AP News: వల బరువెక్కింది.. చిక్కిన చేప లక్షలు తెచ్చిపెట్టింది.! ఎంత పలికిందంటే.?

మీరు బజారుకెళ్తే.. ఒక చేపను ఎంతకి కొంటారు.? చిన్న చేప అయితే యాభై రూపాయలు.. అంతకంటే పెద్దది 100.. కాస్త మేలురకం చేప అయితే రెండు వందలు.. మహా అయితే ఐదువందలు.. చేప భారీ బరువుగా ఉంటే.. దాని విలువ ఉంటుంది.. అంతేనా?! కానీ ఏకంగా మూడున్నర లక్షల విలువైన చేప కోసం మీరు ఎక్కడైనా విన్నారా..?

AP News: వల బరువెక్కింది.. చిక్కిన చేప లక్షలు తెచ్చిపెట్టింది.! ఎంత పలికిందంటే.?
Fish Sold For Lakhs
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Ravi Kiran

Updated on: Oct 18, 2023 | 11:23 AM

మీరు బజారుకెళ్తే.. ఒక చేపను ఎంతకి కొంటారు.? చిన్న చేప అయితే యాభై రూపాయలు.. అంతకంటే పెద్దది 100.. కాస్త మేలురకం చేప అయితే రెండు వందలు.. మహా అయితే ఐదువందలు.. చేప భారీ బరువుగా ఉంటే.. దాని విలువ కూడా అంతే ఉంటుంది.. అంతేగా..?! కానీ ఏకంగా మూడున్నర లక్షల విలువైన చేప గురించి ఎక్కడైనా విన్నారా.. చూశారా..? ఇప్పుడు మీకు అంతటి ఖరీదైన చేప విశేషాలు చెప్పబోతున్నాం..

అది అనకాపల్లి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతాల్లోని పాయకరావుపేట పెంటకోట గ్రామం. అక్కడ మత్స్యకారులే నివాసం ఉంటారు. వారి జీవనాధారం చేపల వేట. అలలకు ఎదురీది సాహసం చేసి మరి వేట చేస్తూ ఉంటారు. ఒక్కోసారి వారి శ్రమకు తగిన ప్రతిఫలం కూడా లభించదు. ఎప్పుడూ మాదిరిగానే చేపల మన్నియ్య అనే మత్స్యకారుడు వేటకు వెళ్లాడు. గంగమ్మకి మొక్కుకొని సముద్రంలో వల విసిరాడు. వలకు ఏదో చిక్కింది. కాస్త బరువుగా కూడా అనిపించింది. నిజంగా ఆ చిక్కింది చేపేనా.. ఇంకా ఏదైనా ఉందా.. అన్న సందేహం. సహచరులతో కలిసి మెల్లగా వలను పైకి లాగారు. వల చివరికి వచ్చే కొద్ది వారిలో టెన్షన్. కానీ ఆ టెన్షన్ ఎంతసేపు లేదు. ఎందుకంటే ఆ వలకు చిక్కింది చేపే..! అది కూడా మామూలు చేప కాదు భారీకాయంతో ఉంది.

గోల్డెన్ ఫిష్‌తో లక్కీ ఛాన్స్..

ఆ చేప వలతో సహ పైకి వస్తోన్న కొద్దీ.. మత్స్యకారుల్లో పట్టలేనంత ఆనందం. ఎందుకంటే అది మామూలు చేప కాదు. గోల్డెన్ ఫిష్‌గా పిలుచుకునే కచిడి చేప. దాన్నే కిచిడీ పీస్ కూడా అంటుంటారు. మెల్లగా లాగి అతి కష్టం మీద బోటుపై ఎక్కించుకున్నారు. హుషారుగా ఒడ్డుకొచ్చేసారు. విషయం ఆ నోటా ఈ నోటా పాకింది. చేపను చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. అంతే ఆసక్తిగా ఆ చేపను సొంతం చేసుకునేందుకు పోటీపడ్డారు. దీంతో ఇక వేలం నిర్వహించక తప్పలేదు.

3.20 లక్షలు పలికి..

పాయకరావుపేట తీర ప్రాంతంలో మునుపెన్నడూ ఇటువంటి చేప చిక్కలేదు. 22 కిలోల ఈ చేపను వేలానికి పెట్టారు. సూరి మని అనే వ్యక్తి వచ్చి.. చేపను సొంతం చేసుకున్నాడు. చేప కిలో 14 1/2 వేల చొప్పున.. మూడు లక్షల 20 వేల రూపాయలకు కొనుగోలు చేశాడు. దీంతో చేపల మన్నియ్య కుటుంబం ఆనందంలో మునిగి తేలింది. ఒక్క రోజులోనే ఆ మత్స్యకారుడు లక్షాధికారి అయిపోయాడు.

ఆ చేపకు ఎందుకంత డిమాండ్..?

సాధారణంగా గోదావరి నది జిల్లాల్లో పులస ఖరీదైన చేప. అరుదుగా లభించే ఈ చేపను తినేందుకు పోటీపడతారు జనం. అందుకు తగ్గట్టుగానే దాని ధర కూడా అలాగే ఉంటుంది. డిమాండ్‌ను బట్టి ధర భారీగా పెరిగిపోతూపోతుంది. ఎందుకంటే ఆ చేప రుచి అలాంటిది మరి. పుస్తెల అమ్ముకునైనా పులస చేప తినాలని అంటుంటారు. అలాగే.. సముద్ర జలాల్లో అరుదుగా లభించేది ఈ కచడి చేప. మత్స్యకారులు దీన్ని గోల్డెన్ ఫిష్‌గా భావిస్తారు. అత్యంత అరుదుగా వలకు చిక్కుతుంటాయి. ఇవి ఒకచోట ఉండవు. వేర్వేరు ప్రాంతాల్లో సముద్ర జలాల్లో సంచరిస్తూ ఉండడం ఈ చేప లక్షణం. చేప మాంసం చాలా రుచిగా ఉండడంతో పాటు.. ఔషధ గుణాలతో కూడుకున్నదని అంటుంటారు. అందుకే ఆ చేపకు అంత డిమాండ్ మరి. కచిడి చేపలో మగ చేప బంగారు వర్ణంలో ఉంటుంది. ఈ చేపల్లో పొట్ట భాగం చాలా విలువైనదట. చేప బరువును బట్టి దాని పొట్ట భాగమే ఏకంగా 80 వేల వరకు ధర పలుకుతుందట.

మందులు, ఔషధాల్లో ఈ చేపను వినియోగిస్తుంటారు అనేది మత్స్యకారులే చెబుతున్నారు. అందుకే.. జీవితంలో ఒక్కసారైనా తమ వరకు ఇటువంటి చేపలు చిక్కాలని మత్స్యకారులు కోరుకుంటారట. ఎవరికైతే ఈ చేప చిక్కుతుందో.. వాళ్ల పంట పండినట్లే. అందుకే ఈ చేపకు అంతటి ప్రత్యేకత..! పాయకరావుపేట తీరంలో ఇప్పుడు ఆ మత్స్యకారుడు మన్నయ్య హాట్‌టాపిక్‌గా మారాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..