AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrababu: జీవితంలో మర్చిపోలేను.. మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది.. చంద్రబాబు భావోద్వేగం..

Chandrababu Naidu - Bhuvaneswari: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత 52 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం విడుదలయ్యారు. చంద్రబాబు ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.

Chandrababu: జీవితంలో మర్చిపోలేను.. మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది.. చంద్రబాబు భావోద్వేగం..
Chandrababu - Nara Bhuvaneswari
Shaik Madar Saheb
|

Updated on: Oct 31, 2023 | 5:50 PM

Share

Chandrababu Naidu – Bhuvaneswari: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత 52 రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం విడుదలయ్యారు. చంద్రబాబు ఆరోగ్య కారణాలు, కంటి ఆపరేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. సుధీర్ఘ వాదనల తర్వాత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి, జైల్లో చేసిన ఆరోగ్య పరీక్షలు, వైద్యుల నివేదికలు, చంద్రబాబు వ్యక్తిగత వైద్యుల లేఖలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బయటకు రాగానే మనవడు దేవాన్ష్‌ను హత్తుకొని ముద్దాడారు. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబు మట్లాడారు.

“మీ అభిమానంతో నా జన్మ ధన్యమైంది. నేను చేసిన అభివృద్ధిని 52 రోజులూ గుర్తు చేసుకున్నారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు మీరందరూ మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ, విదేశాల్లోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి సంఘీభావం తెలిపారు.. పూజలు, ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానాన్ని జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

క్షణం ఒక యుగంలా గడిచింది..

కాగా.. చంద్రబాబు విడుదల అనంతరం ఆయన సతీమణి నారా భువనేశ్వరి భావోద్వేగ ట్వీట్ ను ఎక్స్ ప్లాట్ ఫాంలో పంచుకున్నారు. ‘‘చంద్రబాబు అరెస్టుతో ఈ 53 రోజుల కాలం ఎంతో వేదన.. తట్టుకోలేనంత బాధతో క్షణం ఒక యుగంలా గడిచింది. అయితే ఈ కష్ట సమయంలో తెలుగు జాతి నుంచి వచ్చిన మద్దతు మాకు ఎంతో ఊరటనిచ్చింది. సత్యం బలం ఎంతో చూపించింది. ఎప్పుడూ బయటకు రాని మహిళలు సైతం, కక్ష సాధింపు రాజకీయాలపై పోరాటంలో, రోడ్డెక్కి చేసిన నిరసనలు, వారు చూపిన తెగువ, మాకు మరింత స్ఫూర్తినిచ్చాయి. నిజం గెలవాలి అనే పోరాటంలో మద్దతుగా నిలిచిన ప్రతి సోదరుడికి, ప్రతి మహిళకు, ప్రతి పౌరుడికి శిరసు వంచి కృతజ్ఞతలు చెపుతున్నా. నా భర్త అరెస్టుతో 53 రోజులుగా ఇక్కడే బస చేసిన నన్ను మీ ఇంటి బిడ్డలా చూసుకున్న రాజమహేంద్రవరం ప్రజల ఆదరణ, ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ఆ దేవుడి దయతో ప్రజలకు, రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకుంటూ.. మీ భువనేశ్వరి.. అంటూ ఎక్స్ లో షేర్ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..