AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan First Step: ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు.. గ్రామాల రూపురేఖలు మారేనా..?

ప్రజా దర్బార్ ద్వారా స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలనాపరంగా మరో ముందడుగు వేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించారు.

Pawan First Step: ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు.. గ్రామాల రూపురేఖలు మారేనా..?
Pawan Kalyan Gramasabha
P Kranthi Prasanna
| Edited By: |

Updated on: Aug 24, 2024 | 5:05 PM

Share

ప్రజా దర్బార్ ద్వారా స్వయంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలనాపరంగా మరో ముందడుగు వేశారు. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి రికార్డు సృష్టించారు. రాజకీయాలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.

పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధికి గ్రామసభలే మూలాధారం. అలాంటి గ్రామ సభలు రానురాను ఎప్పుడో అంతరించిపోయాయి. ఒకప్పుడు గ్రామాల్లో గ్రామ సభలకు ఉన్నంత ప్రాముఖ్యత దేనికి లేదు. కానీ ఈ తరం వారికి గ్రామ సభలు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. కానీ ఇది ఒకప్పటి లెక్క ఇప్పుడు ట్రెండ్ మారింది అంటున్న పవన్ కళ్యాణ్, లెక్క మారాల్సిందే అంటూ దూసుకుపోతున్నారు. రాజకీయాలకు అతీతంగా గ్రామసభలు జరగాల్సిందే అంటున్నారు.

వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరికీ మింగుడు పడని విషయం ఇది. రాష్ట్రంలో ఎందులోనూ లేని విధంగా గ్రామ పంచాయతీ నిధుల్లోనే భారీ ఎత్తున గోల్‌మాల్ జరుగుతూ ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కంటికి కనిపించని రాజకీయం గ్రామాల్లోనే ఉంటుంది. అలాంటి గ్రామాల్లో ప్రజలే స్వయంగా పాలనలో భాగమై అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవడం అనేది ప్రస్తుతం మారిన రాజకీయ విధానాలకు అంత సులువైన విషయం కాదు. కానీ మార్పు తప్పదంటున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మొదటి అడుగులోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున గ్రామసభల నిర్వహించి దిగ్విజయంగా సక్సెస్ అయ్యారు.

గ్రామ పాలన, అభివృద్ధి గురించి చర్చించడానికి గ్రామానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి గ్రామసభ ఫోరమ్‌ను ఉపయోగిస్తారు. గ్రామసభ సమగ్ర ఆదేశం పర్యవేక్షణలోనే పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. పంచాయతీ అన్ని నిర్ణయాలను గ్రామసభ ద్వారానే తీసుకుంటుంది. గ్రామసభ అనుమతి లేకుండా ఏ నిర్ణయం చెల్లుబాటు కాదు. గ్రామసభ అనేది పంచాయితీ రాజ్ వ్యవస్థ ప్రాథమిక విభాగం ఇది చాలా పెద్దది.

శాశ్వత శరీరం అని కూడా అంటారు. గ్రామసభ అంటే ఓటర్ల సభ. గ్రామ పంచాయితీ, బ్లాక్ పంచాయితీ , జిల్లా పరిషత్ లాంటి పంచాయితీ రాజ్ అన్ని ఇతర సంస్థలు ఎన్నికైన ప్రతినిధులచే ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. గ్రామసభ తీసుకున్న నిర్ణయాలను మరే ఇతర సంస్థ రద్దు చేయదు. గ్రామసభ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసే అధికారం ఒక్క గ్రామసభకు మాత్రమే ఉంటుంది. గ్రామంలో నివసిస్తున్న పెద్దలు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర పంచాయితీ రాజ్ చట్టాల ప్రకారం సంవత్సరానికి కనీసం రెండు నుంచి నాలుగు సార్లు గ్రామసభ తప్పనిసరిగా జరగాలి. సర్పంచ్ ఆమోదం పొందిన తర్వాత పంచాయతీ కార్యదర్శి గ్రామసభ నిర్వహిస్తాడు. గ్రామసభలో 10% మంది సభ్యులు లేదా గ్రామసభలోని 50 మంది వ్యక్తులు గ్రామసభను నిర్వహించడానికి తమ అభ్యర్థనను సమర్పించినప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు.

అయితే, ఆ సభ్యులు సమావేశ ఉద్దేశాన్ని తెలియజేయాల్సి ఉంటుంది. సమావేశానికి సంబంధించిన వ్రాతపూర్వక అభ్యర్థనను సమావేశ తేదీకి 5 రోజుల ముందు కార్యాలయ సమయంలో సర్పంచ్‌కు అందచేస్తారు. సర్పంచ్ కోరిన తేదీలో సమావేశం నిర్వహించడంలో విఫలమైతే, సమావేశాన్ని కోరిన సభ్యులు స్వయంగా గ్రామసభ సమావేశాన్ని నిర్వహించవచ్చు …ఈ సమావేశంలో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలు,పరిష్కారాలు ఇతర నిర్ణయాలు అన్నింటిని చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదంతా నిబంధనల ప్రకారం ఒకప్పటి పాత లెక్క కానీ ఇప్పుడు ఇవేమీ ఏ గ్రామాల్లోనూ జరగట్లేదు. వాస్తవానికి గ్రామ సభల్ని గ్రామ ప్రజలు మర్చిపోయారు. కానీ ఇప్పుడు మళ్లీ దీన్ని ఏకతాటిపై తీసుకురావడానికి ఆ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు.

గ్రామాల అభివృద్ధి బాగుంటేనే రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి బాగుంటుందని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారీగా నిధులను పెంచిన పవన్.. ఇప్పుడు తాజాగా గ్రామానికి పట్టుకొమ్మలైన గ్రామ సభలు పైన దృష్టి సారించారు. సర్పంచులు ,పంచాయితీ ప్రజలు కలిసి గ్రామీణ అభివృద్ధికి నిర్ణయాలు తీసుకోవాలని గ్రామాల్లో జరిగే ప్రతి పని పైన, పెట్టే ప్రతి ఖర్చుపైన అందరిలో చైతన్యం రావాలని అందుకోసం కచ్చితంగా గ్రామ సభలు నిర్వహించాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,326 గ్రామపంచాయతీలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల్లో కొన్ని కోట్ల రూపాయలు విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. రాజకీయాలకు అతీతంగా గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ అడుగులు వేస్తామంటున్నారు.. ఒకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వారివల్ల గ్రామీణ అభివృద్ధి కి జరిగిన నష్టాన్ని బయటకు తీస్తూనే భవిష్యత్తులో గ్రామీణ అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూర్చడంలో తన వంతు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా కేంద్రం నుండి 15వ ఆర్థిక సంఘం నిధులు 991 కోట్ల రూపాయలను పంచాయతీల అకౌంట్లోకి జమ చేయగా భవిష్యత్తులో స్వర్ణ పంచాయతీల దిశగా పంచాయతీలని ఆర్థికంగా బలోపేతం చేసే కార్యక్రమాలను చేస్తూ స్థానిక వనరులను ఉపయోగించుకుంటూ గ్రామీణ అభివృద్ధి కి నూతన కార్యక్రమాలతో చిత్తశుద్ధితో పని చేస్తామంటున్నారు.

వాస్తవానికి ప్రస్తుతం ఉన్న గ్రామాల్లో పంచాయతీలో జరిగే పనులు చాలావరకు ఆ గ్రామ ప్రజలకు తెలియనే తెలియదు. వచ్చిన నిధులు పెట్టిన్ ఖర్చు లెక్క ఉసే ఉండదు… చాలా గ్రామాల్లో ఇప్పటికీ సరైన రోడ్లు లేవు త్రాగడానికి నీరు లేవు విద్యుత్ దీపాలు లేవు కనీస మౌలిక వసతులు కూడా లేక ప్రాథమిక అభివృద్ధికి కూడా నోచుకోని గ్రామాలు ఎన్నో ఉన్నాయి అలాంటి చాలా గ్రామాలు ఈ గ్రామ సభల నిర్వహిస్తే అభివృద్ధి దిశగా అడుగులు వేసినట్టే అవుతుంది. కానీ ఇదేమి అంతా సాదాసీదా విషయం కాదు. వీటిలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు బడ రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది ప్రజలే పాలనలో భాగస్వామ్యం అవడం అంటే నేటి రాజకీయ నాయకుల్ని నేరుగా ప్రశ్నించడమే అవుతుంది. అది ప్రస్తుత రాజకీయ నాయకులకి పెద్దగా రుచించని ఆదాయం లేని విషయం. దాంతో గ్రామ సభల నిర్వహణతో వచ్చే మార్పు కంటే జరిగే గొడవలే అత్యధికంగా ఉంటాయి

వీటిని కూడా కట్టడి చేస్తామంటున్న గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ గ్రామానికి సంబంధించిన ప్రతి పని వివరాలను ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేస్తామంటున్నారు. చేసిన పనికి సంబంధించి కాంట్రాక్టర్ పేరుతో సహా ఆ పని వివరాలను సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డులను పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీని ద్వారా ప్రతి ఒక్కరికి ఆ గ్రామంలో జరిగిన పనుల నాణ్యతే కాదు ఎంత నిధులు ఖర్చయ్యాయి అనే వివరాలు పూర్తిగా తెలుస్తాయని దీని ద్వారా నిధులు అన్యాక్రాంతం కాకుండా గ్రామీణ అభివృద్ధి కచ్చితంగా జరుగుతుందని ప్రజలు కూడా భాగస్వామ్యమై అధికారులని నాయకుల్ని ప్రశ్నించడానికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు పవన్. మరి గ్రామాలకు పునర్ వైభవం రావాలంటున్న పవన్ కోరిక ఎంతవరకు నెరవేరుతుందో..? భవిష్యత్తులో ఈ నిర్ణయం సక్సెస్ అవుతుందా రాజకీయంగా ఎదురయ్యే సవాలను పవన్ ఎలా ఎదుర్కుంటారా? రాజకీయాలకు అతీతంగా పంచాయతీల అభివృద్ధి సాధ్యమవుతుందా వేచి చూడాల్సిందే..!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..