Vizianagaram: ‘దాచిన 50 వేలతో అంత్యక్రియలు ఘనంగా చేయండి..’ అతని ఆఖరి కోరిక ఇదే

కస్టమర్లతో మాటామంతీ కలిపి వారితో సరదాగా గడిపేవాడు. తక్కువ సమయంలోనే అందరితో తలలో నాలుకలా మెలిగాడు. అలా తనకు పెరిగిన పరిచయాలతో అధిక వడ్డీలతో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పులు చేయడం ప్రారంభించాడు. అలా మొదలైన అప్పులు పెరిగి... పెరిగి....

Vizianagaram: 'దాచిన 50 వేలతో అంత్యక్రియలు ఘనంగా చేయండి..' అతని ఆఖరి కోరిక ఇదే
Ravi Kumar
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Aug 03, 2024 | 12:26 PM

నాలుగేళ్ల క్రితం రవికుమార్ అనే యువకుడు ఒంటరిగా వ్యాపార నిమిత్తం విజయనగరం జిల్లా చీపురుపల్లికి వలస వచ్చాడు. అలా వచ్చిన రవికుమార్ స్థానికంగా ఎన్ ఆర్ కె వింగ్స్ అనే హోటల్ ప్రారంభించాడు. ఆ తరువాత తక్కువ సమయంలో హోటల్‌కు మంచి పేరే వచ్చింది. స్థానికంగా కస్టమర్లు కూడా బాగానే వస్తూ పోతూ ఉండేవారు. అలా వచ్చిన కస్టమర్లతో మాటామంతీ కలిపి వారితో సరదాగా గడిపేవాడు. తక్కువ సమయంలోనే అందరితో తలలో నాలుకలా మెలిగాడు. అలా తనకు పెరిగిన పరిచయాలతో అధిక వడ్డీలతో ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద అప్పులు చేయడం ప్రారంభించాడు. అలా మొదలైన అప్పులు పెరిగి పెరిగి సుమారు కోటి రూపాయలు దాటాయి. ఈ క్రమంలోనే నెమ్మదిగా అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరిగింది. ఇక చేసేది లేక కొత్తగవిడి వీధిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లో నైలాన్ తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు రవికుమార్. అయితే ప్రతిరోజు ఇంట్లో నుండి బయటకు వచ్చి హోటల్‌కి వెళ్లే రవికుమార్ ఎంతకీ ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. వెంటనే అందరూ కలిసి ఇంటికి వెళ్లి చూడటానికి ప్రయత్నించారు. అయితే ఇంటి లోపల గడియ పెట్టి ఉండటంతో ఎలా లోపలికి వెళ్ళాలో తెలియలేదు. చేసేదిలేక పోలీసులు సహాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి ఫ్యాన్‌కి నైలాన్ తాడుతో ఉరేసుకొని కనిపించాడు. దీంతో వెంటనే రవికుమార్ ఎలా మృతిచెందాడు? మృతికి గల కారణాలు ఏమైనా దొరుకుతాయా? అని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. అలా వెదుకుతుండగా అక్కడ వారికి ఒక సూసైడ్ నోట్ కనిపించింది.

ఆ సూసైడ్ నోట్లో తాను స్థానికంగా చాలా అప్పులు చేశానని, అప్పులు తీర్చే పరిస్థితిలో తానులేనని, చేసేది లేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు. అంతే కాకుండా తన అంత్యక్రియలు కోసం ఇంట్లో 50 వేలు దాచానని, ఆ డబ్బుతో తన అంత్యక్రియలు ఘనంగా జరపాలని ఆఖరి కోరికగా కోరాడు. తన అంత్యక్రియలను మాజీ వార్డ్ మెంబర్ నాగరాజు చేతుల మీదగా జరిపించాలని రాశాడు. ఆ తరువాత ఇంకా ఏమైనా ఆధారాలు దొరుకుతాయోమోనని రవికుమార్ మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా అందులో ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఉంది. సూసైడ్ నోట్ లో ఉన్న అదే విషయాన్ని వీడియో ద్వారా తెలియజేశాడు. అయితే రవికుమార్ ఆత్మహత్య విషయం కుటుంబసభ్యులకు తెలియజేయాలంటే మాత్రం కష్టంగా మారింది. అసలు రవికుమార్ ఎవరు? ఎక్కడ నుండి వచ్చాడు? పెళ్లైందా? భార్యాపిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారా? అనే విషయం ఎవరికి తెలియదు. దీంతో పోలీసులు రవికుమార్ కుటుంబం కోసం ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.