AP Assembly meetings: 16న బడ్జెట్.. 24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కీలక నిర్ణయం తీసుకున్న బీఏసీ భేటీ..
ఏపీ అసెంబ్లీ సమావేశాలను 9 రోజుల పాటు నిర్వహించాలని.. మార్చ్ 16 న అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశ పెట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చ్ 19న, 22న అసెంబ్లీకి సెలవు ఉండటంతో మార్చ్ 24 వరకు శాసస సభ సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం తీసుకున్న నిర్ణయంమేరకు 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు.
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసగంలో పోలవరం ప్రాజెక్టు సహా అనేక ప్రాజెక్టులకు సంబంధించి అవాస్తవాలున్నాయని టీడీపీ సభ్యులు ఆందోళన చేశారు. పోలవరం సహా ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులేవీ జరగడం లేదని.. గవర్నర్ ప్రసంగంలో అబద్ధాలున్నాయని టీడీపీ సభ్యులు అడ్డుతగిలే ప్రయత్నం చేశారు. గవర్నర్ ప్రసంగానికి నిరసనగా టీడీపీ సభ్యులు వాకౌట్ చేసి బయటికి వెళ్లిపోయారు.
ఇదిలావుంటే, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ప్రభుత్వం అబద్ధాలు చెప్పించిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఏపీ రాజధాని అంశంపై గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించకుండా సీఎం, మంత్రులు ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ.. ప్రజలను 4 ఏళ్లుగా మోసం చేస్తున్నారని పయ్యావుల విమర్శించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం