AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold: బంగారం కొంటున్నారా..? ఇదో కొత్త మోసం.. తెలుసుకోండి..,

మేలిమి బంగారమని మనం అనుకుంటాం. కానీ ఆ పుత్తడిలో ఇత్తడే కలిసిందో ఇంకేదన్నా మిక్స్‌ అయిందో తయారుచేసినోళ్లకే ఎరుక. హాల్‌మార్క్‌ ఉంటే కళ్లుమూసుకుని కొనేయొచ్చనుకుంటాం. కానీ ఆ హాల్‌మార్క్‌ని కూడా హైజాక్‌ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. కరెన్సీ నోట్లే అచ్చుగుద్దినట్లు ప్రింటేస్తున్న మహానుభావులున్నారు. అలాంటిది అమ్మే ఆభరణాలపై హాల్‌మార్క్‌ వేసి.. నిఖార్సయిన బంగారమని నమ్మించడం ఎంత పని. గుంటూరులో కొన్ని షాపుల్లో అదే జరుగుతోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అధికారుల సోదాల్లో బయటపడిందీ విషయం.

Gold: బంగారం కొంటున్నారా..? ఇదో కొత్త మోసం.. తెలుసుకోండి..,
Gold
T Nagaraju
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 06, 2025 | 6:45 PM

Share

మెరిసేదంతా బంగారం కాదు. మార్కెట్‌లో పుత్తడి పేరుతో కొందరు ఇత్తడిని అంటగడుతున్నారనే.. మోసాలకు చెక్‌ పెట్టేందుకు, మరింత పారదర్శకతకోసం హాల్‌మార్క్‌ని తీసుకొచ్చింది కేంద్రప్రభుత్వం. బంగారు ఆభరణాలకు ఈ స్టాంప్‌ని తప్పనిసరి చేసింది. సుమారు 2లక్షలమంది హాల్‌మార్క్‌ రిజిస్టర్డ్‌ జ్యువెలరీ వ్యాపారులున్నారు. స్వచ్ఛత ఆధారంగా బంగారానికి గ్రేడ్‌లు ఇస్తూ హాల్‌మార్క్‌ ముద్రిస్తున్నా.. కొన్ని మోసాలు జరిగిపోతూనే ఉన్నాయి. హాల్‌మార్క్‌పై కస్టమర్లకున్న భరోసాను కూడా దెబ్బతీస్తున్నారు కొందరు. గుంటూరు తనిఖీల్లో దొరికిన హాల్‌మార్క్‌ లేజర్‌ మిషినే ఓ ఎగ్జాంపుల్‌.

హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయాలని బిఐఎస్(బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. బంగారు నాణ్యతను ఈ హాల్ మార్క్ సూచిస్తుంది. బంగారు ఆభరణాలు తయారు చేసిన వాటిపై 22 క్యారెట్స్ 916 కేడిఎం అని ముద్రిస్తే అది నాణ్యమైనదిగా గుర్తింపు పొందినట్లు లెక్క. అయితే గుంటూరు లాలాపేటలో ఉన్న కొంతమంది వ్యాపారులు అనుమతి లేకుండా ఈ హాల్ మార్క్‌ను ముద్రిస్తున్నట్లు బిఐఎస్ అధికారులు సమాచారం అందింది.

దీంతో బిఐఎస్ జాయింట్ డైరెక్టర్ అర్జున్ తన సిబ్బందితో గుంటూరు నగరంలోని లాలాపేటలో ఉన్న బంగారు షాపులపై దాడులు చేశారు. ముఖ్యంగా కరిముల్లా జ్యూయెలర్స్ లేజర్ మెషీన్ ద్వారా ఎటువంటి అనుమతులు లేకుండానే హాల్ మార్క్ ముద్రిస్తున్నట్లు అర్జున్ గుర్తించారు. వెంటనే ఆ మెషీన్‌ను సీజ్ చేశారు. అనంతరం అక్కడున్న బంగారు నాణ్యతను పరిశీలించారు. దీనితో పాటు మరికొన్ని షాపుల్లో కూడా తనిఖీలు చేపట్టారు. అక్కడ కూడా నాణ్యత లేని బంగారానికి హల్ మార్క్ ముద్రిస్తున్నట్లు గుర్తించి చర్యలు చేపట్టారు.

బంగారం ధరలు పెరిగిపోతుండటంతో నకిలీల బెడద ఎక్కువైంది. ఈ క్రమంలో ఏ కొంచెం కల్తీ చేసిన వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే అనుమతి లేని హాల్ మార్క్‌ను వేసి వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు. అయితే మొట్టమొదటగా గుంటూరులోనే ఇటువంటి తనిఖీలు నిర్వహించినట్లు అర్జున్ చెప్పారు. హాల్ మార్క్ ముద్రించే వారికి ప్రభుత్వం లైసెన్స్ ఇస్తుందని, లైసెన్స్ లేకుండా హాల్ మార్క్ ముద్రించడం నేరం అవుతుందన్నారు. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తామన్నారు. ఎక్కడైనా అనధికారికంగా హాల్ మార్క్‌ను ముద్రిస్తుంటే తమకు సమాచారం అందించవచ్చన్నారు. అధికారులు 1286 గ్రాముల బంగారాన్ని కూడా సీజ్ చేశారు. బిఐఎస్ అధికారుల దాడులతో గుంటూరు బంగారు వ్యాపారస్థుల్లో కలకలం రేగింది.

ఒక్కో ఆర్నమెంట్‌ ఒక్కో ప్లేస్‌లో ఉంటుందీ హాల్‌మార్క్‌. ఉంగరం, బ్యాంగిల్స్‌కి లోపలి భాగంలో.. నెక్లెస్‌కి లాకెట్‌ వెనుక భాగంలో ఇలా ఆ ఆర్నమెంట్‌ స్వరూపాన్ని బట్టి ఈ మార్క్‌ ఉంటుంది. హాల్‌మార్కింగ్ సెంటర్ మార్క్, క్యారెట్ బీఐఎస్ స్టాంప్, జ్యువెలరీ ఐడింటిఫికేషన్ మార్క్, ఇయర్ ఆఫ్ హాల్ మార్కింగ్, ప్యూరిటీ ఆఫ్ గోల్డ్ వంటి వివరాలు కనిపిస్తాయి. కాకపోతే అవి కంటితో చూడలేనంత సూక్ష్మంగా ఉంటాయి కాబట్టి ఏ భూతద్దంలోనో చూడాల్సిందే.

ఇప్పటిదాకా హాల్‌మార్క్‌ ఆర్నమెంట్స్‌ అంటే కళ్లుమూసుకుని కొనేస్తున్నాం. కానీ గుంటూరులో తమ ఆభరణాలకు కొందరు వ్యాపారులు సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇస్తున్న విషయం బయటపడటంతో…ఒక్క గుంటూరేనా మరికొన్ని చోట్ల కూడా ఇదే దందా నడుస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ మనం కొంటోంది మేలిమి బంగారమేనా? ఆ ఆర్నమెంట్స్‌మీద ఉంది ఒరిజనల్‌ హాల్‌మార్కేనా? ఇన్ని డౌట్లెందుకనుకుంటే BIS వెబ్‌సైట్‌లో చెక్‌చేసుకోండి. అనుమానాలుంటే కంప్లయింట్‌ చేయండి.