమైంది. అనంతపురం జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పెద్దగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. ఒక్క తాడిపత్రి.. జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీలకు చుక్కలు చూపిస్తుందట.
గడిచిన ఎనిమిది నెలల్లో అనంతపురం జిల్లాలో ఐదుగురు ఎస్పీలు మారారు. కారణాలు ఏమైనా కావచ్చు.. ఎనిమిది నెలల్లో ఐదుగురు ఎస్పీలు మారడం మాత్రం ఆందోళన కలిగించే అంశం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ జిల్లా పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. డీఎస్పీలు, సీఐలు ఎవరు అని.. జిల్లా గురించి తెలుసుకుని అవగాహన చేసుకునే లోపే బదిలీ అవుతున్నారు. కొందరిని ప్రభుత్వ పెద్దలు బదిలీ చేస్తే, మరికొందరు బదిలీ కోరుకున్నారు. ఇలా గడిచిన ఎనిమిది నెలల్లో.. ఐదుగురు ఎస్పీలు మారారు.
జిల్లాకు కొత్తగా వచ్చే ఎస్పీలకు తాడిపత్రి నియోజకవర్గం ఓ సవాల్ గా మారిందట. ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న ఐపీఎస్‌లకు తాడిపత్రి సమస్యలతో స్వాగతం పలుకుతుంది. ఒకసారి గడిచిన ఐదు ఆరు నెలల్లో తాడిపత్రి విషయంలోనే ఏం జరిగిందో గమనిస్తే.. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ అన్బురాజన్ బదిలీ అవడంతో బాధ్యతలు చేపట్టిన అమిత్ బర్దార్.. తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చెలరేగిన అల్లర్లతో బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన ఎస్పీ గౌతమి సాలి.. ఎన్నికల కౌంటింగ్ ను సమర్ధవంతంగానే నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన నెల రోజులకే ఎస్పీ గౌతమీ సాలి కూడా బదిలీ అయ్యారు.
ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత అన్ని జిల్లాలకు ఎస్పీలను మార్చింది. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు కెవీ మురళీకృష్ణ ఎస్పీగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు తీసుకున్న రోజే ఎస్పీ మురళీకృష్ణకు తాడిపత్రి సెగ తగిలింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భారీ కాన్వాయ్‌తో తాడిపత్రి నుంచి అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తనపై అక్రమ కేసులు పెట్టిన వారిని విచారించాలని ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ మురళీకృష్ణను కలిసి వినతి పత్రం ఇచ్చారు. సరిగ్గా నెల రోజులకే ఎస్పీ మురళీకృష్ణ కూడా బదిలీ అయ్యారు.
ఆ తర్వాత ఆగస్ట్ 19వ తేదీన అనంతపురం జిల్లా ఎస్పీగా పి. జగదీష్ బాధ్యతలు తీసుకున్నారు. అలా జిల్లా ఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు లేదో.. ఆ మరుసటి రోజే తాడిపత్రిలో అల్లర్లు చెలరేగాయి. చార్జ్ తీసుకున్న మరుసటి రోజే తాడిపత్రిలో విధ్వంసం చెలరేగడంతో రెండు రోజులు జిల్లా ఎస్పీ తాడిపత్రిలోనే మకాం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా గడిచిన ఎనిమిది నెలల్లో అనంతపురం జిల్లాకు ఐదుగురు ఎస్పీలు మారారు. చాలావరకు ఎస్పీలు మారడంలో తాడిపత్రి కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. దీంతో కొత్తగా జిల్లాకు వచ్చే ఎస్పీలకు తాడిపత్రి తలనొప్పిగా మారుతోందా? అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ముఖ్యంగా తాడిపత్రిలో అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు ఏం చేయాలి అనేదానిపై జిల్లా ఎస్పీ తో పాటు… పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గానే దృష్టి పెట్టారట.
గతంలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ధర్మవరం సబ్ డివిజన్ పరిధిలో అత్యంత సమస్య ఆత్మకమైన ధర్మవరం, తాడిపత్రి, పెనుకొండ నియోజకవర్గాలు ఉండేవి. దీంతో ధర్మవరం సబ్ డివిజన్ కు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను ఏఎస్పీగా విధులు అప్పగించారు. కార్యక్రమంలో ధర్మవరం, పెనుకొండ పరిస్థితుల్లో మార్పు రావడంతో ధర్మవరం సబ్ డివిజన్ కు ఐపీఎస్ అధికారిని కాకుండా డిఎస్పీ ర్యాంక్ అధికారులకు విధులు అప్పగించారు. అయితే తాడిపత్రిలో తరచూ అల్లర్లు చెల్లరేగడం… ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే గొడవలు జరుగుతాయి అన్న సంకేతాలు రావడంతో.. తాడిపత్రి అంశాన్ని పోలీసు ఉన్నతాధికారులు చాలా సీరియస్‌గానే పరిగణిస్తున్నారట.
తాడిపత్రిలో అల్లర్లు జరిగిన ప్రతిసారి జిల్లా ఎస్పీ స్వయంగా తాడిపత్రికి వచ్చి… పోలీస్ స్టేషన్లో రెండు, మూడు రోజులు మకాం వేస్తే గాని పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. దీంతో జిల్లా ఎస్పీ కేవలం తాడిపత్రి కోసం సమయాన్నంతా తెచ్చిస్తే.. ఇక జిల్లాలోని మిగిలిన ప్రాంత పరిస్థితులను ఎలా పర్యవేక్షించాలి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దీంతో గతంలో ధర్మవరం సబ్ డివిజన్ పరిధికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను ఏఎస్పీగా నియమించినట్లే.. తాడిపత్రికి కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ నే ఏఎస్పీగా నియమిస్తే తప్ప.. తాడిపత్రిలో పరిస్థితులు మారడం.. అదుపులోకి రావడం జరుగుతుందేమోనని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారట.
వాస్తవానికి ఎన్నికలకు ముందే తాడిపత్రికి ఏఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని అప్పటి ప్రభుత్వం భావించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. దీంతో మరోసారి తాడిపత్రి సబ్ డివిజన్ కు ఏఎస్పి ఇస్తాయి అధికారిని నియమించాలన్న ప్రతిపాదన తెర మీదకు వచ్చిందట… అది కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను ఏఎస్పీగా నియమిస్తే తప్ప తాడిపత్రిలో రాబోయే రోజుల్లో అల్లర్లను.. జరగబోయే విధ్వంసాలను కంట్రోల్ చేయలేము అన్న ఆలోచనతో పోలీస్ బాస్ ఉన్నారట. జిల్లా ఎస్పీల బదిలీలకు రాజకీయ ఒత్తిళ్లు లేకపోయినప్పటికీ… జిల్లా ఎస్పీగా వచ్చే ఐపీఎస్ ఆఫీసర్ కు తీవ్రమైన ఒత్తిళ్లు వస్తున్నాయట.
ఇక ఎస్పీ కే ఒత్తిళ్లు ఉంటే… తాడిపత్రిలో స్థానికంగా పనిచేస్తున్న పోలీసుల పరిస్థితి మరింత ధైర్యంగా ఉందట. ఏ పార్టీ అధికారంలో ఉన్నా… తాడిపత్రిలో పరిస్థితులు మాత్రం పోలీసుల కంట్రోల్లో లేకుండా పోతుంది అన్న అభిప్రాయం అయితే అందరిలో ఉంది. కొత్తగా అనంతపురం జిల్లాకు వచ్చిన ఎస్పీ జగదీష్ తాడిపత్రి విషయంలో భవిష్యత్తులో ఎలా వ్యవహరిస్తారనేది వేచి చూడాలి..!
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..