AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన రాజధాని రాజకీయం.. మొదలైన వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రాజకీయం హీటెక్కుతోంది. ఓ వైపు అమరావతే రాజధాని అంటూ అమరావతి అరసవిల్లి వరకు రైతులు మహాపాదయాత్ర చేస్తుంటే.. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర తో పాటు..

Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన రాజధాని రాజకీయం.. మొదలైన వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం
Jac Meeting
Amarnadh Daneti
|

Updated on: Oct 08, 2022 | 11:53 AM

Share

ఆంధ్రప్రదేశ్ లో రాజధాని రాజకీయం హీటెక్కుతోంది. ఓ వైపు అమరావతే రాజధాని అంటూ అమరావతి అరసవిల్లి వరకు రైతులు మహాపాదయాత్ర చేస్తుంటే.. వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్ర తో పాటు ఏపీ వ్యాప్తంగా వైసీపీతో పాటు మరికొన్ని ప్రజాసంఘాలు, మేధావులు సభలు, సమావేశాలు నిర్వహించడం రాజకీయ రచ్చకు దారితీస్తోంది. ఈలోపు వికేంద్రీకరణకు మద్దతుగా తాము రాజీనామాలు చేస్తామంటూ ఉత్తరాంధ్రాకు చెందిన నాయకులు ప్రకటించడం కలకలం రేపుతోంది. ఇప్పటికే చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తాను వికేంద్రీకరణకు మద్దతుగా స్పీకర్ ఫార్మట్ లో రాజీనామాకు సిద్ధమంటూ.. కాపీని వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పడిన జేఏసీ కన్వీనర్ కు అందజేశారు. ప్రస్తుతానికి ఈ రాజీనామాను స్పీకర్ కు అందజేయలేదు. దీంతో రాజధాని అంశంపై రాజకీయం తీవ్ర దుమారాన్నే రేపుతోంది. విశాఖపట్టణంలో కార్యనిర్వహక రాజధాని ఏర్పాటుచేసి తీరుతామని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తాము వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని అధికార వైసీపీ స్పష్టం చేసింది. అయితే ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేస్తున్న పాదయాత్ర మరికొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలోకి ప్రవేశించనుంది. దీంతో ఆ పాదయాత్రకు పోటీగా అధికార వైసీపీతో పాటు వికేంద్రీకరణకు మద్దతు ఇస్తున్న మరికొంతమంది పలు కార్యక్రమాలకు ప్లాన్ చేశారు.

ఇప్పటికే మేధావులు, విద్యార్థులు, పలువురు ప్రముఖులతో రౌంట్ టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేసి చేపట్టిన మహాపాదయాత్ర ఉత్తరాంధ్రాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో.. అక్కడి వైసీపీ నేతలతో పాటు వికేంద్రీకరణకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాలని, అవసరమైతే మహా పాదయాత్రకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కాగా.. విశాఖపట్టణంలో వికేంద్రీకరణకు మద్దతుగా ఏర్పాటైన జేఏసీ శనివారం విశాఖపట్టణంలో సమావేశమైంది. అంబేద్కర్‌ యూనివర్శిటీ మాజీ ఉప కులపతి హనుమంతు లజపతిరాయ్‌ జేఏసీ కన్వినర్‌గా నియమితులయ్యారు. జేఏసీలో సభ్యులుగా ప్రొఫెసర్లు, వైద్యులు, న్యాయవాదులు, జర్నలిస్టులు సహా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఉన్నారు. అక్టోబర్‌ 15న విశాఖ రాజధానికి మద్దతుగా భారీ ర్యాలీ చేపట్టాలని జేఏసీ నిర్ణయించింది. కాగా.. శనివారం జెఎసీ కన్వీనర్ మాజీ ఉపకులపతి హనుమంతు లజపతిరాయ్‌ అధ్యక్షతన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులు భేటీ జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్నాథ్‌, మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ.. విశాఖకు రాజధాని, అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా జేఏసీ ఆవిర్భవించిందన్నారు. రాజకీయేతర జేఏసీలో ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ప్రజాసంఘాల భాగస్వామ్యం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.

విభజనతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం అయితే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని చెప్పారు. అమరావతికి అన్యాయం చేస్తామని ఎక్కడా చెప్పలేదన్నారు. అమరావతి సహా కర్నూలు, విశాఖ ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అవసరమైతే విశాఖ రాజధాని కోసం తన పదవికి రాజీనామా చేస్తానని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.

ఇవి కూడా చదవండి

అధికార పార్టీ ఎమ్మెల్యేల రాజీనామా ప్రకటనలతో ఒక్కసారిగా ఏపీ రాజకీయం హీటెక్కింది. మరోవైపు తాము వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాకు సిద్ధమని, రాజధాని అమరావతికి మద్దతుగా టీడీపీ టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు రాజీనామా చేస్తారా అంటూ కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రాలో కార్యనిర్వహక రాజధానికి మద్దతు ఇస్తార, అమరావతి రైతుల మహా పాదయాత్రకు మద్దతు ఇస్తారా అనే విషయంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడును ఇరుకున పెట్టేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఈ రాజీనామాల ఛాలెంజ్ ఎటు వెళ్తుందనేది వేచి చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..