Prakasam district: వామ్మో చూసినవారు జుగుప్సకు గురయ్యేలా.. రోడ్డుపై మనిషి బొమ్మ వేసి.. కందులు, శనగలతో
చెరువు కట్ట పక్కన రోడ్డు మీద ముగ్గుతో పెద్ద బొమ్మ వేసి దానిమీద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గతంలో కూడా ఈ గ్రామంలో చెరువు కట్టపై క్షుద్ర పూజలు జరగాయని గ్రామస్థులు వాపోతున్నారు.
ప్రకాశం జిల్లా, జులై 27: చంద్రయాన్ 3 లాంచ్ చేసి చంద్రుడిపై మర్మాలను కనుక్కునేంతగా ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ది చెందుతుంటే కొన్ని గ్రామాల్లో ఇంకా మంత్రాలకు చింతకాయలు రాలుతాయని జనం నమ్ముతూనే ఉన్నారు. సాంకేతికంగా ఎంతో అభివృద్ది సాధిస్తున్న ఈ రోజుల్లో ఇంకా గ్రామాల్లో బాణామతి, చేతబడులను నమ్ముతున్నారనడానికి అక్కడక్కడ వెలుగుచూస్తున్న ఉదంతాలు కలవరానికి గురిచేస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా పడమర వీరాయపాలెంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి.
కురిచేడు మండలం పడమరవీరాయపాలెంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గ్రామం నుంచి భూమయ్య పాలెం వెళ్లేదారిలో చెరువు కట్ట పక్కన రోడ్డు మీద ముగ్గుతో పెద్ద బొమ్మ వేసి దానిమీద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. గతంలో కూడా ఈ గ్రామంలో చెరువు కట్టపై క్షుద్ర పూజలు జరగాయని గ్రామస్థులు వాపోతున్నారు. చెరవుకట్టపై మనిషి ఆకారంలో ముగ్గు వేసి, దానిపై నిమ్మకాయలు, గుమ్మడి కాయలు, పసుపు, కుంకుమ వేశారు. మరోపక్క కందులు, శనగలు చుట్టూరా పెట్టారు. కొబ్బరికాయలు పగులగొట్టి అటూ, ఇటూ పెట్టారు… కోడిని కోసి రక్తం చల్లినట్టు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.. వీటన్నింటిని ఉపయోగించి చెరువుకట్టపై క్షుద్ర పూజలు చేసినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ క్షుద్ర పూజలు చేతబడి, బాణామతి కోసమా… లేదా గుప్త నిధుల కోసమా… అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల గుప్త నిధుల కోసం వేటగాళ్ళు దేవాలయాల్లో తవ్వకాలు చేస్తున్న నేపధ్యంలో ఈ క్షుద్రపూజలు చేసింది గుప్తనిధుల కోసమే అయ్యుంటుందన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ క్షుద్రపూజలు చేసేవారికి కొంతమంది గ్రామస్థులు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది… దీంతో పడమర వీరాయపాలెం గ్రామస్థులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేయాలని కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..