CPI Narayana: కేటీఆర్ వ్యాఖ్యల్లో తప్పేముంది.. రోడ్ల దుస్థితి చూడండి.. వీడియోతో వివరించిన నారాయణ
ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి, అప్రకటిత విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు.
CPI Narayana on KTR: ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి, అప్రకటిత విద్యుత్ కోతలపై తెలంగాణ మంత్రి కేటీ రామారావు చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు తప్పుబడుతున్న నేపథ్యంలో తాను ఏకీభవిస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆంధ్ర- తమిళనాడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించి.. ఏపీ రోడ్ల దుస్థితి, తమిళనాడు రోడ్ల గురించి వీడియోల్లో ఆధారాలతో సహా వివరించారు. ఏపీలో రోడ్లు గుంతలమయంగా మారిపోయాయని.. ఇది పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని నారాయణ ధ్వజమెత్తారు. పక్క రాష్ట్ర రహదారులు చక్కగా ఉన్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు గతుకులు గుంతల మయంగా మారాన్నారు నారాయణ. తన సొంత గ్రామం నగిరి మండలం అయినబాకం పరిస్థితి ఇందుకు ఉదాహరణగా చూపించారు. రెండు రాష్ట్రాల మధ్య పోలికలు చూస్తుంటే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలున్న మాట వాస్తవమేనన్న నారాయణ.. కేటీఆర్ వ్యాఖ్యలను ఏపీ మంత్రులు తప్పు పడుతుండడంపై నారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దులోని రోడ్లు చుస్తే అర్థమవుతుందన్నారు నారాయణ.
ఇదిలావుంటే, పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వేడి పుట్టించిన విషయం తెలిసిందే. ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై పోటాపోటీగా విమర్శలు గుప్పించుకున్నారు. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యల వెనుక దురుద్దేశం లేదని, జగన్ పాలనలో ఏపీ మరింత అభివృద్ధి సాధించాలని కేటీఆర్ అర్ధరాత్రి సమయంలో ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.