AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరువు కోరల్లో వేరుశనగ.. కష్టపడి సాగుచేసిన పంటను చేతులారా చిదిమేస్తున్న రైతన్నలు!

తెలుగురాష్ట్రాల్లో వేరుశనగ పేరు చెబితే గుర్తొచ్చే ప్రాంతం అనంతపురం.. అప్పట్లో ఇక్కడి నుంచే దేశ వ్యాప్తంగా అత్యధికంగా వేరుశనగ ఉత్పత్తి అయ్యేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. ఎల్‌నీనో ఎఫెక్ట్‌.. పచ్చని పంట పొలాలు కాస్త కరువు చాయలతో కమ్ముకున్నాయి. విత్తనాలు వేసినా సరిగ్గా మొలకలు రాకపోవడంతో కష్టపడి చేసిన సాగును చేతురాల దున్నేస్తున్నారు రైతులు.

కరువు కోరల్లో వేరుశనగ.. కష్టపడి సాగుచేసిన పంటను చేతులారా చిదిమేస్తున్న రైతన్నలు!
Anantapur's Groundnut Glory Fades
Nalluri Naresh
| Edited By: |

Updated on: Sep 24, 2026 | 2:47 PM

Share

అనంతపురం: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనే కాకుండా దేశంలోనే వేరుశనగ సాగుకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అనంతపురం జిల్లాలో ఇప్పుడు కరువు ఛాయలు అలుముకున్నాయి. ఒకప్పుడు పచ్చని వేరుశనగ చేలతో కళకళలాడిన నేల.. నేడు కరువు కోరల్లో చిక్కుకుని నెర్రెలు బారుతోంది. ప్రకృతి కన్నెర్ర చేయడం, వ్యవస్థాగత లోపాలు తోడవడంతో అనంత వేరుశనగ రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

పాతాళానికి సాగు విస్తీర్ణం..

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా సాధారణంగా 15 లక్షల నుంచి 18 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు జరిగేది. కానీ ప్రస్తుత ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయి, ప్రస్తుతం కేవలం 1.5 లక్షల నుంచి 2 లక్షల ఎకరాల లోపు మాత్రమే పరిమితమైంది.

పొలాల్లోనే ఎండుతున్న పంట..

ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో రావలసిన వర్షాలు కురవకపోవడం, మరోవైపు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడంతో విత్తిన వేరుశనగ పంట మొత్తం ఎండిపోయింది. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. పంటపై ఆశలు వదులుకున్న అన్నదాతలు.. చేసేవేమి లేక పొలాల్లో ఎండిపోయిన చేలను ట్రాక్టర్లు పెట్టి తొలగిస్తున్నారు.

మూతపడిన ఆయిల్ ఫెడ్..

దళారుల బారిన పడకుండా రైతులకు మద్దతు ధర కల్పించి, నేరుగా వేరుశనగ పంటను కొనుగోలు చేసేందుకు ఏర్పాటైన ఏపీ ఆయిల్ ఫెడ్ సంస్థ ఉద్దేశం నీరుగారిపోయింది. వాస్తవానికి శుద్ధి చేసిన నాణ్యమైన వేరుశనగ విత్తనాలను తక్కువ ధరకే రైతులకు అందించడం, విత్తనోత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడం ఈ సంస్థ బాధ్యత. అంతేకాకుండా వేరుశనగ నుంచి నూనె తీసి ‘విజయా నూనె’ వంటి బ్రాండ్లతో వినియోగదారులకు నాణ్యమైన నూనెను సరసమైన ధరకు అందించాల్సి ఉంది.

కానీ, అనంతపురంలోని ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పూర్తిస్థాయిలో మూతపడటంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సంస్థ మూతపడటంతో పంటను ప్రభుత్వపరంగా కొనుగోలు చేసే నాథుడే లేకుండా పోయాడు. దీనికితోడు రైతులు విత్తన ఉత్పాదకతను కోల్పోయారు. ఫలితంగా పెట్టుబడి కోసం, పంట అమ్మకం కోసం ప్రైవేటు దళారులు, వ్యాపారులను ఆశ్రయించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us