Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జులై 25న విద్యాసంస్థలు బంద్.. కారణం ఇదే
వైసీపీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందంటూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వైసీపీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందంటూ తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 25న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు మాత్రమే వసూలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు సంక్షేమ హాస్టల్స్ అన్ని పాతబడి పోయి పెచ్చులు ఊడి పడుతున్నాయని, వాటిని ఆధునికరించి మెరుగైన వసతి సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. అమ్మ ఒడి పథకం ప్రస్తుతం ఇంటికి ఒక్క పిల్లవాడికే ఇస్తున్నారని.. కుటుంబంలోని అందరూ విద్యార్థులకు వర్తింపజేయాలంటున్నారు. అలాగే హాస్టల్ విద్యార్థులకు ఇస్తున్న కాస్మోటిక్ చార్జీలు సరిపోవడం లేదనీ.. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ,పీహెచ్డీ విద్యార్థుల స్కాలర్ షిప్, మెస్ ఫీజులను పెరిగిన ధరలకు అనుగుణంగా మాత్రమే పెంచాలని.. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అద్దె భవనాల్లో నడుపుతున్న సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు లేక, ఉన్నవారికి అద్దెలు చెల్లించక అనేక ఇబ్బందులు ఉన్నాయని టీఎన్‌ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా హోటల్ మేనేజ్మెంట్ కోర్సులను, కాలేజీలను నడుపుతూ విద్యార్థుల నుండి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలనీ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలనీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేద విద్యార్థులు చదువుకునే ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వ సాయాన్ని కొనసాగించాలనీ, జీవో నెంబర్ 77ను రద్దు చేసి చదువుకునే ప్రతి విద్యార్థికి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యాన్ని కల్పించడంతో పాటు మెగా డీఎస్సీని, జూనియర్ లెక్చరర్స్ డిగ్రీ లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలను తక్షణమే చేపట్టాలనీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జులై 25న రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు.