చూడ చక్కని రూపాలు ఇప్పుడు ఫోటోలకే పరిమితం.. అక్కా తమ్ముడ్ని మింగేసిన లారీ.. ఆ తల్లి బాధ వర్ణణాతీతం

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయి ఇంటికి అండగా నిలవాలని అక్క.. ఆర్మీలో చేరి దేశరక్షణలో పాలుపంచుకోవాలని తమ్ముడు. నిజంగా.. కష్టానికే కష్టం వారి కన్నీటి కథనం. ఆ ఇంటికి కంటిపాపలే కాదు..

చూడ చక్కని రూపాలు ఇప్పుడు ఫోటోలకే పరిమితం.. అక్కా తమ్ముడ్ని మింగేసిన లారీ.. ఆ తల్లి బాధ వర్ణణాతీతం
Sister Brother Death
Follow us

|

Updated on: Apr 12, 2021 | 5:26 PM

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ అయి ఇంటికి అండగా నిలవాలని అక్క.. ఆర్మీలో చేరి దేశరక్షణలో పాలుపంచుకోవాలని తమ్ముడు. నిజంగా.. కష్టానికే కష్టం వారి కన్నీటి కథనం. ఆ ఇంటికి కంటిపాపలే కాదు.. భవిష్యత్‌ ఊసులు కూడా వారే. ఎన్నో ఆశలతో చదువులో రాణిస్తున్నారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి ఆసరాగా ఉంటారనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకోటి తలుస్తాడన్నట్టుగా… ఆ పిల్లల భవిష్యత్‌ను ఛిద్రం చేసింది విధి. లారీరూపంలో వారిద్దరిని కబళించగా… కన్నవారి కలల్ని కల్లోలంలోకి నెట్టేసింది.

ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరు చదువుల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ఊర్మిళ, గోపిచంద్‌ ఇద్దరూ అక్కా తమ్ముడు. ఇంటికి దీపం వీరిద్దరే. ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు వీరిని చదివించారు. ఎంత కష్టమున్నా.. ఆ కష్టాన్ని తెలియకుండా పెంచారు. చదువులో పిల్లలు రాణిస్తుండడంతో తమ కష్టాన్ని కూడా మరిచిపోయారు. ఇప్పుడు కష్టపడ్డా భవిష్యత్‌లో తమకు అండగా ఉండకపోరా అని అనుకున్నారు.. కానీ అంతలోనే విధి వక్రీకరించింది.

గుంటూరు జిల్లా పొట్లపాడుకు చెందిన శ్రీనివాసరావు, పార్వతి దంపతుల గారాల పట్టీలు వీరిద్దరు. ఇంటికి పెద్దదైన బిడ్డ ఊర్మిళ బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతుండగా.. కొడుకు గోపిచంద్‌ ఇంటర్‌ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఊర్మిళ బీటెక్‌ పరీక్షలు ఉండగా.. అక్కను కాలేజీలో దింపేందుకు బైక్‌పై తీసుకెళ్లాడు గోపిచంద్‌. అలా కొద్దిదూరం వెళ్లారో లేదో.. జంగంగుంట్లపాలెం దగ్గర లారీ రూపంలో వీరిని మృత్యువు కబళించింది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే పోలీసులకు ఇన్ఫామ్‌ చేసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే సమయం దాటిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో.. గంటల వ్యవధిలోనే అక్కాతమ్ముడు ప్రాణలు వదిలారు. ఆ ఇంటిని చీకట్లోకి నెట్టేశారు. బిడ్డలే భవిష్యత్‌గా బతుకుతున్న పార్వతి, శ్రీనివాస్‌లు.. ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

నిన్నటి వరకు సందడిగా ఉన్న ఇళ్లు ఒక్కసారిగా బోసిపోయింది. ప్రమాదంలో పిల్లలిద్దరినీ కోల్పోయిన విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదంలో పిల్లలిద్దరూ పోగా.. ఆ సమయంలో వారి వెంట ఉన్న కాలేజీ బ్యాగులే చివరి గుర్తులుగా మిగిలాయి. సాఫ్ట్‌వేర్‌ అయి ఊర్మిళ.. ఆర్మీలో చేరి దేశరక్షణలో సేవలు అందించాలని గోపిచంద్‌ కన్న కలలు.. ఇప్పుడు కలలాగే మిగిలిపోవడంతో తల్లి పార్వతి కన్నీరుమున్నీరవుతోంది. దేవుడు ఇంత అన్యాయం చేస్తాడని అనుకోలేదని వారి ఫోటోలను చూస్తూ.. కన్నీటిసుడులను దిగమింగుకుంటోంది.

Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

ప్రపంచంలో ఇది అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు.. దీన్ని తాకినా కూడా ఔట్