ఏవోబీలో ల్యాండ్‌మైన్ ఫియర్.. బిక్కు బిక్కుమంటున్న గిరిజనం.. మావోయిస్టుల అసలు టార్గెట్ వారేనా..?
శ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసు బలగాలు పథకాలు రచిస్తుంటే.. ఆ పోలీసులకే హడలెత్తించే ఎత్తులు వేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా మావోయిస్టులను ఏరివేసేందుకు పోలీసు బలగాలు పథకాలు రచిస్తుంటే.. ఆ పోలీసులకే హడలెత్తించే ఎత్తులు వేస్తున్నారు మావోయిస్టులు. గిరిజనులకు కూడా తెలియకుండా మందు పాతర్లు అమర్చి అదును కోసం వేచి చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మావోయిస్టుల మందుపాతర్లకు ఇద్దరు గిరిజనులు బలవడమే ఇందుకు నిదర్శనమని తెలుస్తోంది.
మన్యంలో మావోయిస్టుల అలజడి తగ్గింది. ఏవోబీలో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో మావోయిస్టుల కార్యకలాపాలు కొంతమేర తగ్గాయి. అయితే ఇటీవలే మళ్లీ ఇక్కడ పట్టు పెంచుకునేందుకు అన్నలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఏజెన్సీ కేంద్రంగా వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా కూంబింగ్ పార్టీలే టార్గెట్‌గా మావోయిస్టులు గీసిన స్కెచ్.. గిరిజనుల ప్రాణాలకు ముప్పుగా మారింది. ఇటీవల చింతలవీధి అడవిలో పేలిన ల్యాండ్‌మైన్‌కు ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. పశువులను కాసేందుకు వెళ్లిన ఇద్దరు మందుపాతరకు బలయ్యారు. ఆగస్టు 3న జరిగిన ఈ ఘటనలో మోహనరావు, అజయ్ కుమార్ శరీరాలు చిద్రమయ్యాయి. రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. గతంలో ఏ ప్రాంతంలో మందు పాతర్లు పెట్టినా మిలీషియా ద్వారా లోకల్ వాళ్లకు తెలిసేది. తెలిసీ తెలియని విధంగా సమాచారం గిరిజనులకు చేరవేసేవారు. మన్యంలో అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు పడేవారు. అయితే పోలీసు ఇన్‌ఫార్మర్లుగా గిరిజన్లు మారిపోతున్నారన్న నెపంతో మావోయిస్టులు మరింత జాగ్రత్తపడుతున్నారు. మూడో కంటికి తెలియకుండా కూంబింగ్ పార్టీలే లక్ష్యంగా చేసుకుని మందు పాతర్లు అమర్చుతున్నారు. ఈ మందుపాతర్ల విషయం తెలియని గిరిజనులు అడవిలోకి వెళ్లి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు.
ఇక ఇటీవల అరెస్టయిన కొంతమంది మావోయిస్టులు పోలీసులకు కీలక సమాచారం ఇచ్చారు. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా కూపీ లాగితే కీలక అంశాలు బయట పడ్డాయి. ఏవోబీలోని ఐదు గ్రామాల పరిధిలో మందు పాతర్లు అమర్చినట్లు తేలడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు. పెదబయలు మండలం నానాబరి, జామిగూడ, సాలేబు, చింతల వీధితో పాటు, ముచ్చంగిపుట్ట మండలం, సరియపల్లి, జీమాడుగుల మండలాల్లోని కొన్ని ప్రాంతాల్లో మందు పాతర్లు అమర్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ ప్రాంతాల్లో తిరిగే భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. అలాగే ఆ ప్రాంతాల్లో ఉండే గిరిజనులను కూడా అలర్ట్ చేశారు. మెయిన్ రోడ్లను వదిలి కొండ ప్రాంతం, అడవుల వైపు వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే చింతలవీధి ఘటనతో ఉలిక్కిపడ్డ గిరిజనులను ఇప్పుడీ మందుపాతర్ల భయం వణికిస్తోంది. ఏ సమయంలో ఏ మందు పాతర పేలుతుందో అని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు గిరిజనం.
ఇదిలాఉంటే, వారోత్సవాలు ఎప్పుడు జరిగినా మావోయిస్టులు తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తారు. తమను వెతుక్కుంటూ వచ్చే భద్రతా బలగాలే టార్గెట్‌గా మందుపాతర్లు అమర్చడం, పేల్చడం జరుగుతూనే ఉంటుంది. ఇటీవల వారోత్సవాల చివరి రోజునే ఇద్దరు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మరోసారి పీఎల్‌జీఏ వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో మావోయిస్టులు తమ వ్యూహాలకు పదును పెట్టారు. భద్రతా బలగాలే టార్గెట్‌గా మందు పాతర్లు అమర్చేశారు. ఓ చోట మైన్స్ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జామడం దగ్గర భద్రతా బలగాలే టార్గెట్‌గా గతంలో కూడా బ్లాస్ట్ జరిగింది. కాగా, మందు పాతర్ల వ్యూహంతో మావోయిస్టులు విసిరిన సవాల్‌కు పోలీసులు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు.