AP Rains: మరో అల్పపీడనం.. ఏపీకి ఈ నెల 18 నుంచి మళ్లీ వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు..
గత నాలుగైదు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయని అనుకునేలోపు..
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వదట్లేదు. గత నాలుగైదు రోజులుగా రాయలసీమ, దక్షిణ కోస్తాంద్ర ప్రాంతాల్లో కురుస్తున్న వానలు.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టాయని అనుకునేలోపు మరోసారి రాష్ట్రాన్ని వానలు ముంచెత్తనున్నాయి. రెండు రోజుల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడే మరో అల్పపీడన ప్రభావం కారణంగా ఏపీలో మళ్లీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
గత కొద్దిరోజులుగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 13న ఆగ్నేయ అరేబియా సముద్రంలో విలీనమైంది. అలాగే ఈ నెల 16వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో 18 నుంచి రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. రానున్న రెండు రోజుల్లో దక్షిణ కోస్తాంద్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.
కాగా, అటు ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా పడుతున్న వర్షాలతో నెల్లూరు నగరంలో లో తట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జిలోకి వరద నీరు చేరింది. దీంతో మినీ బైపాస్ నుంచి జీటీ రోడ్డులోకి వచ్చేందుకు జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇటు భారీ వర్షాలతో అపార్ల్‌మెంట్ సెల్లార్‌లోకి నీరు చేరింది. దీంతో వాహనాలు నీట మునిగాయి. కావలిలో కూడా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజుల్లో దాదాపు ఐదు సెంటీమీటర్ల వర్షం పాతం నమోదైంది. ఇటు ఉదయగిరి, కావలి, గూడూరు నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..