Andhra Pradesh Rains: వాయుగుండం ఎఫెక్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో భారీగా వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..
AP Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది.
AP Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటింది. ఈ నెల 13వ తేదీన దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని తాకడంతో వానలు, ఈదురు గాలుల ప్రభావం తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో తూర్పుగోదావరిజిల్లా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో కాలంగి నది, పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సోమశిల రిజర్వాయర్‌కు వరద ఉధృతి భారీగా పెరిగింది. దాంతో 40 వేల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు అధికారులు. మావిళ్ళపాడు, తనయాలి మధ్య కాలంగి ఉధృతంగా ప్రవహిస్తోంది. 50 కి పైగా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూళ్లూరుపేట వద్ద కాలంగి నీరు హైవేపైకి వచ్చింది. దాంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మరో 24 గంటలపాటు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇక కడప జిల్లా వ్యాప్తంగా 7.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికారులు.. జిల్లాలో 4కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు. బుగ్గవంక పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. బుగ్గవంక ఇన్ ప్లో 4300 క్యూసెక్కులు ఉండగా, స్పిల్వే ద్వారా 1400క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక చిట్వేలలో యలమరాజ చెరువు పొంగుతోంది. రైల్వేకోడూరులో గుంజన ఏరు పొంగిపొర్లుతోంది. పుల్లంపేటలో పుల్లంగేరు ఉదృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. జిల్లా హెడ్ క్వార్టర్ లో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ సబ్ డివిజన్ లలో ఒక రెస్క్యూటీమ్‌ను ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. వరి పంట కోతకు వచ్చిన ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి పంట కోత చేపట్టారు రైతులు. కోసిన వరి పంట పొలాల్లోనే నీటి మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షాలకు నీట మునగడంతో కన్నీరు మున్నీరవుతున్నారు రైతులు.
Also read:
TRS Protest: వరి కొనుగోలుపై కేంద్రంపై యుద్ధం.. నేడు రాష్ట్రవ్యాప్తంగా టిఆర్ఎస్ ఆందోళనలు..