Andhra Pradesh: చంద్రబాబు నాయుడుకు మంత్రి అంబటి రాంబాబు మూడు ప్రశ్నలు.. సమాధానం చెప్పాలని డిమాండ్..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు..
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పోలవరంలో పర్యటించే ముందు చంద్రబాబు నాయుడు 3 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ప్రాజెక్టు వద్ద రాజకీయ కార్యక్రమాలకు అనుమతి లేదని.. ఈ విషయం పోలీసులు చెప్పినా తెలుగుదేశం నేతలు పట్టించుకోలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి వ్యయం కేంద్రం భరించాలని చట్టంలో ఉంటే.. గతంలో రాష్ట్రం ఎందుకు నెత్తిన వేసుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘పోలవరం ప్రాజెక్టును తాము నిర్మిస్తాం.. మీరు డబ్బులివ్వండి అని గత ప్రభుత్వం ఎందుకు భుజాన వేసుకుందని ప్రశ్నించారు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలన్నారు. 2018 నాటికి పోలవరం ద్వారా నీళ్లిచ్చి ఎన్నికలకు వెళ్తామని శాసనసభలో బల్లగుద్ది సవాల్ చేసి చెప్పారని, మరి ఎందుకు పూర్తి చేయలేకపోయారన్నారు. కాఫర్ డ్యాం నిర్మించకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం ఎలా చేశారన్నారు. ఇది చారిత్రక తప్పిదం కాదా అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఈ మూడింటికి సమాధానం చెప్పిన తర్వాత మమ్మల్ని ప్రశ్నించాలంటూ అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇదేమి కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు చంద్రబాబు నాయుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరంలో పర్యటించారు ..ఈ సందర్భంలో ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. చంద్రబాబునాయుడిని పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో చంద్రబాబు వాగ్వాదానికి దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును సీఏం జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారని ఆయన ఆరోపించారు. ఏ కారణంతో పోలీసులు తనను అడ్డుకున్నారో చెప్పాలన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..