Andhra: గంజాయ్ ఉందంటూ అకస్మాత్తుగా బైక్ ఆపి చెక్ చేశారు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
పోలీసులమంటూ ఓ వృద్ధ రైతును అడ్డగించిన ఇద్దరు కేటుగాళ్లు తనిఖీల పేరుతో రూ.50 వేల నగదుతో పరారైన ఘటన తెనాలి సమీపంలో కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన రైతు బ్యాంక్ నుంచి నగదు తీసుకుని ఇంటికి వెళ్తుండగా నకిలీ పోలీసులు బైక్‌ను ఆపి తనిఖీలు నిర్వహించినట్లు నటించారు. అనంతరం డబ్బు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

పోలీసులమంటూ అకస్మాత్తుగా బైక్ ను ఆపారు.. తనిఖీలంటూ చెక్ చేశారు.. ఆ తర్వాత వెళ్లిపోమని చెప్పారు.. ఈ సమయంలోనే.. కేటుగాళ్లు 50వేల రూపాయలు కొట్టేశారు.. ఈ షాకింగ్ ఘటన ఏపీలోని గుంటూరులో కలకలం రేపింది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం తూములూరుకు చెందిన వృద్ధ రైతు మల్లిఖార్జున రెడ్డి నందివెలుగులోని మిల్లుకు ధాన్యం అమ్మాడు. అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకునేందుకు నిన్న బైక్ పై నంది వెలుగు వచ్చాడు. మిల్లు యాజమాన్యం మల్లిఖార్జున రెడ్డికి ఇవ్వాల్సిన మొత్తంలో కొంత నగదు ఇచ్చి మిగిలిన వాటికి చెక్ ఇచ్చారు. చెక్ తీసుకున్న మల్లిఖార్జున రెడ్డి తెనాలి బ్యాంక్ కు వెళ్లి దాన్ని నగదుగా మార్చుకున్నాడు. మొత్తం లక్షా అరవై వేల రూపాయలను బైక్ లో పెట్టుకొని ఇంటికి బయలు దేరాడు.
రైతు తెనాలి ఆటో నగర్ వద్దకు రాగానే టూవీలర్ పై మరొక ఇద్దరూ వేగంగా దూసుకొచ్చారు. రైతును ఆపి తాము పోలీసులమని చెప్పారు. వాహానాన్ని తనిఖీ చేయాలన్నారు. గంజాయి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయంటూ బైక్ ను చెక్ చేశారు. బైక్ డిక్కి తాళాలు తీసుకొని అందులో కూడా వెతికారు. కొద్ది సేపటి తర్వాత ఏంలేదంటూ అక్కడి నుండి వెళ్లిపోయారు. రైతు ఇంటికి వెళ్లి చూడగా తన సంచిలో ఉండాల్సిన డబ్బులో యాభై వేల రూపాయల నగదు మాయం అయింది. వెంటనే ఆ ఇద్దరే మాయం చేసినట్లు రైతు భావించాడు. వెంటనే తెనాలి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
రంగంలోకి దిగిన పోలీసులు సిసి కెమెరా విజువల్స్ పరిశీలించారు. రైతు ఉదయం 11.40 గంటలకు బ్యాంక్ వద్ద బయలు దేరినట్లు గుర్తించారు. 11.55 గంటలకు ఆటోనగర్ వద్ద రైతును అడ్డగించిన నకిలీ పోలీసులు డబ్బును తీసుకెళ్లినట్లు తేల్చారు. బైక్ నంబర్ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నకిలీ పోలీసుల పేరుతో గతంలో ఇదే తరహాలో చోరి జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వరుసగా జరుగుతున్న ఘటనలు కావడంతో పాత నేరస్థుడున్నట్లు భావిస్తున్నారు. నకిలీ పోలీసుల్లో ఒకరిని ఇప్పటికే గుర్తించారు. అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
