AP Metro Rail: సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్‌.. ఏపీలో మెట్రో పరుగులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కేలా..

ఏపీ వాసులకు గుడ్‌ న్యూస్. ఆంధ్రప్రదేశ్‌లో మెట్రో పరుగులకు గ్రీన్‌ సిగ్నల్ వచ్చేసింది. అప్పటి రామకృష్ణారెడ్డే... మళ్లీ మెట్రో కార్పొరేషన్‌ ఎండీగా నియమితులయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రోకు సంకల్పించారు. మరీసారి ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుంది...? పాత ప్లాన్‌నే అమలు చేయనున్నారా...? ఏమైనా మార్పులు చేర్పులు ఉండనున్నాయా...? ఏపీలో మెట్రో నిర్మాణంపై కేంద్రం రియాక్షన్‌ ఏంటి...? వారందించే సాయం ఎలా ఉండబోతోంది...? అనే వివరాలు చూద్దాం..

AP Metro Rail: సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్‌.. ఏపీలో మెట్రో పరుగులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే ప్రాజెక్టు పట్టాలెక్కేలా..
Ap Metro Rail Corporation
Follow us

|

Updated on: Aug 03, 2024 | 12:42 PM

పాలనలో తనదైన మార్క్‌ చూపిస్తూ దూసుకుపోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అధికారంలోకి వచ్చిరావడంతోనే అభివృద్ధిపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టారు. రాష్ట్రాభివృద్ధికి కొత్త ఆలోచనలు చేస్తూనే… ఆగిపోయినా పాత ప్రాజెక్టులను బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. 2014-19 హయాంలో తమ పాలనలో ప్రారంభించి… ఆ తర్వాత నిలిచిపోయిన పనులు, ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే ఏపీలో ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ వెలుగులోకి తెచ్చారు. అంతేకాదు మెట్రో కార్పొరేషన్‌ ఎండీగా అప్పటి రామకృష్ణారెడ్డినే మళ్లీ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

2014లో టీడీపీ ప్రభుత్వం వైజాగ్, విజయవాడలో మెట్రో రైలు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమించింది. అయితే రామకృష్ణారెడ్డి నేతృత్వంలోనే 2014లో విశాఖపట్నం, విజయవాడలో మెట్రో రైలుకు డీపీఆర్ సిద్ధం చేశారు. విశాఖలో మూడు లైన్లు 34.38 కిలోమీటర్లు, విజయవాడలో 2 లైన్లు 26 కిలోమీటర్ల మేర ప్రాజెక్టును నిర్మించాలని సంకల్పించారు. ఎంత వ్యయం అవుతుందో అంచనాతో కూడిన డీపీఆర్‌ను కేంద్రానికి పంపారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆర్ధిక సమస్యల కారణంగా మెట్రో ప్రాజెక్టును నిరాకరించింది. మెట్రో ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వానికి సలహాదారుగా అప్పట్లో పనిచేసిన శ్రీధరన్ ఏపీకి మెట్రోను తీవ్రంగా వ్యతిరేకించారు. రాజధాని నగరం అమరావతి అవసరాలను మెట్రో తీర్చలేదని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు… కొరియా, మలేషియా కంపెనీల ఆర్థిక సహాయంతో ప్రాజెక్టును పట్టాలెక్కించాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టును ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపట్టాలని డిసైడ్‌ అయ్యింది. టెండర్లు కూడా పిలిచారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో సీన్‌ మొత్తం రివర్స్‌ అయ్యింది.

ఇక 2019 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి ఏపీలో అధికారంలోకి వచ్చింది వైసీపీ. మెట్రోకి జగన్‌ ప్రభుత్వం ఓకే చెప్పినా… పాత టెండర్లన్నీ రద్దయ్యాయి. అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ పేరును ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్‌గా మార్చారు. అలాగే రామకృష్ణారెడ్డిని కూడా మారిటైమ్ బోర్డుకు సీఈవోగా నియమించారు. అయితే ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో పదవికి రామకృష్ణారెడ్డి ఆ తర్వాత రాజీనామా చేశారు. ఇక మొన్నటి ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆగిపోయిన మెట్రో ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన రామకృష్ణారెడ్డినే… ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీగా మళ్లీ నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.

ఇక విజయవాడలో 26 కిలోమీటర్ల మేర… రెండు మెట్రో కారిడార్లను నిర్మించాలని నిర్ణయించింది ప్రభుత్వం. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి నిడమానూరు వరకు, అదే నెహ్రూ బస్ స్టేషన్ నుండి పెనమలూరు వరకు నిర్మించనున్న ఈ కారిడార్లలో 25 స్టేషన్లు ఉంటాయని తెలిపింది. ఇక విశాఖ విషయానికొస్తే 34.38 కిలోమీటర్ల మేర మూడు లైన్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మూడు కారిడార్లలో మొత్తం 35 స్టేషన్లు ఉంటాయని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం.

ఇక ఇటీవలే విశాఖలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. మెట్రో రైలు ప్రాజెక్టులో కొన్ని కీలక సూచనలు చేశారు. ఇక సీఎం సూచనల ఆధారంగా గత డిజైన్లలో అధికారులు కొన్ని మార్పులు చేయనున్నారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నిర్మించే ఫ్లై ఓవర్లకు అనుసంధానంగా మెట్రో డిజైన్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు కేంద్రంతో ఏపీ ప్రభుత్వం మంచి సంబంధాలు కలిగి ఉండటం, తాజా బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో… మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం కూడా సహకారం అందించనున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా… విశాఖ, విజయవాడ నగరాల్లో మెట్రోను పరుగులు పెట్టించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న ఏపీ ప్రభుత్వం… త్వరలోనే ప్రాజెక్టు తిరిగి పట్టాలెక్కనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..