Andhra Pradesh: సీఎం జగన్ అలా మాట్లాడటం సంతోషంగా ఉంది.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు..
విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను కేంద్రప్రభుత్వం ఆదుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. విజయవాడలో సిటీ సివిల్ కోర్టు నూతన భవన సముదాయాన్ని..
Andhra Pradesh: విభజనతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ను కేంద్రప్రభుత్వం ఆదుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. విజయవాడలో సిటీ సివిల్ కోర్టు నూతన భవన సముదాయాన్ని హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డితో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈసందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల క్రితం తాను శంకుస్థాపన చేసిన భవన సముదాయానికి తానే ప్రారంభించానన్న ఆయన.. నిధుల కొరతతోనే భవనాల నిర్మాణం ఆలస్యమైందన్నారు.సీఎం మాతృభాష తెలుగులో ప్రసంగించడం సంతోషకర విషయమన్నారు.
రాష్ట్ర విభజన, ఆర్థిక సమస్యలు, నిధుల కొరతతో ఎన్నో ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని కేంద్రప్రభుత్వం నిధులిచ్చి ఆదుకోవాలన్నారు. ప్రజలందరికీ సత్వర న్యాయం చేకూర్చే బాధ్యత న్యాయవాదులపై ఉందని తెలిపారు. కోర్టు భవనాల నిర్మాణానికి కేంద్రప్రభుత్వం నుంచి నిధులు రావాలని ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. న్యాయస్థానాల్లో పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఉందని.. న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమన్నారు. ఈనెల 27వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నానని.. నా ఉన్నతికి, విజయవానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఎన్వీ రమణ ధన్యవాదాలు తెలిపారు. ఈ సభలోనే ఆసక్తికర సన్నివేశం కనిపించింది. కోర్టు భవనాల నిర్మాణానికి సహకరించిన సీఎం జగన్‌ను సన్మానించడానికి న్యాయవాదులు ప్రయత్నించారు. అయితే ముఖ్యమంత్రి సున్నితంగా దీనిని తిరస్కరించారు. సన్మానం కోసం వేసిన కుర్చీని కూడా వద్దని వారించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..