CM Chandrababu: శాంతిభద్రతలను సెట్‌రైట్ చేస్తాం.. లా అండ్ ఆర్డర్‌పై ఏపీ అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల
ఏపీలో వైట్ పేపర్స్ పరంపర కొనసాగుతోంది. శాంతిభద్రతల అంశంపై... అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. భవిష్యత్ కార్యాచరణపై స్పష్టతనిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో అయినా… విభజిత ఏపీలో అయినా.. లా అండ్ ఆర్డర్‌ను సెట్‌రైట్ చేసింది టీడీపీ ప్రభుత్వమే అంటూ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీలో లా అండర్ ఆర్డర్‌పై.. అసెంబ్లీ వేదికగా శ్వేత పత్రం విడుదల చేసిన ఆయన… గత ఐదేళ్లలో దుర్మార్గపు పాలన కొనసాగిందన్నారు. గతంలో ఇదే పోలీసులతో లా అండ్ ఆర్డర్‌ను సరిదిద్దామన్న సీఎం… ఆ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు. 2019, 2024 మధ్య జరిగిన హింసాత్మక ఘటనలను… పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు చంద్రబాబు. టెక్నాలజీని వాడుకుని తాము నేరాలను నియంత్రిస్తే.. వైసీపీవాళ్లు, అందుకు విరుద్ధంగా వ్యవహరించారన్నారు. తనపైనే 17కేసులు పెట్టారనీ, పవన్ కల్యాణ్‌పై ఏడు కేసులు నమోదు చేశారనీ తెలిపారు. సభలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలందరూ.. గత ప్రభుత్వపు దుష్చర్యలకు బాధితులేనన్నారు. గత ఐదేళ్లలో జరిగిన శాంతిభద్రతల విఘాతంపై.. ఎంక్వైరీ చేయించే ఆలోచనతో ఉన్నామన్నారు చంద్రబాబు. అది ఏ ప్రాతిపదికన ఉంటుందనేది త్వరలో స్పష్టం చేస్తామన్నారు.
శ్వేతపత్రంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇది ఒక్కరోజులో తేలే అంశం కాదన్నారు. అందుకోసం సెషన్‌లో ఒకరోజంతా దీనిమీదే చర్చ జరపాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించిన చంద్రబాబు.. ఆ దిశగా ప్రయత్నం చేస్తామన్నారు. సభ్యులందరి అభిప్రాయాలూ తీసుకుంటామని చెప్పారు. గతంలో సంఘటనలు మనసులో పెట్టుకుని.. ఎన్డీఏ నాయకులెవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దనీ, ప్రభుత్వానికి చెడ్డపేరు తేవొద్దనీ హెచ్చరించారు చంద్రబాబు.
రాష్ట్రవ్యాప్తంగా కీలక నేతలపై నమోదైన కేసుల సంఖ్యను సభకు వివరించిన చంద్రబాబు.. పార్టీల వారీగా, ఏయే నాయకులపై ఎన్నెన్ని కేసులు నమోదయ్యాయనే విషయాన్ని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో తెలియజేశారు. నాయకులే కాదు, సామాన్యులు కూడా వైసీపీ పాలనలో బాధితులుగా మారారన్న చంద్రబాబు.. వాళ్లందరికీ ఇప్పుడు న్యాయం చేస్తున్నామని చెప్పారు.
శాంతి భద్రతల విషయం చాలా కీలకమైందన్న చంద్రబాబు.. ఈ వైట్‌పేపర్‌పై ప్రజలందరూ చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్ తర్వాత… సభను శుక్రవారానికి వాయిదా వేశారు స్పీకర్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..