Anandayya Mandu: ఆనందయ్య మందు తయారీకి ఏర్పాట్లు షురూ.. కృష్ణపట్నం పోర్టు సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో భూమిపూజ
కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య.
Anandayya Mandu Preparation arrangements: నెల్లూరుజిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణ ఔషద తయారీకి ఇవాళ ఏర్పాట్లను మొదలు పెట్టారు. జిల్లా అధికారుల సూచనల మేరకు కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఏర్పాట్లు చేసుకున్నారు ఆనందయ్య. ఇవాళ అకాడమీ ప్రాంగణంలో మందు తయారీ కోసం ప్రత్యేకంగా తాత్కాలిక షెడ్ ను నిర్మించనున్నారు. ఈ షెడ్ నిర్మాణం కోసం ఆనందయ్య భూమి పూజ చేశారు. భగవాన్ వెంకయ్య స్వామి శిష్యుడు ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు రోజుల్లో షెడ్ నిర్మాణం.. ఇతర సదుపాయాల కల్పన పూర్తవుతుంది. తర్వాత అక్కడే మందు తయారీని మొదలు పెట్టి… సోమవారం నుండి పంపిణీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఇప్పటి వరకు ఆయన మందు పనిచేస్తుందా? లేదా? అన్నదే చర్చ. అందరి అనుమానాల్ని, సందేహాల్ని పటాపంచల్ చేస్తూ హైకోర్టు లైన్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో మందు తయారిపై గత కొద్దిరోజులుగా కొనసాగుతున్న వివాదానికి ఇవాళ్టితో తెరపడింది. ఇక తయారి సంగతి పక్కన పెడితే.. మందు పంపిణిపై కూడా జనాల్లో కొత్త డౌట్‌లు కలుగుతున్నాయి. అసలు ఆనందయ్య మందు ప్రజలకు ఏ మార్గంలో అందుతుంది? ఇదే ఇప్పుడు హాట్ టాపిగ్‌గా మారింది.
కరోనాను నయం చేసేందుకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య మందు తయారికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే.. ప్రభుత్వం మాత్రం అందుకు అభ్యంతరం తెలిపింది. ఆనందయ్య తోటలో కాకుండా…మందును కృష్ణపట్నం పోర్టులో తయారు చేయాలని నిర్ణయించింది. బహిరంగ ప్రదేశంలో మందు తయారు చేయడం సరికాదనే వాదనను వినిపించింది. పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్‌లో మందు తయారు చేయాలని సూచించారు అధికారులు. తోటలో మందు తయారీ చేయడం సెంటిమెంట్‌గా ఫీలవుతున్నట్లు ఆనందయ్య చెప్పినప్పటికి …అధికారులు తాము సూచించిన ప్రదేశంలోనే మందు తయారు చేయాలని పట్టుబట్టారు. అయితే చిట్ట చివరికి కృష్ణపట్నం పోర్టులోని సెక్యూరిటీ అకాడమీ ప్రాంగణంలో ఔషదం తయారీకి ఆనందయ్య అంగీకరించారు. దీంతో ఇవాళ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న షెడ్డూకు భూమి పూజలు నిర్వహించారు.
మరోవైపు, కరోనా మందు తయారికి కావాల్సిన వనమూలికలు సమకూర్చుకునే పనిలో పడ్డారు ఆనందయ్య టీమ్. రేపటి నుంచి మందు తయారు చేయనున్నారు. నాలుగైదు రోజుల్లో మందు తయారు చేసి ఈనెల 7వ తేది నుంచి మందు పంపిణీ చేయనున్నట్లు తెలుస్తోంది. కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకేచోట కాకుండా డీ సెంట్రలైజ్డ్ పద్ధతిలో మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ఈ మందును ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చని, పోస్టల్, కొరియర్ ద్వారా కూడా పంపిస్తామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయితే ఈ యాప్‌ని ఎవరు తయారు చేస్తున్నారు…అది ఎప్పటికి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మిగిలిన ఐదు రోజుల్లో ఇదంతా సాధ్య పడే విషయమేనా అనే సందేహాలు ఇప్పుడు అందరిలో కలుగుతున్నాయి.
కోవిడ్, కర్ఫ్యూ నిబంధనల నేపధ్యంలో ఎవరూ కృష్ణపట్నం రావద్దంటున్నారు అధికారులు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వాళ్లకు మందును పంపిణీ చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో యాప్ ద్వారా మందు కోసం బుక్ చేసుకోవచ్చన్నారు. ఆనందయ్య పంపిణీ చేసే మందును మొబైల్ యాప్ ద్వారా బాధితులకు అందించాలని నిర్ణయించారు. ఆనందయ్య మందు పంపిణీ కోసం ప్రత్యేకంగా యాప్ రూపకల్పన చేయాలని అధికార యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. మొబైల్ యాప్ ద్వారా మందును పంపిణీ చేస్తామన్నారు. మొబైల్ యాప్ రూపకల్పన పూర్తయిన తర్వాత అందులో వివరాలు ఎలా పొందుపరచాలో.. ఎంతమేర మందును వినియోగించాలో.. బాధితులు మందును ఎలా వాడాలో కూడా ఆ యాప్‌లో పొందుపరుస్తామని కలెక్టర్ చక్రధర్. మరోవైపు www.childeal.in పేరుతో website ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆనందయ్య కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సైట్ లో కస్టమర్ దరఖాస్తు చేసుకుంటే కొరియర్ ద్వారా మందు పంపిణీ చేయనున్నట్లు ఆనందయ్య టీం తెలిపింది.
అయితే, ఆనందయ్య మందును ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తామన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్. పోస్టల్, కొరియర్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. మొదట కరోనా సోకిన వారికి మందు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. అయితే, ఆనందయ్య మందు పంపిణిపై ప్రభుత్వం పాత పద్ధతిని పాటిస్తే మంచిదంటన్నారు టీడీపీ నేతలు. పార్టీలతో సంబంధం లేకుండా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఎమ్మెల్యేల జోక్యం ఉంటే కనుక కచ్చితంగా కోర్టుకు వెళతామన్నారు.