Pawan Kalyan: పవన్ కల్యాణ్ చెప్పిన 1977 ఫార్ములా ఏంటి? ఏపీలో ఇది వర్కౌట్ అవుతుందా?

Andhra Pradesh Politics: శత్రువుకు శత్రువు మిత్రుడు. ఇది అందరికీ తెలిసిన పాత సామెతనే. కాకపోతే రాజకీయాల్లో ఇది బాగా పాపులర్. అధికార పక్ష శత్రువులంతా ఏకం కావాలి..

Pawan Kalyan: పవన్ కల్యాణ్ చెప్పిన 1977 ఫార్ములా ఏంటి? ఏపీలో ఇది వర్కౌట్ అవుతుందా?
Janasena Party Chief Pawan Kalyan
Follow us

|

Updated on: Mar 16, 2022 | 3:09 PM

Andhra Pradesh Politics: శత్రువుకు శత్రువు మిత్రుడు. ఇది అందరికీ తెలిసిన పాత సామెతనే. కాకపోతే రాజకీయాల్లో ఇది బాగా పాపులర్. అధికార పక్ష శత్రువులంతా ఏకం కావాలి. ఆధికార పక్షం వైసీపీని ఓడించాలని ఇప్పుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) అంటున్నారు. జనసేన పార్టీ (Janasena Party) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపికయ్యాయి. సొంత ప్రయోజనాలు వదిలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా రావాలనేది పవర్ స్టార్ సూచన. అది టీడీపీతో పాటు..మిగతా పక్షాలను ఆలోచనలో పడేసింది. అదే సందర్భంలో 1977 ఫార్ములాతో ముందుకు వెళదామనేది ఆయన ఆలోచన. అసలు ఈ ఫార్ములా ఏంటి..? అది అప్పట్లో ఎలా సక్సెస్ అయింది? ఏపీలో ఈ ఫార్ములా సక్సస్ అయ్యే ఛాన్స్ ఉందా? ఒకసారి చూద్దాం…

గత ఎన్నికల్లో….

2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. మొత్తం 175 సీట్లకు గాను ఆ పార్టీ ఓటు షేర్ 49.95 శాతంగా ఉంది. ఇక ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి 23 సీట్లు రాగా..39.17 శాతం ఓట్ షేర్ వచ్చింది. 137 సీట్లల్లో పోటీ చేసి ఒకే ఒక్క సీటు తెచ్చుకున్న జనసేన పార్టీకి ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఓట్ షేర్ 5.53 శాతం వచ్చింది. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్ ప్రత్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. జనసేన సొంత లెక్కల ప్రకారం ఆ శాతం 7.24 గా చెబుతోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదు. అయినా 1.18 శాతం ఓట్లు తెచ్చుకోగా..బీజేపీ అదే దారిలో పయనించింది. కమలం పార్టీకి ఏపీలో 0.84 శాతం ఓట్లు వచ్చాయి. ఇక సిపిఎంకు 0.32 శాతం, సిపిఐకి 0.11 శాతం, బీఎస్పీకి 0.28 శాతం ఓట్ షేర్ వచ్చింది. విపక్షాలు మొత్తం ఓట్లు కలిపితే వచ్చింది 46.25 శాతం ఓట్ షేర్.

Pawan Klayan

Pawan Kalyan

2019 పార్లమెంట్‌ ఎన్నికలు..

ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో చూస్తే లెక్కలు కొద్దిగా తేడా కనిపిస్తోంది. అధికా పార్టీ వైసీపీకి 22 సీట్లు రాగా.. 49.8 ఓట్ షేర్ తెచ్చుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 3 సీట్లే రాగా..ఓట్ షేర్ 40.1గా ఉంది. జనసేనకు ఒక్క సీటు రాకపోయినా వచ్చిన ఓట్ల శాతం 5.87గా నమోదైంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే జనసేనకు0.34 శాతం ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్ కు 1.3 శాతం, బీజేపీకి 0.97 శాతం, సిపిఎంకు 0.12, సిపిఐకి 0.08, బీఎస్పీకి 0.26 శాతం ఓట్లు వచ్చాయి.

జనసేన లెక్కలు..

ఎన్నికల సంఘంతో సంబంధం లేకుండా జనసేన పార్టీ చెబుతున్న ఓట్ల లెక్కలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన గతం కంటే పుంజుకుంది. పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల్లో సర్పంచ్ లుగా గెలిచిన వారు 1,209 మంది, ఉపసర్పంచ్ లు 1,776, గెలిచిన వార్డు మెంబర్లు 4,456 గా ప్రకటించింది. సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుమీద జరగవు. ఎంపిటిసి అభ్యర్థులగా పోటీ చేసింది 2,000 మంది అయితే గెలిచింది కేవలం 180 మంది మాత్రమే. ఇక జెడ్పీటీసీ అభ్యర్థులు 156 మంది అయితే గెలిచింది ఇద్దరు మాత్రమే. కానీ వారు చెబుతున్న లెక్కల్లో ఓట్ షేర్ 27.7 శాతం అని చెప్పడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. సర్పంచ్ ఎన్నికల్లో తాము ద్వితీయ స్థానంలో నిలిచాం. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు శాతం 27 ఉంటే..ఉభయ గోదావరి జిల్లాల్లో 36 శాతం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 32 శాతం ఓట్ షేర్ ఉందని చెబుతోంది. ఈ లెక్కలకు ఎన్నికల సంఘం లెక్కలకు పొంతన కుదరడంలేదు..

1977 ఫార్ములా ఏంటి…

భారతదేశంలో 1975 నుంచి 1977 వరకు అత్యవసర పరిస్థితి విధించారు ప్రధాని ఇందిరాగాంధీ. ఫలితంగా ప్రజల నుంచి పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. కానీ ఆ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునే గట్టి విపక్షం అప్పుడు లేదు. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా విపక్ష పార్టీలు నాలుగు జనతా కూటమిగా జట్టు కట్టాయి. భారతీయ లోక్‌దళ్, భారతీయ జనసంఘ్‌, ప్రజా సోషలిస్ట్‌ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ( ఆర్గనైజేషన్) లు ఈ కూటమి భాగస్వాములు. ఇందిరాగాంధీ విధానాలను వ్యతిరేకించిన మొరార్జీ దేశాయ్, కే. కామరాజ్, నిజలింగప్ప, నీలం సంజీవరెడ్డి, అతుల్య ఘోష్, ఎస్. కే. పాటిల్, హితేంద్ర కే. దేశాయ్, అశోక్ మెహతా, త్రిభువన్ నారాయణ్ సింగ్ వంటి హేమా హేమీలు పార్టీ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ ఓ కూటమిగా ఏర్పడ్డారు. భారతీయ లోక్ దళ్ పార్టీతో చర్చలు జరిపారు. వారితో జన్ సంఘ్, ప్రజా సోషలిస్టు పార్టీలు జత కలిశాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలవద్దనేది వారి ఆలోచన. చివరికి కార్యరూపం దాల్చింది.

తొలి కాంగ్రెసేతర సర్కార్..

ఆ నాలుగు పార్టీలు కలిసి ఒకే కూటమిగా 1977 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశాయి. లోక్ దళ్ పార్టీ గుర్తు ఎద్దులను తోలుతున్న రైతు గుర్తునే వారు ఎంచుకున్నారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు ఈ ఫార్ములా బాగా పని చేసింది. మొత్తం 542 లోక్ సభ సీట్లకు గాను జనతా కూటమికి 295 సీట్లు, 41.32 శాతం ఓట్ షేర్ వచ్చింది. 30 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ కు కేవలం 154 సీట్లే వచ్చాయి. అది కూడా దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడులో వందకు పైగా సీట్లు రావడం విశేషం. లేకపోతే కాంగ్రెస్ కు మరింత పరువు పోయేది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 34.52 శాతం ఓట్లు రాగా…లెఫ్ట్‌ పార్టీలు 29 సీట్లల్లో గెలిచి 7.11 శాతం ఓట్లు, ప్రాంతీయ పార్టీలు 49 సీట్లల్లో గెలిచి 8.80 శాతం ఓట్లు, స్వతంత్రులు 15 సీట్లల్లో గెలవగా వారికి 8.25 శాతం ఓట్లు తెచ్చుకున్నాయి. ప్రధానిగా మొరార్జి దేశాయ్‌ ను జనతా కూటమి ఎన్నుకోవడం విశేషం.

కుర్చీ కోసం…

దేశంలో 30 ఏళ్ల పాటు నిరంతరాయంగా సాగిన కాంగ్రెస్ పాలనకు 1977 ఫార్ములా అంతం పలికింది. తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఇందిరాగాంధీ సైతం రాయ్ బరేలిలో పోటీ చేసి ఓటమి చెందడం అప్పట్లో సంచలనమైంది. రెండేళ్లకే ఆ కూటమిలో లుకలుకలు వచ్చి మధ్యలోనే ప్రభుత్వం పడిపోవడం మరో సంగతి. ఇప్పుడు పవన్ కల్యాణ్ అదే ఫార్ములాతో ఏపీలో ఎన్నికలకు వెళదామని చెబుతున్నారు. అప్పుడంటే ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ను ప్రధానిగా అభ్యర్థిగా ఆ కూటమి నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వ వ్యతిరేక కూటమి పెట్టి గెలిచినా ముఖ్యమంత్రి పదవి ఎవరికి ఇవ్వాలనేది పెద్ద సమస్య. ఏపీలో టీడీపీకి గట్టి ఓటు బ్యాంక్ ఉంది. సహజంగానే తెలుగుదేశం పార్టీ సిఎం సీటును వదులుకునేందుకు సిద్దంగా ఉండదు. తమకు ఎంపీ సీట్లు ఉంటే చాలు..సిఎం పదవి ఎవరికైనా సరే అనే ఆలోచన బీజేపీలో ఉండొచ్చు. ఇక కమ్యూనిస్టు పార్టీలు ఈ మధ్య కాలంలో తమ ఖాతానే తెరవడం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ పాతాళానికి పడిపోయింది. వారు పట్టుబట్టినా వచ్చే ప్రయోజం ఉండదని తెలుసు. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిస్తేనే ఈ ఫార్ములా గురించి చర్చించుకోవాలి. గతంలో ఆ మూడు పార్టీలు కలిసే పోటీ చేసి గెలిచాయి కాబట్టి మరోసారి జట్టు కట్టినా ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

బీజేపీ ఉన్న కూటమిలోకి కమ్యూనిస్టులు వెళ్లే అవకాశం లేదు. కాబట్టి వారు మరో కూటమి వైపు మొగ్గు చూపే వీలుంది. భావసారూప్యం ఉన్న పార్టీలు మా వద్దకు వస్తే అప్పుడు పొత్తు సంగతి ఆలోచిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పిన మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మంత్రి బొత్స పార్టీ పరంగా అన్నారా..వ్యక్తిగతంగా చెప్పారా? లేక వ్యగ్యంగా ప్రస్తావించారా? అన్నది తెలియదు. ఏపీలో వైసీపీతో కలిసిపోయేందుకు కమ్యూనిస్టులు సిద్దపడతారా అనేది చర్చనీయాంశమే. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. కాబట్టి అవి కూటమిగా ఏర్పడతాయా..లేక విడి విడిగా పోటీ చేస్తాయా అనేది వేచి చూడాలి.

-కొండవీటి శివనాగరాజు, సీనియర్ జర్నలిస్టు, రీసెర్చ్ డెస్క్, టీవీ9 తెలుగు

Also Read..

Andhra Pradesh: ఏపీలో రక్తికడుతున్న సారా రాజకీయం.. ఆ విషయంలో సక్సస్ సాధించిన విపక్షాలు..

Bhagwant Mann Swearing: భగవంత్‌ సింగ్‌ మాన్‌ అనే నేను.. భగత్‌ సింగ్‌ స్వగ్రామంలో పంజాబ్‌ సీఎంగా ప్రమాణం..

Latest Articles