Chandrababu Naidu: చంద్రబాబు, బొండా ఉమకు ‘మహిళా కమిషన్’ నోటీసులు.. 27న హాజరు కావాలని..
AP Women’s Commission: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది.
AP Women’s Commission: ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఈ క్రమంలో మహిళా కమిషన్ ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది. ఈనెల 27న మంగళగిరిలోని కమిషన్ కార్యాలయంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలి అత్యాచారం ఘటనపై విచారణ జరిపేందుకు వెళ్లిన తనను అడ్డుకుని, దూషించారని అన్నారు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ. 1998 ఏపీ మహిళా కమిషన్ చట్టం, సెక్షన్ 14 ప్రకారం కమిషన్‌కు కోర్టు తరహాలో విచారణ జరిపే అధికారాలున్నట్లు చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో తెలిపింది కమిషన్. అత్యాచార బాధితురాలిని కలిసేందుకు ఆసుపత్రికి వెళ్లిన సమయంలో చంద్రబాబు, టీడీపీ నేతలు అడ్డుకుని గొడవ పడ్డారని, అక్కడి రోగులను భయాందోళనలకు గురి చేశారని వాసిరెడ్డి పద్మ ఆరోపించారు.
గౌరవప్రదమైన హోదాలో ఉన్నవారిని ఇలా అవమానపర్చటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. 27న వ్యక్తిగతంగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. చంద్రబాబుతోపాటు టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావుకు కూడా నోటీసులు ఇచ్చారు. మహిళా కమిషన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసు జారీ చేయటంపై ఘాటుగా స్పందించారు నారా లోకేష్. ప్రభుత్వాస్పత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన యువతికి న్యాయం చేయాలని అడగటమే నేరమా అని ప్రశ్నించారు. మహిళల శీలానికి రేటు కట్టి ఉన్మాదులను రెచ్చిపోమంటూ విచ్చలవిడిగా రోడ్ల మీద వదిలేస్తున్న వారికి ఎప్పుడు నోటీసులు ఇస్తారని నిలదీశారు.
Also Read: