Weather Alert: ఓ వైపు ఎండ, మరోవైపు వాన.. రాబోయే రెండ్రోజులు ఏ జిల్లాలో వాతావరణం ఎలా ఉండబోతుంది!
మండే ఎండలలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ వాసులకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని, రాబోయే రెండ్రోజుల పాటు వాతావరణం ఇలానే ఉండనుందని పేర్కొంది. ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత, మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన అకాల వర్షాల కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆది, సోమవారాల్లో మన్యం, అల్లూరి, పోలవరం, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు,పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించారు.
శనివారం గరిష్ఠంగా కడపజిల్లా ఒంటిమిట్టలో 45డిగ్రీలు నమోదైందని తెలిపారు. 244 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఎపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. అలాగే అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు తెలిపారు. ఆదివారం పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
విజయనగరం జిల్లాలోని బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, మెంటాడ, రామభద్రాపురం, తెర్లాం, వంగర మండలాల్లో , పార్వతీపురంమన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కొమరాడ, కురుపాం, మక్కువ, పాచిపెంట, పాలకొండ, పార్వతీపురం, సాలూరు,సీతంపేట, సీతానగరం, వీరఘట్టం మండలాల్లో ఆదివారం తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రప్తంగా 25 మండలాల్లో వడగాలులు వీస్తాయని స్పష్టం చేశారు.
ఇక శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. కడప జిల్లా ఒంటిమిట్టలో 45° డిగ్రీలు, నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 44.3°డిగ్రీలు, అనంతపురం(జి) తెరన్నపల్లిలో 44.1 డిగ్రీలు తిరుపతి(జి) వరదయ్యపాలెంలో 43.5 డిగ్రీలు, మార్కాపురం(జి) కొమరోలులో 43 డిగ్రీలు, కాకినాడ(జి) కరప, శ్రీసత్యసాయి(జి) కొత్తచెరువులో 42.9 డిగ్రీలు , ప్రకాశం(జి) కొప్పెరపాడులో 42.5 డిగ్రీలు , పల్నాడు(జి) గురజాలలో 42.3 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా నూలివీడులో 41.9 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు,మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
