Andhra Pradesh: వారికి కళ్లు లేకపోతేనేం నిండు మనసుందిగా.. వరద బాధితులకు అండగా అంధ దంపతులు..!
Andhra Pradesh: సాయం చేయాలన్న మనసు, తపన ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కన్రెర్ర చేసిన ప్రకృతి ప్రకోపం.. కళ్లకు కనిపించకుపోయినా
Andhra Pradesh: సాయం చేయాలన్న మనసు, తపన ముందు అంగవైకల్యం ఓడిపోయింది. కన్రెర్ర చేసిన ప్రకృతి ప్రకోపం.. కళ్లకు కనిపించకుపోయినా వారి మనసుకు కనిపించింది. ఆ విపత్తు కారణంగా జనాలు పడుతున్న అవస్థలు వారి మనసును కదిలించాయి. అందుకే.. బాధితులకు అండగా నిలిచారు. వివరాల్లోకెళితే.. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి శ్రీరామ్ పేట గత నాలుగు రోజులుగా వరద ముంపులోనే కూరుకుపోయింది. వరద కారణంగా ఇళ్లలోకి సైతం నీరు చేరడంతో వరద బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తినడానికి తిండి కూడా దొరక్క అవస్థలు పడ్డారు. అయితే, వరద బాధితుల కష్టాలను మీడియాలో చూసి.. చలించిపోయారు కాకినాడలో ఉద్యోగం చేస్తున్న డాక్టర్ సత్యనారాయణ రాజు ఆమె భార్య విజయ కుమారి. నిజానికి ఈ దంపతులిద్దరూ అంధులు. అయినప్పటికీ.. బాధితులకు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. దాదాపు 100 బాధిత కుటుంబాలకు పులిహోర ప్యాకెట్లు తయారు చేయించి, కాకినాడ నుండి కారులో వచ్చి శ్రీరామ్ పేటలోని వరద బాధితులకు అందజేశారు. ఇంటింటికి పడవలో వెళ్లి ఆహార పొట్లను వరద బాధితులకు ఇచ్చారు. అంధులై ఉండి ఇటువంటి కష్టకాలంలో ఒక పూట ఆహారం అందించిన దంపతులకు వరద బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..