AP News: సమాచార హక్కు కమిషనర్ల నియామకం.. రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ..
ఆర్టీఐ కమిషనర్ల భర్తీపై సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగే సమావేశానికి రావాలంటూ చంద్రబాబుకు ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఒక రోజు ముందు చెప్పటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు ఆర్టీఐ కమిషనర్ల భర్తీపై నేడు కీలక సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రావాలంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రభుత్వం లేఖ రాసింది. అయితే ఆర్టీఐ కమిషనర్ల నియామక కమిటీ మీటింగ్ గురించి తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2 వారాల ముందుగా సమాచారం ఇవ్వాల్సి ఉండగా ఇంత ఆలస్యంగా సమాచారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తూ ఆయన ప్రభుత్వానికి లేఖ రాశారు. సెలక్షన్ కమిటీ దరఖాస్తు చేసుకున్నవారి పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు చంద్రబాబు. ఉప లోకాయుక్త నియామకం విషయంలో కూడా ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు.
గతంలోనూ చంద్రబాబు హాజరు కాకుండానే సమాచార హక్కు కమిషనర్ల నియామకంపై ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కమిటీ ఆమోదించింది. ఆ తర్వాత కమిటీ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో నేడు జరిగే ఏపీ సమాచార కమిషనర్ల నియామక కమిటీ సమావేశానికి చంద్రబాబు హాజరయ్యే అవకాశం లేదని సమాచారం. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం..లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సర్వీస్, మేనేజ్‌మెంట్, జర్నలిజం, మాస్ మీడియాలో అనుభవం ఉన్న వ్యక్తులను సమాచార హక్కు కమిషనర్లుగా ఎంపిక చేస్తారు. ఈ పదవులకు ఎంపిక అయ్యే వ్యక్తులు లోక్‌సభలో కానీ, రాష్ట్ర శాసనసభలో కానీ, ఆదాయం వచ్చే పదవుల్లో, వ్యాపారాల్లోనూ ఉండకూడదనే నిబంధనలున్నాయి. ఏ పార్టీలతోనూ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండకూడదని ఆర్టీఐ యాక్ట్ తెలియజేస్తోంది.