Amaravati: అమరావతిపై చంద్రబాబు సర్కార్ ఫుల్ ఫోకస్.. నిర్మాణాలకు సీఆర్‌డీఏ తొలి ఆమోదం.. మొత్తం ఎన్ని వేల కోట్లంటే..
ప్రభుత్వం ఆమోదించిన పనుల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్‌మెంట్లు, ఐఎఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు ఉన్నాయి. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి కొత్త ఊపరిపోసుకుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అమరావతి సహా పోలవరంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది ప్రభుత్వం. ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణాలపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం.. నిధులు సమకూర్చడంపై ఫోకస్ పెట్టింది. నిర్మాణాలకు సంబంధించితాజాగా ముందుడుగు పడింది. CRDA ఆమోదించిన 20 సివిల్ పనులను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పనులకు 11 వేల 467 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా కార్యాచరణ సిద్ధమౌతుంది.
ప్రభుత్వం ఆమోదించిన పనుల్లో గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్‌మెంట్లు, ఐఎఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు ఉన్నాయి. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఎఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం నిధులను వెచ్చించాలని నిర్ణయించింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 1200 ఫ్లాట్స్‌తో నిర్మించనున్న12 టవర్ల నిర్మాణానికి 984 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగును వెడల్పు చేయటంతో పాటు శాఖమూరు, నీరు కొండ దగ్గర రిజర్వాయర్ నిర్మాణం కోసం 1585 కోట్ల రూపాయలు వెచ్చించనుంది.
రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లే అవుట్‌లలో రోడ్లు, మౌలిక వసతుల కోసం ఇప్పటికే 3,859 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. జనవరిలో పనులు ప్రారంభించి, మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేసేలా అడుగులు వేస్తోంది. అమరావతి అభివృద్ధిలో భాగంగా తొలిదశలో 15 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అత్యున్నత ప్రమాణాలతో అమరావతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తారు, ట్రంకు రోడ్లను నిర్మిస్తారు. వరద నీటి నిర్వహణ పనులు, రిజర్వాయర్ల పునరుద్ధరణ, వరదను తట్టుకునే వ్యవస్థలను నిర్మిస్తారు. స్వచ్ఛమైన నీటి సరఫరా వ్యవస్థ, రోడ్లు, పార్కులు, హరిత నిర్మాణాలు చేపడుతారు. అత్యున్నత ప్రమాణాలతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అనుగుణంగానే అడుగులు పడుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..