Andhra: ఏపీలో పిడుగులు పడే ప్రాంతాలివే.. బాబోయ్.! ఈ జిల్లాలకు హెచ్చరిక
నిన్న మండు వేసవిలో జోరువాన బీభత్సం సృష్టించింది. ఇటు తెలంగాణ, అటు ఏపీలో వర్షాలు దంచికొట్టాయి. హైదరాబాద్‌లో రహదారులు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల చెట్టు నెలకొరిగాయి. మరికొన్ని ప్రాంతాల్లో హోర్డింగులు విరిగిపడ్డాయి. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పంట నష్టం జరగడంతో... రైతన్నలు లబోదిబోమంటున్నారు.

రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు బుధవారం వరకు కొనసాగనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.
ఆదివారం (04-05-25): శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా,ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మరియు సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదన్నారు. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు రానున్న రెండు రోజులు ఉష్ణోగ్రతలు 41.5°C – 43°C మధ్య రికార్డు అయ్యే అవకాశం ఉందన్నారు. శనివారం తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 42.8°C, ప్రకాశం జిల్లా బోట్లగూడూరు 41.5°C, పల్నాడు క్రోసూరు 41°C చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఎండ తీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.




