Andhra News: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్.. ఏపీలోనూ బెనిఫిట్ షోలపై నీలినీడలు

బెనిఫిట్ షోలతో, టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సర్కార్‌ తరహాలోనే ఏపీలోనూ వీటికి ఫుల్ స్టాప్ పెట్టాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిర్మాతలు, హీరోల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదంటున్నారు.

Andhra News: ఓర్నీ.. ఇదేం ట్విస్ట్.. ఏపీలోనూ బెనిఫిట్ షోలపై నీలినీడలు
Balakrishna - Ram Charan
Follow us
Ram Naramaneni

|

Updated on: Jan 05, 2025 | 9:05 PM

బెనిఫిట్ షోలపై మరోసారి చర్చ మొదలైంది. సంధ్య థియేటర్‌ ఘటన కారణంగా తెలంగాణలో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో మరో ఆలోచన లేదని తేల్చిచెప్పారు. ఆ తరువాత సినీ ప్రముఖలతో జరిగిన భేటీలోనూ ఈ అంశంపై ఎలాంటి చర్చ జరగలేదనే టాక్ వినిపిస్తోంది.

ఏపీలో బెనిఫిట్ షోలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

బెనిఫిట్ షోలపై తెలంగాణ సర్కార్ నిర్ణయం ఇలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు కూడా ఓకే చెప్పింది.

డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు- పవన్

టికెట్ ధరలపై పెంపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గేమ్‌ ఛేంజర్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన పవన్.. డిమాండ్, సప్లై ఆధారంగానే టికెట్ ధరల పెంపు ఉంటుందన్నారు. టికెట్ ధరలను ప్రభుత్వం ఊరికే పెంచడం లేదని, ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో ఆదాయం వస్తోందని తెలిపారు.

బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు సరికాదన్న సీపీఐ

అయితే బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపును సీపీఐ నేత రామకృష్ణ తప్పుబట్టారు. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోల‌కు అనుమతి ఇవ్వబోమని ప్రకటిస్తే.. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. పంట‌ల గిట్టుబాటు ధరల గురించి పట్టించుకోని పవన్ కల్యాణ్.. నిర్మాత‌లు, సినీ హీరోల‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని తీవ్రంగా విమర్శించారు.

మొత్తానికి బెనిఫిట్ షోల వ్యవహారం ఏపీలో కొత్త చర్చకు దారి తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తరహాలోనే ఏపీ కూడా వ్యవహరించాలని కొందరు డిమాండ్ చేస్తుంటే.. పవన్ కల్యాణ్ మాటలతో దీనిపై ఏపీ ప్రభుత్వం దాదాపుగా ఓ క్లారిటీ ఇచ్చినట్టే అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి