AP News: వారితో జాగ్రత్త.. కొంచెం ఏమరపాటుగా ఉన్నా.. కొంప మునిగినట్లే!
ఈరోజుల్లో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. సైబర్ క్రైమ్ నేరగాళ్లు రోజురోజుకు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రోజుకో కొత్త వేషంలో వచ్చి డబ్బులు దండుకుంటున్నారు.
సైబర్ క్రైమ్ నేరగాళ్లు రోజురోజుకు యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త రకం ఎత్తులు వేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు . సైబర్ నేరాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య రోజు పెరుగుతూనే ఉంది. బహుమతులు ఓవైపు, మరోవైపు ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశలను రేకెత్తిస్తున్నారు. మరోవైపు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాల డీపీలు ఉపయోగించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు వారు రూట్ మార్చారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్‌ల పేరుతో అమాయక ప్రజలను బెదిరిస్తూ సైబర్ కేటుగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. నకిలీ పోలీస్ స్టేషన్లు .. ఫేక్ కోర్టులతోనూ హడల్ ఎంతిస్తున్నారు. కస్టమ్స్‌లో మీ పార్శిళ్లు పట్టుబడిందని .. లేదా అయినవాళ్లు క్రైమ్‌లో ఇరుక్కున్నారని బెదిరిస్తున్నారు. అంతేకాదు మాదకద్రవ్యాలు, ఉగ్రవాద కేసుల్లో విచారిస్తున్నామో ఇలా రోజుకో వేషం, పూటకో మోసంతో నిలువునా ముంచేస్తున్నారు. బాధితులను ఉన్నచోట నుంచి కదలనివ్వరు, ఊపిరి ఆడనివ్వరు. భయపెట్టడం, బెదిరించడమే వారి పెట్టుబడి. పొరపాటున వారికి చిక్కితే ఖాతాలు ఖాళీ చేసి మాయమవుతారు.
డిజిటల్ అరెస్ట్ అనే ప్రక్రియే అసలు లేదని ప్రభుత్వాలు చెబుతున్నా.. చాలా మంది మోసపోతున్నారు. కొందరు మాత్రం తెలివిగా ఆలోచించి బయటపడుతున్నారు. ఇప్పుడు తాజాగా విజయవాడకు చెందిన ముగ్గురు వేర్వేరు వ్యక్తులకు డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపు ఫోన్‌లు వచ్చాయి. కానీ వారు చాకచక్యంగా వ్యవహరించి బయటపడ్డారు. అది ఎలానో చుడండి.. సైబర్ క్రైమ్ కేటుగాడు విజయవాడకు చెందిన ఓ మహిళకు ఫోన్ చేశాడు. నేను సీబీఐ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడు. ముంబయి మనీ లాండరింగ్ ముఠాతో మీ అమ్మాయికి సంబంధాలున్నాయని చెప్పాడు. ఆమె పేరు, ఆధార్ నంబర్‌తో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా లెటర్ హెడ్‌పై కొన్ని సెక్షన్‌లు ఉటంకిస్తూ అరెస్ట్ వారెంట్ చూపించాడు. దీని ప్రకారం 3 నుంచి 7 సంవత్సరాల జైలుశిక్ష, లేక రూ.5 లక్షల జరిమానా లేదా రెండూ విధిస్తామంటూ భయపెట్టాడు. దీంతో ఆ బాధితురాలికి ముచ్చెమటలు పట్టాయి.
అలానే ఓ ఎలక్ట్రికల్ ఏఈకి ఫోన్ చేశారు కేటుగాళ్లు.. మీ అబ్బాయి సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్నాడని బెదిరించాడు. ఆయన లొంగలేదు .. దీంతో కనీసం రూ.5000లు అయినా పంపండంటూ సైబర్ నేరగాళ్లు బతిమాలుకున్నారు. ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫోన్ చేసి మీ కుమారుడు డ్రగ్స్ కేసులో నిందితుడని భయాందోళనలకు గురిచేశారు. కానీ బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మోసానికి గురికాకుండా బయటపడ్డారు. డిజిటల్ అరెస్ట్ అంటూ వస్తున్న పుకార్లకు భయపడవద్దని పోలీసులు చెప్తున్నారు. పోలీసులమంటూ వీడియో కాల్, లేదా ఫోన్‌కాల్ చేస్తే ఎవరూ భయపడవద్దని పోలీసులు సూచిస్తున్నారు. కాల్ కట్ చేసి, వెంటనే ఫోన్ స్విచాఫ్ చేయాలని చెబుతున్నారు. ఆ తర్వాత సమీపంలోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సమాచారం అందించాలని పోలీసులు పేర్కొంటున్నారు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి