Andhra Pradesh: మరింత బలపడుతున్న ఆ రెండు పార్టీల బంధం.. సంకేతాలు ఇవేనా..
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అధికార వైసీపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ ఒకటేనని, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారంటూ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ కార్యక్రమంలో..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు వేడి పుట్టిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూసుకునే బాధ్యత తనదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటూ వస్తున్నాయి. ఒంటరిగా పోటీచేస్తే వైసీపీ పార్టీకి ప్రయోజనం ఉండొచ్చనే అంచనాలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేస్తే తప్పకుండా వైసీపీ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవచ్చనే ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతుండటం, గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా టీడీపీ, జనసేన లోపాయికారి పొత్తు పెట్టుకుని పోటీచేసిన చోట విజయం సాధించడం.. ఈ అంచనాలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. దీంతో అధికారికంగా టీడీపీ, జనసేన మధ్య పొత్తులపై ప్రకటన రాకపోయినప్పటికి, క్షేతస్థాయిలో ఇరు పార్టీల నాయకులు పలు కార్యక్రమాల సందర్భంగా కలిసి పనిచేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువుగా చూస్తున్నాం. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ చేసే కార్యక్రమాలకు జనసేన, పవన్ కళ్యాణ్ తలపెట్టే కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్దతు తెలుపుతున్నారు. అలాగే ఇటీవల విశాఖపట్టణం ఘటనతో పాటు, తాజాగా పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరిగిందన్న ప్రచారం నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా స్పందించడం, ఈ విషయంలో టీడీపీ నాయకులు పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మాట్లాడటం కూడా రెండు పార్టీల మధ్య బలపడుతున్న బంధానికి సంకేతాలుగా కనిపిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించింది. ఈకార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ జెండాలతో పాటు జనసేన పార్టీ జెండాలు కన్పించాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే అధికార వైసీపీ ప్రభుత్వం జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విమర్శలు చేస్తూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ ఒకటేనని, చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారంటూ ఆరోపిస్తూ వస్తోంది. తాజాగా టీడీపీ కార్యక్రమంలో జనసేన జెండాలు కన్పించడంతో వైసీపీ జనసేనను మరింత టార్గెట్ చేసే అవకాశాలు లేకపోలేదు.
ప్రస్తుతం బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నప్పటికి, ఇటీవల కాలంలో ఇరు పార్టీల మధ్య స్నేహం వికటించిందనే ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే దీనిని బీజేపీ నాయకులు ఖండిస్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీతో తమ పొత్తు కొనసాగుతుందని చెబుతున్నారు. జనసేన మాత్రం ఈ విషయంలో ఆచీతూచీ అడుగులు వేస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తన టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. 2024 శాసనసభ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే ఆయన లక్ష్యమనే విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. దీంతో వైసీపీ కూడా పవన్ ను టార్గెట్ చేసింది. దీనిలో భాగంగా దమ్ముంటే పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తామని ప్రకటించగలరా అంటూ వైసీపీ నాయకులు సవాల్ విసిరారు. అయితే ఇలాంటి సవాలు, ప్రతి సవాలుకు రాజకీయాల్లో పెద్ద విలువ ఉండదనేది జగమెరిగిన సత్యం. కాని పవన్ కళ్యాణ్ ను తమ సవాల్ కు కమిట్ చేయించాలని వైసీపీ నాయకులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా.. జనసేనాని మాత్రం ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఇటీవల విజయవాడలోని ఓ హోటల్ లో పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు నాయుడు సమావేశమై పలు కీలక అంశాలను చర్చించిన విషయం తెలిసిందే. బయటకు రాజకీయాలు మాట్లాడలేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించామని ప్రకటించినప్పటికి, రెండు పార్టీల అధినేతలు సమావేశమైనప్పుడు రాజకీయాంశాలు తప్పనిసరిగా చర్చకు వచ్చే ఉంటాయి. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు సమావేశం సందర్భంగా పొత్తులపై నిర్ణయం ప్రకటిస్తారని ఆశించినప్పటికి బహిరంగంగా ఆ ప్రకటన చేయలేదు. కాని ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి పనిచేయాలని ఇద్దరు నేతల నోట రావడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు, పార్టీ క్యాడర్ కు పరోక్షంగా పొత్తులపై సంకేతాలు ఇచ్చినట్లేనని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమంలో జనసేన పార్టీ జెండాలు కనబడటంతో ఆ పార్టీ ఆకర్యకర్తలు కూడా ఆ కార్యక్రమానికి హాజరై ఉండవచ్చు. ఈ అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే.
టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమంలో జనసేన జెండాలు
పరిటాలలో టీడీపీ బాదుడే బాదుడు కార్యక్రమానికి హాజరైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..