Mangalagiri: ప్రభుత్వ స్థలంలో క్రైస్తవ బాప్టిజం ఘాట్‌ .. అడ్డుకున్న బీజేపీ నేతలు.. కమీషనర్‌కు ఫిర్యాదు

మంగళగిరిలో బాప్టిజం ఘాట్ నిర్మాణం వివాదానికి దారి తీసింది. నిర్మాణ పనులు చేస్తుండగా స్థానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ స్థలంలో బాప్టిజం ఘాట్‌ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. దీనిపై ఇరువర్గాలు వాగ్వాదానికి దిగాయి.

Mangalagiri: ప్రభుత్వ స్థలంలో క్రైస్తవ బాప్టిజం ఘాట్‌ .. అడ్డుకున్న బీజేపీ నేతలు.. కమీషనర్‌కు ఫిర్యాదు
Church Vivadham
Follow us
Surya Kala

|

Updated on: Jul 02, 2023 | 8:09 AM

ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో బాప్టిజం ఘాట్‌ నిర్మాణం ఉద్రిక్తతలకు దారి తీసింది. ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలంలో ఎలా నిర్మిస్తారంటూ స్థానిక బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఘాట్‌ నిర్మాణంతో ఇక్కడ మతమార్పిడులు పెరుగుతాయని ఆరోపించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు, క్రైస్తవ మత పెద్దలకు వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ వివాదం కాస్తా పెద్దదిగా మారడంతో ఉద్రిక్తత నెలకొంది. దాంతో బీజేపీ నేతలు బాప్టిజం ఘాట్‌ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ ఎంటీఎంసీ కమీషనర్‌కి ఫిర్యాదు చేశారు. అంతేకాదు స్థానికంగా మత మార్పిడులను మరింతగా పెరిగేలా చేయడం కోసమే ఇక్కడ ఘాట్ నిర్మిస్తున్నారంటూ మండిపడ్డారు. వెంటనే నిర్మాణాలను ఆపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

మంగళగిరిలో క్రైస్తవులు బాప్టిజం ఘాట్‌ నిర్మాణం కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా స్థానిక ఎమ్మెల్యే ఆర్కే అనుమతితోనే తాము ఇటీవల ఘాట్‌ నిర్మాణ పనులు చేపట్టామని మంగళగిరి క్రైస్తవ ఫెలోషిప్‌ అసోసియేషన్‌ సభ్యులు తెలిపారు. భూమి చదును చేసి పిల్లర్స్ వేసి నిర్మిస్తుండగా స్థానిక బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్ని మతాలను సమానంగా ఆదరిస్తున్న ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరిలో పెద్ద కోనేరు నిర్మిస్తున్నారని తెలిపారు. క్రైస్తవులకు కూడా బాప్టిజం ఘాట్‌ నిర్మాణానికి అనుమతించారని ఫెలోషిప్‌ అసోసియేషన్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గతంలోనూ ఈ ప్రాంతంలో బాప్టిజం ఘాట్‌ నిర్మించేందుకు క్రైస్తవులు ప్రయత్నించారు. ఆ సమయంలోనూ బీజేపీ నేతలు ఘాట్‌ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. మొత్తానికి ఈ వివాదం ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..