Andhra Pradesh: పోటాపోటీ ఆరోపణలు.. ఫిర్యాదులు.. వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు..

పోటాపోటీ ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతున్నాయి..ఏపీ రాజకీయాలు. రాజకీయ పార్టీలతో పాటు అధికారులు కూడా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. దీంతో నోటీసుల జారీలో బిజీగా మారింది ఎన్నికల సంఘం.

Andhra Pradesh: పోటాపోటీ ఆరోపణలు.. ఫిర్యాదులు.. వేడెక్కుతున్న ఏపీ రాజకీయాలు..
Ap Politics

Updated on: Apr 06, 2024 | 9:07 AM

ఎన్నికల నిర్వహణలో అధికారులు, పోలీసుల పాత్రే కీలకం. కోడ్‌ వచ్చిన తర్వాత ప్రభుత్వం పాత్రే పరిమితమే. ఈ క్రమంలో కొందరు రాజకీయ నేతలు ఐపీఎస్‌లపై చేస్తున్న నిరాధార ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించింది.. ఐపీఎస్‌ అధికారుల సంఘం. ఐపీఎస్‌లను అవమానించేలా చేస్తున్న ఆరోపణలను ఈసీ దృష్టికి తీసుకెళ్తామని IPSల అసోసియేషన్ఎగ్జిక్యూటివ్ మెంబర్ కాంతిరానాటాటా స్పష్టం చేశారు. పోలీస్‌ అధికారులు పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని..కానీ కొందరు రాజకీయ నేతలు చేస్తున్న ఆరోపణలు పోలీస్‌ యంత్రాంగాన్ని నిరుత్సాహపర్చేలా ఉంటున్నాయని ఆరోపించారు..

మరోవైపు పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు ఇతర నేతలపై నమోదైన కేసులు వివరాలివ్వాలని కోరుతూ డీజీపీని కలిసింది..టీడీపీ నేతల బృందం. టీడీపీ నేతలపై దాడుల వ్యవహారంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అన్ని పార్టీల నేతల పట్ల సమానంగా వ్యవహారించాల్సిన పోలీసులు.. వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

సీఎం జగన్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది..వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ. తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా..టీడీపీ నేతలు తమ అధినేతపై తప్పుడు ఆరోపణలకే పరిమితమవుతున్నారు వైసీపీ నేత మల్లాది విష్ణు ఆరోపించారు. ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఆ పార్టీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మరి ఈ వరుస ఫిర్యాదులు, ఆరోపణలు, ప్రత్యారోపణలపై ఈసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం