Andhra News: కాలేజీ లేదు.. క్లాసుల్లేవ్.. కానీ విద్యార్థులు మాత్రం ఫుల్.. ఆ జిల్లాలో వెలుగులోకి మాయా కాలేజ్!
కాలేజీ లేదు.. క్లాస్ రూములు లేవు.. కనీసం కాలేజీ బోర్డు కూడా లేదు.. కానీ ఏటా అడ్మిషన్లు మాత్రం ఫుల్ అవుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. ప్రకాశం జిల్లా అద్దంకి వేదికగా సాగుతోన్న ఓ బీఈడీ కాలేజీ బాగోతం ఇప్పుడు బయటపడింది. పొరుగు రాష్ట్రాల విద్యార్థులే టార్గెట్‌గా, లక్షల రూపాయలు వసూలు చేస్తూ నడుపుతున్న ఈ బోగస్ డిగ్రీల దందా గురించి తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో విద్యా వ్యవస్థను అపహాస్యం చేస్తూ సాగుతోన్న ఒక భారీ విద్యా స్కామ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. క్షేత్రస్థాయిలో ఎలాంటి కాలేజీని నిర్వహించకుండా, కేవలం ప్రభుత్వ రికార్డుల్లో మాత్రమే రిజిస్టర్ చేసుకొని.. విద్యార్థులకు అక్రమంగా బీఈడీ డిగ్రీలను కట్టబెడుతున్న బోగస్ కాలేజీల దందా బయటపడింది. ఏటా లక్షలాది రూపాయల వసూళ్లకు పాల్పడుతూ, పరీక్షల సమయానికి మాత్రమే ప్రత్యక్షమయ్యే ఈ విద్యా మాఫియా వ్యవహారం ఇప్పుడు జిల్లాలో తీవ్ర సంచలనం రేపుతోంది.
పేపర్లకే పరిమితమైన ‘శ్రీ వెంకట సాయి బీఈడీ కాలేజ్’
ప్రభుత్వ అధికారిక రికార్డుల ప్రకారం.. ప్రకాశం జిల్లా అద్దంకి కలవకూరు రోడ్డు అడ్రస్‌తో ‘శ్రీ వెంకట సాయి బీఈడీ కాలేజీ’ నడుస్తున్నట్లు స్పష్టంగా ఉంది. తీరా ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అక్కడ మైండ్ బ్లాంక్ అయ్యే దృశ్యం కనిపిస్తుంది. రికార్డుల్లో ఉన్న ఆ చోట కాలేజీ లేదు, క్లాస్ రూములు లేవు, కనీసం కాలేజీకి సంబంధించిన ఎలాంటి బోర్డు కూడా లేదు. కేవలం అధికారుల రిజిస్టర్లలో మాత్రమే అడ్రస్ ఉంచుకుని, క్షేత్రస్థాయిలో అస్సలు ఉనికిలోనే లేని ఈ మాయా కాలేజీలో ఏటా అడ్మిషన్లు మాత్రం ఫుల్ అయిపోతుండటం గమనార్హం.
పొరుగు రాష్ట్రాల విద్యార్థులే టార్గెట్.. లక్షల్లో వసూళ్లు!
అసలు కాలేజీయే లేనప్పుడు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తున్నారు? అనే ప్రశ్న వెనుక పెద్ద విద్యా వ్యాపార మతలబే దాగి ఉంది.ఈ అదృశ్య కాలేజీ యాజమాన్యం పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, వెస్ట్‌బెంగాల్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను టార్గెట్ చేస్తోంది. ఒక్కో అడ్మిషన్‌కు రూ. 1,00,000 నుండి రూ. 1,50,000 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీరికి క్లాసులు ఉండవు, చదువులూ ఉండవు. కేవలం పరీక్షల సమయానికి మాత్రమే ఈ ఇతర రాష్ట్రాల విద్యార్థులంతా ఒంగోలు, కంభం, మార్కాపురం, గిద్దలూరు, కొండపి, అద్దంకి ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాలకు ఏడాదికి ఒకసారి చేరుకుంటారు. ఇక్కడి లోకల్ హోటళ్లు, లాడ్జీలలో రూములు అద్దెకు తీసుకుని, పరీక్షలు పూర్తయ్యాక డిగ్రీ సర్టిఫికేట్లు చేతపట్టుకుని వెళ్లిపోతున్నారు.
అద్దంకి సెంటర్‌లో గుట్టు రట్టు..
ప్రస్తుతం అద్దంకిలోని ‘శ్రీ ప్రసన్నాంజనేయ డిగ్రీ కాలేజీ’లో బీఈడీ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. రికార్డుల్లో మాత్రమే ఉన్న వెంకట సాయి కాలేజీకి చెందిన సుమారు 111 మంది ఒడిశా విద్యార్థులు ఈ సెంటర్‌లో పరీక్షలు రాస్తుండటంతో ఈ దందా బహిర్గతమైంది. అసలు ఉనికిలోనే లేని, కాలేజీ బోర్డు కూడా లేని ఒక బోగస్ కాలేజీ విద్యార్థులకు హాల్ టికెట్లు ఎలా వచ్చాయి? వారికి పరీక్ష కేంద్రం ఎలా కేటాయించారు? పైగా పరీక్ష హాల్ దగ్గర కనీస నిఘా, పర్యవేక్షణ లేకుండా నిబంధనలను గాలికొదిలేసి పరీక్షలు రాపిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
బిఈడి మాఫియా వేళ్ళూనుకుందా…
బయట బోర్డు కూడా లేకుండా ఇంతటి ఘోరమైన నకిలీ విద్యా మాఫియా నడుస్తున్నా.. జిల్లా అధికారులు గానీ, మండల అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్ల మత్తు ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల అండదండల వల్లే ఈ అదృశ్య కాలేజీలు ఇష్టారాజ్యంగా బీఈడీ డిగ్రీలను అమ్ముకుంటున్నాయని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, రిజిస్టర్లకే పరిమితమైన ఈ బోగస్ కాలేజీలపై, దీని వెనుక ఉన్న పెద్దలపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
