Andhra Pradesh: కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. స్మృతి వనం కోసం రెండెకరాల భూమి
దివంగత రెబల్‌స్టార్ కృష్ణంరాజు గౌరవార్థం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణం రాజు స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమి మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు స్మృతి వనం ఏర్పాటు కోసం రెండెకరాల భూమిని కేటాయించి, మంజూరు చేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు హాజరైన మంత్రులు అధికారికంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులోని కృష్ణంరాజు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంస్మరణ సభకు ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా..మంత్రులు కారుమూరి, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజులు హాజరయ్యారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం తరఫున తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు సభకు హాజరైన ఏపీ మంత్రులు. కృష్ణంరాజు హఠాన్మరణం తీరని లోటు అని, చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు మంత్రి రోజా. రాష్ట్ర టూరిజం డిపార్ట్‌మెంట్ తరపున మొగల్తూరు తీర ప్రాంతం పేరుపాలెం బీచ్‌లో స్మృతివనం కోసం రెండెకరాల స్థలం కేటాయిస్తున్నట్లు రోజా ప్రకటించారు.
కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో నిర్వహించారు. దివంగత నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరుకి భారీగా అభిమానులు హాజరయ్యారు. పరసర ప్రాంతాల ప్రజలు సైతం సంస్మరణ సభకు భారీగా హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం కృష్ణం రాజు పేరిట స్మృతివనం ఏర్పాటుకి స్థలం కేటాయిస్తున్నట్టు వారి కుటుంబానికి కూడా తెలియజేశామన్నారు రోజా.
ప్రభాస్‌ను భారీగా తరలివచ్చిన జనం…
చుట్టూ వేలాది మంది అభిమానులు… మిన్నంటిన నినాదాలు… తమ అభిమాన నేత కృష్ణం రాజును తలచుకుంటూ సుమారు 11 ఏళ్ల తర్వాత మళ్లీ సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రభాస్‌కు రెబల్ స్టార్.. రెబల్ స్టార్ అంటూ జేజేలు పలికారు. ప్రభాస్ కౌటౌట్స్ పట్టుకొని కేరింతలు కొడుతూ ప్రభాస్ కనిపించగానే ఒక్కసారిగా గొల చేశారు. వాళ్ల అభిమానాన్ని చూసిన ప్రభాస్ కూడా లవ్యూ ఆల్ అంటూ వాళ్లను విష్ చేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ సన్నివేశం జరిగింది. ఆపై కాసేపట్లో భోజనాలు సిద్ధమవుతున్నాయని తినేసి వెళ్లండని … మళ్లీ కలుద్దామంటూ ప్రభాస్ వాళ్ల దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నారు. కాగా సంస్మరణ సభకు వచ్చినవాళ్లకు కనివినీ ఎరుగని రీతిలో భోజనం వడ్డించారు. మటన్, చికెన్, ప్రాన్స్, రొయ్యల వంటి వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..