AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..

ఓ ప్రైవేట్ స్కూల్ మాస్టార్ ఇల్లు ఖాళీగా ఉందని తెలిసి లోపలికి చొరబడిన సదరు దొంగ.. బీరువాలోని క్యాష్ కొట్టేయడమే కాకుండా కిచెన్ లో దూరి వంటలు చేసుకుని తిన్నాడు. అంతటితో ఆగకుండా ఆ ఇంట్లోని టెడ్డీ బేర్ బొమ్మపై, గోడలపై నా పేరు రజ్ రామ్.. నన్ను పట్టుకుంటారా? అంటూ రాసి పోలీసులకే బహిరంగంగా సవాల్ విసిరాడు.

Andhra Pradesh: ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..
Thief Challenges Police In Bapatla
T Nagaraju
| Edited By: |

Updated on: May 28, 2026 | 9:05 PM

Share

సాధారణంగా దొంగలు ఎవరికీ దొరకకుండా గప్‌చుప్‌గా ఇంట్లోని సామాన్లు సర్దుకుని పారిపోతారు. కానీ ఇక్కడొక విచిత్రమైన దొంగ పడ్డాడు. కేవలం దొంగతనం చేయడమే కాకుండా.. యజమాని ఇంట్లో లేని సమయం చూసి దర్జాగా ఏసీ వేసుకున్నాడు, టీవీ చూశాడు, కిచెన్ లోని వస్తువులతో ప్రయోగాలు చేసి తిన్నాడు. అంతటితో ఆగకుండా గోడలపై అసభ్య పదజాలంతో పాటు ‘‘నన్ను పట్టుకుంటారా?’’ అంటూ పోలీసులకే ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు. బాపట్లలో వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. బాపట్ల పట్టణంలోని జమ్ములపాలెం రైల్వే ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఒక అద్దె ఇంట్లో సయ్యద్ పాషా అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన ఒక ప్రైవేట్ స్కూల్‌లో పీఈటీగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఆయన తన కూతురుకు వివాహం జరిపించారు.

వారం రోజుల క్రితం సయ్యద్ పాషా నర్సరావుపేటలో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్లారు. ఈ ఏడాది బక్రీద్ పండుగను కూడా కూతురు ఇంటివద్దే అందరూ కలిసి జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఇంతలోనే స్కూల్ ప్రిన్సిపాల్ నుండి అత్యవసరంగా రావాలంటూ ఫోన్ రావడంతో.. పాషా తన కొడుకును తీసుకుని వెంటనే బాపట్ల వచ్చారు. ఇంటి వద్దకు చేరుకుని ముందు తలుపు నెట్టి చూడగా, లోపలి వైపు నుండి గడి వేసి ఉన్నట్లు గమనించారు. ఏదో తేడాగా ఉందని అనుమానం వచ్చి ఇంటి వెనుక వైపునకు వెళ్లి చూడగా అక్కడ తలుపు తెరిచి ఉంది. లోపలికి వెళ్లి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా మారిపోయి ఉంది. ఇంట్లో దొంగలు పడ్డారని గ్రహించిన పాషా కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లోపల దొంగ చేసిన పనులను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు.

ఆ వింత దొంగ రెండు బెడ్‌రూమ్‌లలోని వస్తువులన్నింటినీ ఇష్టమొచ్చినట్లు కింద పడేశాడు. హాల్, కిచెన్‌లలోని సామాన్లను అటు ఇటు విసిరేశాడు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న కొంత నగదును కాజేశాడు. నగదు తీసుకున్న తర్వాత దొంగ చేసిన పనులే పోలీసులకు సైతం మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాయి. హాల్లోని ఒక గోడపై అతను బొగ్గుతోనో, పెన్నుతోనో కొన్ని రాతలు రాశాడు. అందులో.. ‘‘ఒక దొంగ ఉన్నాడు.. వాడి పేరు రజ్ రామ్.. మీరు నన్ను పట్టుకుంటారా?’’ అంటూ రాసి సవాల్ విసిరాడు. వీటితో పాటు అత్యంత అసభ్య పదజాలంతో మరికొన్ని వ్యాఖ్యలు కూడా గోడపై రాసి పెట్టాడు. సయ్యద్ పాషా ఎన్‌సీసీలో ఉన్నప్పుడు తీసుకున్న ఒక పాత ఫోటోపై పిచ్చి గీతలు గీశాడు. ఇంట్లోని టెడ్డీ బేర్ బొమ్మపై కూడా రజ్ రామ్ అని తన పేరుగా చెప్పుకుంటున్న పేరును రాశాడు.

అంతటితో ఈ దొంగ ఆగడం ముగిసిపోలేదు. ఫ్రిజ్ తెరిచి అందులోని పాలు, పెరుగు ప్యాకెట్లను బయట పడేశాడు. కిచెన్ లోకి దూరి ఉప్పు, కారం, చింతపండు అన్నీ కలుపుకొని ఏదో ఒక వింత పదార్థాన్ని తయారుచేసుకుని తిన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఆ తర్వాత హాల్లో దర్జాగా ఏసీ ఆన్ చేసుకుని, సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఎంజాయ్ చేసినట్లు ఆధారాలు దొరికాయి. దొంగ ఇంట్లో చేసిన ఈ భీభత్సాన్ని, వికృత చేష్టలను చూసి సయ్యద్ పాషా కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే క్లూస్ టీంతో రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాలను సేకరించారు. దొంగ అంత సేపు ఆ ఇంట్లోనే ఉండి ఏసీ వేసుకుని, టీవీ చూస్తున్నా చుట్టుపక్కల వారు ఎవరూ గుర్తించలేకపోవడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఛాలెంజింగ్ దొంగను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Follow Us