AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: ఏపీ ఎన్నికల్లో వైసీపీ గట్టి షాక్.. పెద్దిరెడ్డి మినహా మంత్రులందరూ ఘోర ఓటమి..

ఇది ఒక్క సునామీ మాత్రమే కాదు. తుఫాన్‌, సునామీ ఒకేసారి విరుచుకుపడితే ఎలా ఉంటుందో...ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో కనిపించింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించింది. కూటమి తుఫాన్‌తో వైసీపీ కకావికలమైపోయింది. కూటమి కొట్టిన దెబ్బకు ఫ్యాన్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతయిపోయింది.

YSRCP: ఏపీ ఎన్నికల్లో వైసీపీ గట్టి షాక్.. పెద్దిరెడ్డి మినహా మంత్రులందరూ ఘోర ఓటమి..
Ys Jagan
Ravi Kiran
|

Updated on: Jun 04, 2024 | 6:41 PM

Share

ఇది ఒక్క సునామీ మాత్రమే కాదు. తుఫాన్‌, సునామీ ఒకేసారి విరుచుకుపడితే ఎలా ఉంటుందో…ఏపీ ఎన్నికల కౌంటింగ్‌లో కనిపించింది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టించింది. కూటమి తుఫాన్‌తో వైసీపీ కకావికలమైపోయింది. కూటమి కొట్టిన దెబ్బకు ఫ్యాన్‌ పార్టీ అడ్రస్‌ గల్లంతయిపోయింది. గత ఎన్నికల్లో 151 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏపీ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేసింది కూటమి.

ఏపీలో ఎనిమిది జిల్లాల్లో వైసీపీ అసలు ఖాతా తెరవలేకపోయింది. ఆ జిల్లాల్లో ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలవలేకపోయింది. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ఫ్యాన్‌ పార్టీ అడ్రస్‌ కనిపించలేదు. ఆ ఎనిమిది జిల్లాల్లో కూటమి స్వీప్‌ చేసింది. కూటమి ప్రభంజనం ముందు వైసీపీ నిలవలేకపోయింది.

కూటమి ప్రభంజనంతో వైసీపీ కంచుకోటలు కుప్పకూలిపోయాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కూడా వైసీపీ ఘోర పరాజయం పాలైంది. జగన్‌ సొంత జిల్లా కడపలో పది అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ కేవలం మూడు సీట్లలోనే తన ఉనికి చాటుకుంది. ఇది ఆ పార్టీకి పెద్ద షాక్‌ అనే చెప్పాలి. తనకు కంచుకోట లాంటి రాయలసీమలో కూడా ఫ్యాన్‌ పార్టీ కుప్పకూలిపోయిందంటే…కూటమి ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక వైసీపీకి చెందిన బడా బడా నేతలు, హేమాహేమీల్లాంటి మంత్రులు మట్టి కరిచారు. జగన్‌ కేబినెట్‌లో ఆయన, పెద్దిరెడ్డి తప్పితే మిగిలిన మంత్రులంతా ఓటమి పాలయ్యారు. ధర్మాన, సీదిరి, బొత్స, రాజన్నదొర, అమర్‌నాథ్, బూడి, విశ్వరూప్, వేణు, దాడిశెట్టి, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్, మేరుగు నాగార్జున, విడదల రజనీ, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, కాకాని, బుగ్గన, నారాయణస్వామి, ఉషశ్రీ, రోజా, అంజాద్ భాష ఓడిపోయారు. గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరి గుంతకల్లు నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. అటు ఉత్తరాంధ్రలో బొత్స, ధర్మాన లాంటి అగ్ర నేతల నుంచి గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని లాంటి వాళ్లంతా మట్టి కరిచారు. ఇక ప్రకాశం, నెల్లూరు, రాయలసీమల్లోని వైసీపీ సీనియర్‌ నేతలు, మంత్రులుగా పనిచేసినవాళ్లు కూటమి గాలిలో కొట్టుకుపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..